20 లక్షల కోట్లకు వాహన పరిశ్రమ: గడ్కారి
న్యూఢిల్లీ: దేశీ వాహన పరిశ్రమ టర్నోవర్ వచ్చే పదేళ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగి రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి అంచనా వేశారు. వాహన కంపెనీలు నాణ్యత విషయంలో రాజీపడకుండా, కొత్త ఆవిష్కరణలకు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇలాంటి చర్యల ద్వారానే ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఉపాధి కల్పనకు ఎగుమతుల పెరుగుదల ఆవశ్యకమన్నారు.
ఆయన ఇక్కడ జరిగిన ఆటోమొబైల్ కాంపొనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) వార్షిక సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుతం వాహన పరిశ్రమ రూ.4.5 లక్షల కోట్లుగా ఉంది. వచ్చే పదేళ్లలో దీన్ని రూ.20 లక్షల కోట్లకు తీసుకెళ్తాం. ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగే సత్తా మన పరిశ్రమకు ఉంది’ అని వివరించారు. ముంబై పోర్ట్ ట్రస్ట్ నుంచి గతేడాది 1,58,000 వాహనాల ఎగుమతి జరిగిందని, ఈ ఏడాది వీటి సంఖ్య 2 లక్షల వరకు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో జల రవాణాను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.