చెన్నై వాహన పరిశ్రమ కుదేలు
భారీ వర్షాలతో ప్లాంట్లను మూసేసిన పలు కంపెనీలు
చెన్నై: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై ఆటోమొబైల్ కంపెనీలు నెల కాలవ్యవధిలో రెండవసారి ప్లాంట్లను మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నైలో ప్లాంట్లను కలిగి ఉన్న ఫోర్డ్, నిస్సాన్, టీవీఎస్, హ్యుందాయ్, రెనో-నిస్సాన్, అశోక్ లే లాండ్ వంటి కంపెనీల్లో కొన్ని ఇప్పటికే వాటి ప్లాంట్లను మూసివేశాయి. ఫోర్డ్ కంపెనీ తన 3.4 లక్షల ఇంజిన్ల, 2 లక్షల వార్షిక వాహన ఉత్పత్తి సామర్థాన్ని కలిగిన ప్లాంటును ఇప్పటికే మూసివేసింది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల వల్ల చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయని, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని చెన్నైలోని తమ అసెంబ్లింగ్, ఇంజిన్ ప్లాంటులో ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని ఫోర్డ్ కంపెనీ బుధవారం వెల్లడించింది.పరిస్థితులను పరిశీలిస్తున్నామని, అవి మెరుగుపడ్డాకాకార్యకలాపాలను
పునఃప్రారంభిస్తామని తెలిపింది.
వర్షం ప్రభావం తమ ప్లాంట్లు, కార్యాలయాలు, ఉద్యోగులు, లాజిస్టిక్స్, సప్లై చైన్స్ విభాగాలపై పడిందని రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది. దీని వల్ల తిరువోత్తుయుర్, ఒరగాడం ప్రాంతాల్లోని ప్లాంట్లను డిసెంబర్ 1 నుంచి మూసివేశామని రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికార ప్రతినిధి తెలిపారు. హ్యుందాయ్, ఫోర్డ్, రెనో కంపెనీలుబుధవారం వాటి కార్యాలయాలను, ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేశాయి.
చెన్నై పెట్రో రిఫైనరీ మూసివేత...
అలాగే వర్షం వల్ల ఒర గాడంలోని తన ప్లాంటులో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అపోలో టైర్స్ తెలిపింది. ఉత్పత్తి నష్టం దాదాపుగా 450 మిలియన్ టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. వర్షం దెబ్బతో చెన్నై పెట్రోలియం కార్ప్ 10.5 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగిన తన మనాలి చమురు రిఫైనరీని మూసివేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఐటీ కంపెనీలు కూడా వాటి కార్యాలయాలను మూసివేశాయి.
వాహన విక్రయాలు తగ్గొచ్చు!
వర్షం కారణంగా రానున్న కాలంలో చెన్నై ఆధారిత వాహన కంపెనీల విక్రయాలు తగ్గే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘గత మూడు వారాల నుంచి కురుస్తున్న వర్షాలు.. ఆటో కంపెనీల ఉత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి’ అని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. ఈ వ ర్షాల కారణంగా తమ విక్రయాలు 15,000 యూని ట్లు తగ్గాయని భావిస్తోంది. ఇతర వాహన కంపెనీలతో సహా ప్రస్తుత వర్షాల ప్రభావం టీవీఎస్ మోటార్స్ దేశీ విక్రయాలపై, ఎగుమతులపై కచ్చితంగా ఉంటుందని డెస్టిమోనీ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ సుదీప్ తెలిపారు. హ్యుందాయ్ కంపెనీపై అధిక ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చెన్నైలో ప్లాంట్లను కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్, హ్యుందాయ్, రెనో, ఫోర్డ్ వంటి ఆటో కంపెనీల ఉత్పత్తి సామర్థ్యంపై వర్షపు ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని నోమురా పేర్కొంది.