హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన విడిభాగాల తయారీ రంగంలో భారత జోరు కొనసాగుతోంది. 2022 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో పరిశ్రమ 34.8 శాతం వృద్ధితో రూ.2.65 లక్షల కోట్లు నమోదు చేసింది. దేశీయంగా డిమాండ్.. ముఖ్యంగా ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహన విభాగం నుంచి ఆర్డర్లు వెల్లువెత్తడం ఈ స్థాయి వృద్ధికి కారణమని ఆటోమోటివ్ కంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అసోసియేషన్ ప్రకారం.. పండుగల సీజన్ ద్విచక్ర వాహనాలకు చాలా సానుకూలంగా ఉంది.
గతంలో మాదిరిగానే టూ వీలర్ల విభాగం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుంది. సెమీకండక్టర్ల లభ్యత, ముడి పదార్ధాల వ్యయాలు అధికంగా ఉండడం, కంటైనర్ల కొరత వంటి సరఫరా సంబంధ సమస్యలు నియంత్రణలోకి రావడంతో ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో వృద్ధికి సాయపడింది. పరిశ్రమ ఆదాయంలో ఎలక్ట్రికల్ వాహన విభాగం వాటా 1 శాతంగా ఉంది. వాహన విక్రయానంత రం జరిగే విడిభాగాల కొనుగోళ్ల పరిమాణం 8% అధికమై రూ.42 వేల కోట్లు నమోదు చేసింది.
ప్యాసింజర్ వాహనాలదే..
ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో వాహన తయారీ సంస్థలకు రూ.2.37 లక్షల కోట్ల విలువైన విడిభాగాలు సరఫరా అయ్యాయి. ఇందులో 47 శాతం వాటా ప్యాసింజర్ వాహనాలదే. గతేడాది ఇదే కాలంలో ఈ వాటా 38 శాతం నమోదైంది. ఎస్‌యూవీల వైపు డిమాండ్ అధికం కావడంతో విడిభాగాల విలువ పెరిగింది. పరిశ్రమ ఆదాయంలో ద్విచక్ర వాహనాల విడిభాగాల వాటా 21 శాతం నుంచి 18 శాతానికి వచ్చి చేరింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఎగుమతులు 8.6 శాతం దూసుకెళ్లి రూ.83,607 కోట్లు నమోదయ్యాయి. దిగుమతులు 17.2 శాతం పెరిగి దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఎగుమతుల్లో ఉత్తర అమెరికా వాటా 12 శాతం పెరిగి ఏకంగా 33 శాతం ఉంది. యూరప్ 30, ఆసియా 26 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో విడిభాగాల పరిశ్రమ రూ.5,794 కోట్ల వాణిజ్య మిగులుతో ముగిసింది. 2022–23లో ఎగుమతులు, దిగుమతులు సరసమైన సమతుల్యతతో తటస్థంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment