Own vehicle
-
కోట్లున్నా..కారుండదు..ఎందుకు?
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సమయంలో ఓ అంశం సాధారణ ప్రజల్లో కొత్త ఆలోచనను రేపుతుంటుంది. మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర కీలక పదవుల్లో ఉన్న కొందరు ‘నాకు సొంత కారు లేదు’ అని నామినేషన్ల అఫిడవిట్లో చూపుతుంటారు. వారి ఆస్తులు మాత్రం రూ.కోట్లలో ఉంటాయి. ఇంత ఆస్తి పరులకు సొంత వాహనం ఎందుకు ఉండదు..?? కోట్లకు పడగలెత్తిన బడా నేతలు సొంత వాహనాన్ని కొనుక్కునే పరిస్థితిలో లేరా..?? వారి ఇళ్ల ఎదుట డజనుకుపైగా కనిపించే ఖరీదైన విలాసవంతమైన కార్లు ఎవరివి..?? ఈ అనుమానాలు చాలా మంది బుర్రలను తొలిచేస్తూంటాయి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కొందరు మంత్రులు సహా పలు పార్టీలకు చెందిన బడా నేతలు సొంత కారు లేదని ప్రకటించారు. ఇలా ఎందుకంటే.. ఏ కేసు పెట్టినా.. వెళ్లాల్సిందే... ఆ వాహనం ఏదైనా వివాదంలో చిక్కుకున్నా, ప్రమాదానికి గురైనా న్యాయపరమైన అంశాల్లో యజమాని పేరు నమోదవుతుంది. ప్రమాదానికి గురైన సందర్భాల్లో యజ మాని వాహనంలో ప్రత్యక్షంగా లేకున్నా, కేసులను మాత్రం స్వయంగా ఎదుర్కొనక తప్పదు. పోలీసులు, న్యాయస్థానం ముందు యజమాని ప్రస్తావన రావటంతోపాటు, నేరుగా హాజరు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వాహన యజమానులు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు ఇవి ఇబ్బందికరంగా మారుతాయి. ఇక వాహనాలు నేతల పేర్లతో లేకున్నా, కొన్ని సందర్భాల్లో వాటిపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లు ఉంటుంటాయి. అలా ఉన్న కార్లు ప్రమాదాలకు గురైనా, ఇతర వివాదాల్లో చిక్కుకున్నా.. ఆ స్టిక్కర్ల వల్ల నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు ఎన్నో. కేవలం స్టిక్కర్ల ద్వారానే అలాంటి పరిస్థితి ఎదురైతే, వాహన రిజిస్ట్రేషన్‌లో యజమానిగా నేతల పేర్లు ఉంటే వారికి మరిన్ని ఇబ్బందులు సహజం. ఈ పరిణామాలను ముందుగా ఊహించే కొందరు బడా నేతలు తమ పేర్లతో వాహనాలు కొనటం లేదు. ఇది కేవలంనేతలకే పరిమితం కాలేదు. పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలవారు, బడా వ్యాపారులు, సినిమా నటులు.. ఇలా చాలా రంగాలకు చెందిన వారిలో ఈ ధోరణి ఉంది. నామినేషన్ వేసిన ఓ మంత్రి తన అఫిడవిట్లో సొంత వాహనం లేదని చూపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన విద్యా సంస్థల అధిపతిగా ఉన్నారు. అప్పుడు గానీ, ఇప్పుడు గానీ ఆయన వాహనాలను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లేదు. ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి రావటం.. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి ఉండటం కూడా దీనికి మరో కారణం. అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేసే వరకు ఉండటం ఇబ్బందిగా భావిస్తున్నారు. నామ బలం.. అభిమానంతో కొంతమంది.. వాహనాన్ని కొనేప్పుడు ఎవరి పేరుతో కొంటే మంచి జరుగుతుందో అన్న నమ్మకాలు కొందరిలో ఉంటాయి. ప్రతి పనికీ ముహూర్తాలు, నామ బలం చూసుకునే అలవాటు ఉన్నవారు దీనికి ప్రాధాన్యం ఇస్తారు. తమ పేరుతో కలిసి రాదని భావిస్తే వేరేవారి పేరుతో కొంటుంటారు. ఇక కొందరు ఆప్తులుగా భావించే వారిపై ఉన్న అభిమానంతో వారి పేరుతో వాహనాలు కొంటుంటారు. ఇది కూడా వాహనాలు యజమాని పేరుతో కాకుండా ఇతరుల పేరుతో ఉండటానికి కారణమవుతోంది. ఆదాయ పన్నుల భారం లేకుండా.. ఆయనో పారిశ్రామికవేత్త.. రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఇంటి ఆవరణలో డజనుకుపైగా విలాసవంతమైన కార్లు ఉంటాయి.. కానీ ఏదీ ఆయన పేరుతో ఉండదు. వాటి ఖర్చు, బ్యాంకు లోన్ల వ్యవహారం ఆయనకు సంబంధం లేదు. అన్నీ ఆయన సంస్థల నుంచే భరిస్తున్నట్టు చూపుతున్నారు. దీంతో ఆదాయపన్నులో ఆ కార్ల ఖాతా ఉండటం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు, విద్యా సంస్థల అధిపతులు దాదాపు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. -గౌరీభట్ల నరసింహమూర్తి -
భార్యాభర్తలకు పాముకాటు.. సొంత వాహనంలోనే..
కామారెడ్డి: రాజంపేట మండలంలోని శేర్శంకర్తండాకు చెందిన భార్యభర్తలు ముద్రిచ్చ రమేష్, నీలాలు బధవారం అర్ధరాత్రి పాముకాటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన భార్యభర్తలు వారి సొంత వాహనంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలివెళ్లారు. సమయానికి ఆస్పత్రికి చేరడంతో వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడారు. ప్రసుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు తండావాసులు పేర్కోన్నారు. -
పాత కార్లలో యూత్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్నేళ్ల క్రితం వరకు కొత్త కారు కావాలంటే షోరూంకు వెళ్లి కొన్ని గంటల్లోనే నచ్చిన వాహనంతో రోడ్డుపై దూసుకుపోయేవారు. కొన్ని మోడళ్లకే కొద్ది రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాహన రంగంలో పరిస్థితులు మారిపోయాయి. ఏ మోడల్ కారు కావాలన్నా తప్పనిసరిగా కొన్ని వారాలు, నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనికంతటికీ కారణం సెమికండక్టర్ల కొరత. మరోవైపు ముడి సరుకు వ్యయాలు భా రం కావడంతో వాహనాల ధరలను తయారీ కం పెనీలు ఎప్పుడూ లేని విధంగా క్రమం తప్పకుం డా పెంచుతూ పోతున్నాయి. దీంతో పాత కార్లకు డిమాండ్ అనూహ్యంగా అధికమైంది. అయితే ప్రీ–ఓన్డ్ కార్లను కొనేందుకు నవతరం ముందంజలో ఉన్నారని ఆన్లైన్ యూజ్డ్ కార్ల మార్కెట్‌ప్లేస్ కంపెనీ కార్స్24 నివేదిక చెబుతోంది. కొనుగోలుదార్లదే మార్కెట్.. పరిశ్రమలో అవ్యవస్థీకృత రంగానిదే 95 శాతం వాటా. రూ.2 లక్షల పెట్టుబడితో ఔత్సాహికులు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కొనుగోలుదార్లు వాహనం ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షిస్తున్నారు. కండీషన్నుబట్టి ధర నిర్ణయం అవుతోంది. పైగా కారు ఎక్కడ కొన్నా బ్యాంకులు రుణం ఇవ్వడం కలిసి వస్తోంది. వాహనం ఒకట్రెండేళ్లు వాడి 10,000 కిలోమీటర్లలోపు తిరిగితే యజమాని చెప్పిందే ధర. అదే రెండేళ్లు దాటితే కొనుగోలుదారు చెప్పిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. అయిదేళ్లలోపు వాడిన కార్లకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారని వసంత్ మోటార్స్ ఎండీ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం కొనుగోలుదార్లదే మార్కెట్ అని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్లకు సై.. పాత కార్ల కొనుగోలుదార్లలో యువత వాటా ఏకంగా 80 శాతం ఉంది. యాప్, వెబ్ ఆధారిత వేదికలు వృద్ధి చెందేందుకు వీరు దోహదం చేస్తున్నారు. వాహన ధరలు పెరుగుతుండడం, మహమ్మారి కారణంగా వచ్చిన జీవనశైలి మార్పులు, ఆన్లైన్ కంపెనీల దూకుడు.. వెరళి డిజిటల్ వేదికల జోరుకు కారణం అవుతున్నాయి. యువ కస్టమర్లలో పురుషులదే పైచేయి. మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక కార్ల విషయానికి వస్తే హ్యాచ్బ్యాక్స్ వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య ఏకంగా 43% ఉంది. ఎస్‌యూవీలకు 26% మంది సై అంటున్నారు. పెట్రోల్ వాహనాలకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. యూజ్డ్ కార్ ఏ స్థితిలో ఉందన్నదే కొనుగోలుదార్లకు కీలక అంశం. ఇదీ దేశీయ మార్కెట్.. భారత్‌లో 2020–21లో 38 లక్షల పాత కార్లు చేతులుమారాయి. ఇందులో 5–7 ఏళ్లు వాడిన వాహనాల వాటా 31 శాతం, 8–10 ఏళ్లవి 29 శాతం ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 15 శాతం పెరగనుంది. ఏటా 12–14 శాతం వృద్ధితో 2025–26 నాటికి ఈ సంఖ్య 70 లక్షల యూనిట్ల పైచిలుకు నమోదు కానుందని నివేదికలు చెబుతున్నాయి. చవకగా ఉండి అధిక మైలేజీ ఇచ్చే కార్ల కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు 27.11 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి పాత కార్లకు ఉన్న డిమాండ్ అర్థం అవుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ 20–30 శాతం దూసుకెళ్లింది. ముఖ్యంగా దక్షిణాదిన పాత కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ కారణంగా వ్యక్తిగతంగా వాహనం ఉండాలన్న భావన ప్రజల్లో బలపడుతోంది. -
వేరే రాష్ట్రాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు !
సాక్షి, న్యూఢిల్లీ: తమ కొత్త వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినపుడు ఆ రాష్ట్రాల్లోనూ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పనిలేకుండా ‘భారత్ సిరీస్ (బీహెచ్–సిరీస్)’ పేరిట కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తేనుంది. ఈ వివరాలతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ –సిరీస్) వినియోగించనున్నారు. వాహన యజమాని మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ ముద్ర ఉన్న వాహనాన్ని రీ–రిజిస్ట్రేషన్ చేయించుకోనవసరం ఉండదని రవాణా శాఖ తెలిపింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, నాలుగుకంటే ఎక్కువ రాష్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు బదిలీ అయినపుడు ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. బీహెచ్–సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాటి వాహనాల పన్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాలి. మోటారు వాహనం పన్నును రెండేళ్లు, అంత కుపైన విధించనున్నారు. 14 ఏళ్లు పూర్తవగానే ఆ వాహనంపై ఏటా విధించే పన్ను అంతకు ముందు విధించిన మొత్తంలో సగానికి తగ్గించనున్నారు. అదేవిధంగా, కొత్త సిరీస్ ఉన్న నాన్–ట్రాన్స్పోర్ట్ వాహనాల ధర రూ. 10 లక్షల లోపు ఉంటే 8% వాహన పన్ను, రూ. 10–20 లక్షల మధ్య ఉంటే 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ముద్ర ఫార్మాట్ YY BH #### XX. ఇందులో వైవై అంటే తొలి రిజిస్ట్రేషన్ సంవత్సరం, బీహెచ్ అంటే భారత్ సిరీస్ కోడ్, #### అంటే 0000 నుంచి 9999 నంబర్లు.. ఎక్స్ఎక్స్ అంటే ఆంగ్ల అక్షర క్రమం. -
కొత్త ఏడాదిలో రయ్రయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత వాహన పరిశ్రమ 2021–22లో బలమైన వృద్ధి నమోదు చేయనుందని నోమురా రిసర్చ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టింగ్, సొల్యూషన్స్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. కోవిడ్–19 కారణంగా ఎదుర్కొన్న తీవ్ర ప్రభావం నుంచి ఈ రంగం కోలుకుంటుందని.. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తోడవడంతో పరిశ్రమ సానుకూలంగా ఉంటుందని వివరించింది. అయితే వ్యక్తిగత వాహనాల అమ్మకాలు 2018–19 స్థాయికి చేరుకునేది 2022–23లోనే అని స్పష్టం చేసింది. అలాగే ద్విచక్ర వాహనాలకు మరో ఏడాది (2023–24) పట్టొచ్చని నోమురా ప్రతినిధి ఆశిమ్ శర్మ తెలిపారు. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో కొంత ధరల పెరుగుదలకు అవకాశం ఉండడమూ ఇందుకు కారణమని అన్నారు. సియామ్ లెక్కల ప్రకారం.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2019–20లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 17.88 శాతం తగ్గి 27,73,575 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 17.76 శాతం తగ్గి 1,74,17,616 యూనిట్లు నమోదైంది. 2018–19లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2.7 శాతం వృద్ధి చెంది 33,77,389 యూనిట్ల స్థాయికి చేరాయి. 2017–18లో ఇది 32,88,581 యూనిట్లుగా ఉంది. 2018–19లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 4.86 శాతం అధికమై 2,11,81,390 యూనిట్లకు చేరుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇది 2,02,00,117 యూనిట్లు నమోదైంది. కొత్త కంపెనీల రాకతో..: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ మెరుగ్గా ఉంటాయని నోమురా వెల్లడించింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. కొత్త కంపెనీల రాకతో ఈ విభాగం సానుకూలంగా ఉంటుందని వివరించింది. ఈవీ విడిభాగాల విషయానికి వస్తే.. సాంకేతిక భాగస్వామ్యంతో సెల్ స్థాయి తయారీ భారత్‌లో ప్రారంభం అయింది. లిథియం టైటానియం ఆక్సైడ్ (ఎల్‌టీవో) బ్యాటరీల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంపై కంపెనీలు దృష్టిసారించాయి. ఎల్‌టీవో బ్యాటరీలతో త్వరితగతిన చార్జింగ్ పూర్తి అవుతుంది. 10 వేల సార్లకుపైగా చార్జీ చేయవచ్చు. ఎగుమతి అవకాశాలు.. మోటార్స్, కంట్రోలర్స్ సైతం భారత్‌లో తయారవుతున్నాయి. స్థానిక ఉత్పత్తిదార్లతోపాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో విడిభాగాల తయారీలోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు. విడిభాగాలు, బ్యాటరీల తయారీలో ఉన్న దేశీయ వాహన కంపెనీలకు ఎగుమతి అవకాశాలూ పెరగనున్నాయి. వీటి నిరంతర సరఫరా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ప్రత్యామ్నాయ వనరులను కనుగొనే పనిలో ఉన్నాయని నివేదిక గుర్తు చేసింది. -
రయ్.. రయ్.. దూసుకెళ్తాం
పెద్ద నగరాల యువతీయువకుల్లో 40 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థను వాడుకుంటున్నారు. చిన్న నగరాల్లో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. మొత్తంగా నగర యువతీయువకుల్లో అత్యధికులు సొంత వాహనాల కొనుగోలుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. యువ్‌గవ్ – మింట్ మిలినియల్ సర్వేలో తేలిన విషయాలివి. 1981 – 96 మధ్య పుట్టిన (22–37 వయోశ్రేణి ; మిలినియల్స్గా వ్యవహరిస్తారు) 1996 తర్వాత పుట్టిన (వీరిని జనరేషన్ జడ్ / జన్ జర్స్ అన్నారు) యువత ప్రయాణ తీరుతెన్నులపై ఈ సర్వేలో పరిశీలన జరిపారు. 180కి పైగా భారతీయ నగరాలపై జరిగిన ఈ ఆన్లైన్ అధ్యయనం ప్రకారం – ఢిల్లీ ఎన్సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం) ముంబయి, చెన్నయ్, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులు వాడుకుంటున్న వారి సంఖ్య ఎక్కువే.. సర్వే ప్రకారం – కోల్‌కతా (55శాతం) ముంబయి (52శాతం) నగరాల్లో అత్యధిక యువత ప్రజా రవాణా (లోకల్ రైళ్లు – మెట్రో రైళ్లు – బస్సులు – మినీ వ్యానులు)పై ఆధారపడుతోంది. చిన్న నగరాల్లో (ద్వితీయ – తృతీయ శ్రేణి నగరాలు) ఇలాంటి వారు 28 శాతమే. ఆరు ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లోని యువతీయువకుల్లో 46శాతం మంది టూ వీలర్లు వాడుతున్నారు. ఇక్కడ ప్రజా రవాణాపై ఆధారపడిన యువత 27 శాతమే. 15 శాతం మంది కార్లకు, మరో 12శాతం మంది క్యాబ్ సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద నగరాల్లోని సొంత వాహనదారుల్లో 25శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థనే వాడుకుంటున్నారు (చిన్న నగరాల్లో ఇలాంటి వారు 16శాతం మంది). మరో 7 శాతం మంది క్యాబుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. రూ.50,000కు పైగా ఆదాయం గడించే యువతీయువకుల్లో ఇంచుమించు 26 శాతం మంది, రూ. 20,000లోపు సంపాదించే వారిలో 39 శాతం ప్రజా రవాణా వైపు మొగ్గు చూపుతున్నారు. బండి కొనేస్తాం.. మొత్తంగా నగర యువతలో అత్యధికులు సొంత వాహనాల (కార్లు/టూ వీలర్లు) కొనుగోలుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రయాణానికి ప్రజా రవాణాయే మిన్న అంటున్న వారిలో పాతికశాతం మంది – ఏడాదిలోగా సొంత వాహనం కొనేస్తామంటున్నారు. 43శాతం మంది భవిష్యత్తులో ఏదో ఒక వాహనం కొనుగోలు చేయడం ఖాయమంటున్నారు. క్యాబ్ వాడుతున్న వారిలో 70 శాతం మంది బండి కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. సొంత బళ్లపై యువత ఆసక్తి ఇటీవల కాలంలో పెచ్చు పెరిగిందనడానికి ఈ ధోరణి ఓ ఉదాహరణ. సర్వే నిర్వాహకులు ఈ అంశానికి సంబంధించి.. ఇంచుమించు వెయ్యిమంది 38 – 53 వయస్కుల (జన్ ఎక్స్) అభిప్రాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికులు ఏడాది లోపో (43శాతం) ఆ తర్వాతో (45శాతం) బండి కొంటామని చెబుతున్నారు. సగటున 1 – 2 గంటల ప్రయాణం భారతీయ యువత ప్రతి రోజూ సగటున 91 నిమిషాల సమయాన్ని ప్రయాణంలో గడుపుతున్నట్టు సర్వే తెలిపింది. దలియా రీసెర్చ్ (వినియోగదార్లపై పరిశోధనలు జరిపే బెర్లిన్ సంస్థ) 2017లో జరిపిన సర్వే ప్రకారం – ఇతర దేశాల వారితో పోల్చుకుంటే మన దేశంలో ప్రయాణానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. చైనా (57నిమిషాలు) బ్రెజిల్ (77 నిమిషాలు) పాకిస్తాన్ (88 నిమిషాలు) వారి కంటే మన వాళ్ల ప్రయాణ సమయం ఎక్కువగా వుంటోంది. హైదరాబాద్‌లో.. గంటలోపు ప్రయాణాన్ని ముగించగలిగే అవకాశమున్నవారు 23 శాతమే. 34 శాతం మంది 1 – 2 గంటల సమయం వెచ్చించాల్సివస్తోంది. 18 శాతం మంది 2– 4 గంటల పాటు ప్రయాణించాల్సివస్తోంది. 13 శాతం మంది ప్రయాణ సమయం నాలుగు గంటలుదాటిపోతోంది. ఇక్కడ ప్రయాణాలకు దూరంగా వున్నవారు 12 శాతం మంది మాత్రమే. -
సొంత బండి దండగ
ఉద్యాననగరిలో సొంత వాహనం తప్పనిసరి. ఇంట్లో రెండు మూడు వాహనాలకు తక్కువ ఉండవు. ఎక్కడికి వెళ్లాలన్నా వాటి మీదే. అయితే నగర సమస్యలు సొంత వాహనం పెద్ద భారమనే విధంగా చేస్తున్నాయి. గత రెండేళ్ల వాహన రిజిస్ట్రేషన్లు దీనినే స్పష్టంచేస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో వాహనాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ 20 శాతం తగ్గిపోయిందని రవాణా శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 7.20 లక్షల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, 2017–18లో ఈ సంఖ్య 5.69 లక్షలకు పడిపోవడం గమనార్హం. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడం, భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు, పార్కింగ్ లేమి, మెట్రోరైలు మార్గం విస్తరణ, అందుబాటులో క్యాబ్ సేవలు ఉండడం తదితర కారణాలతో వాహనాల కొనుగోలుపై నగరవాసుల్లో అనాసక్తి నెలకొంది. ట్రాఫిక్ రద్దీతో సతమతం పెరుగుతున్న వాహనాల సంఖ్యతో రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయి కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. రద్దీ సమయాల్లో వాహనాల సగటు వేగం 10 కిలోమీటర్లకు పడిపోతోంది. దీంతో వాహనాల నుంచి పొగ విపరీతంగా వాతావరణంలోకి విడుదలవుతుంది. ఈ సమస్యల వల్ల నగరవాసులు సిటీ బస్సులు, మెట్రో, క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆదుకుంటున్న క్యాబ్‌లు క్యాబ్స్ సేవలు విస్తరించడం, వాటి చార్జీలు కూడా దిగిరావడంతో నగరవాసులు వాటిలో ప్రయాణం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 2013–14లో 66,264 ట్యాక్సీలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1.57 లక్షలు. ఓలా, ఉబెర్ వంటి పలు సంస్థలకు చెందిన ట్యాక్సీలు ఉండడం గమనార్హం. అలాగే ఇటీవల ఆశాకాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నగరంలో పార్కింగ్ చేసేందుకు సరైన స్థలం లేకపోవడం కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బీబీఎంపీతో పాటు బీడీఏ నగరంలో పార్కింగ్ స్థలలాను ఏర్పరచడంలో పూర్తిగా విఫలమయింది. గతేడాది జీఎస్టీ కూడా అమ్మకాలకు బ్రేక్ వేసిందని చాలామంది డీలర్లు చెబుతున్నారు. రోజుకు 1600 వాహనాల నమోదు వాహన విక్రయాల సగటు వార్షిక వృద్ధి రేటు 10 శాతంగా ఉంది. కానీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం అధికంగా వాహనాల కొనుగోలు జరిగింది. దేవనహళ్లి ఆర్టీవో కార్యాలయం బెంగళూరు పట్టణ విభాగానికి మారడంతో వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగింది. సగటున ప్రతి రోజు దాదాపు 1,600 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఇందులో 1,100 వరకు ద్విచక్రవాహనాలు ఉండగా, మరో 300 వరకు కార్లు. ఈ సంఖ్య ఇదేవిధంగా కొనసాగితే 2022లోగా నగరంలో వాహనాల సంఖ్య 1.08 కోట్లకు చేరుకుంటుంది. మెట్రో సౌకర్యం నగరంలో మెట్రో విస్తరణ వల్ల ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. 42 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ వల్ల రోజుకి 3.40 లక్షల మంది ప్రజలు సగటున ప్రయాణిస్తున్నారు. 2011లో ఒక రోజుకి 28,007 మంది సగటు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 3.40 లక్షలకు చేరుకుంది. ఈ కారణాలన్నింటి వల్ల కొత్తగా వాహనాల కొనుగోలుపై నగరవాసులు అనాసక్తి కనపరిచి, ఇతర ప్రయాణ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. -
మేయర్‌కు బుగ్గ కారేదీ!
- గన్మన్లూ లేరు - సొంత వాహనంలోనే పర్యటనలు నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగర ప్రథమ పౌరురాలికి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. క్యాబినెట్ మినిస్టర్ హోదాతో దర్జాగా బుగ్గ కారులో తిరగాల్సిన ఆమె.. సొంత వాహనంలోనే నగర పర్యటనలు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి మూడు నెలలవుతున్నా.. గన్మన్ల జాడ కూడా లేదు. ఆకుల సుజాత నగర ప్రథమ పౌరురాలిగా జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం ఆమెకు బుగ్గకారును, ఇద్దరు గన్మన్లకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ బాధ్యతలు స్వీకరించి మూడు నెలలవుతున్నా ఈ సౌకర్యాలేవీ ఆమెకు అందలేదు. సొంత పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కారణంగానే మేయర్‌కు ఈ సౌకర్యాలు దక్కడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ‘నా వల్లే నీకు మేయర్ పదవి దక్కింది. నేను చెప్పినట్లు నడుచుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడే బుగ్గ కారు ఉపయోగించాలి. మిగిలిన సమయాల్లో సాదాసీదాగా ఉండాలి’ అని సదరు నేత సూచించినట్లు సమాచారం. ఆ నాయకుడు చెప్పినట్లే నడుచుకోవాల్సి వస్తోందని కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ కార్యక్రమానికైనా మేయర్ సొంత వాహనంలోనే వెళ్తున్నారు. ఎలాంటి సమావేశాలకైనా తన అనుమతి తీసుకునే హాజరు కావాలని ఆ ప్రజాప్రతినిధి హుకూం జారీ చేసినట్లు సమాచారం. కార్పొరేషన్‌ను శాసిస్తున్న సదరు నేతపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేయర్‌కు సంబంధం లేకుండానే వీక్లీ మార్కెట్లోని ఓ అపార్ట్‌మెంట్‌కు కార్పొరేషన్ అనుమతిని ఇప్పించినట్లు తెలుస్తోంది.