హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్‌కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్‌ఎఫ్‌ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు.
చకన్, పుణే, నాసిక్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 8 లక్షల యూనిట్లు. ఎన్‌ఎఫ్‌ఏ మోడళ్ల కోసం మరింత సామర్థ్యం అవసరం అవుతుంది. ఎన్‌ఎఫ్‌ఏ ఆర్కిటెక్చర్ సుమారు 12 మోడళ్లను తయారు చేసే అవకాశం ఉంది. కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైన మోడళ్ల అమ్మకాలు ఏటా 3–5 లక్షల యూనిట్లు ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది.
కాగా, కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో తొలిసారిగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అందుకుంటుంది. మహీంద్రా మార్కెట్ వాటా రెండంకెలకు చేరుకోవచ్చు. 2024–25లో ఎస్‌యూవీల టర్నోవర్ రూ.75,000 కోట్లు దాటనుంది. 2023–24లో కంపెనీ ఎస్‌యూవీల తయారీలో పరిమాణం పరంగా భారత్‌లో రెండవ స్థానంలో, ఆదాయం పరంగా తొలి స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆటోమోటివ్ బిజినెస్ కోసం రూ.27,000 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment