కొత్త ఏడాదిలో రయ్‌రయ్‌ | Indian auto industry expected to see stronger growth in 2021-22 | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో రయ్‌రయ్‌

Published Sat, Dec 26 2020 1:11 AM | Last Updated on Sat, Dec 26 2020 1:56 AM

Indian auto industry expected to see stronger growth in 2021-22 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  భారత వాహన పరిశ్రమ 2021–22లో బలమైన వృద్ధి నమోదు చేయనుందని నోమురా రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కన్సల్టింగ్, సొల్యూషన్స్‌ ఇండియా శుక్రవారం వెల్లడించింది. కోవిడ్‌–19 కారణంగా ఎదుర్కొన్న తీవ్ర ప్రభావం నుంచి ఈ రంగం కోలుకుంటుందని.. ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు తోడవడంతో పరిశ్రమ సానుకూలంగా ఉంటుందని వివరించింది. అయితే వ్యక్తిగత వాహనాల అమ్మకాలు 2018–19 స్థాయికి చేరుకునేది 2022–23లోనే అని స్పష్టం చేసింది. అలాగే ద్విచక్ర వాహనాలకు మరో ఏడాది (2023–24) పట్టొచ్చని నోమురా ప్రతినిధి ఆశిమ్‌ శర్మ తెలిపారు. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో కొంత ధరల పెరుగుదలకు అవకాశం ఉండడమూ ఇందుకు కారణమని అన్నారు.  

సియామ్‌ లెక్కల ప్రకారం..
సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) ప్రకారం.. 2019–20లో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 17.88 శాతం తగ్గి 27,73,575 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 17.76 శాతం తగ్గి 1,74,17,616 యూనిట్లు నమోదైంది. 2018–19లో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2.7 శాతం వృద్ధి చెంది 33,77,389 యూనిట్ల స్థాయికి చేరాయి. 2017–18లో ఇది 32,88,581 యూనిట్లుగా ఉంది. 2018–19లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 4.86 శాతం అధికమై 2,11,81,390 యూనిట్లకు చేరుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇది 2,02,00,117 యూనిట్లు నమోదైంది.  

కొత్త కంపెనీల రాకతో..: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సేల్స్‌ మెరుగ్గా ఉంటాయని నోమురా వెల్లడించింది. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ ఉంటుందని తెలిపింది. కొత్త కంపెనీల రాకతో ఈ విభాగం సానుకూలంగా ఉంటుందని వివరించింది. ఈవీ విడిభాగాల విషయానికి వస్తే.. సాంకేతిక భాగస్వామ్యంతో సెల్‌ స్థాయి తయారీ భారత్‌లో ప్రారంభం అయింది. లిథియం టైటానియం ఆక్సైడ్‌ (ఎల్‌టీవో) బ్యాటరీల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంపై కంపెనీలు దృష్టిసారించాయి. ఎల్‌టీవో బ్యాటరీలతో త్వరితగతిన చార్జింగ్‌ పూర్తి అవుతుంది. 10 వేల సార్లకుపైగా చార్జీ చేయవచ్చు.  

ఎగుమతి అవకాశాలు..
మోటార్స్, కంట్రోలర్స్‌ సైతం భారత్‌లో తయారవుతున్నాయి. స్థానిక ఉత్పత్తిదార్లతోపాటు.. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో విడిభాగాల తయారీలోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు. విడిభాగాలు, బ్యాటరీల తయారీలో ఉన్న దేశీయ వాహన కంపెనీలకు ఎగుమతి అవకాశాలూ పెరగనున్నాయి. వీటి నిరంతర సరఫరా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ప్రత్యామ్నాయ వనరులను కనుగొనే పనిలో ఉన్నాయని నివేదిక గుర్తు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement