పెద్ద నగరాల యువతీయువకుల్లో 40 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థను వాడుకుంటున్నారు. చిన్న నగరాల్లో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. మొత్తంగా నగర యువతీయువకుల్లో అత్యధికులు సొంత వాహనాల కొనుగోలుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. యువ్‌గవ్ – మింట్ మిలినియల్ సర్వేలో తేలిన విషయాలివి. 1981 – 96 మధ్య పుట్టిన (22–37 వయోశ్రేణి ; మిలినియల్స్‌గా వ్యవహరిస్తారు) 1996 తర్వాత పుట్టిన (వీరిని జనరేషన్ జడ్ / జన్ జర్స్ అన్నారు) యువత ప్రయాణ తీరుతెన్నులపై ఈ సర్వేలో పరిశీలన జరిపారు. 180కి పైగా భారతీయ నగరాలపై జరిగిన ఈ ఆన్‌లైన్ అధ్యయనం ప్రకారం – ఢిల్లీ ఎన్‌సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం) ముంబయి, చెన్నయ్, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులు వాడుకుంటున్న వారి సంఖ్య ఎక్కువే..
సర్వే ప్రకారం – కోల్‌కతా (55శాతం) ముంబయి (52శాతం) నగరాల్లో అత్యధిక యువత ప్రజా రవాణా (లోకల్ రైళ్లు – మెట్రో రైళ్లు – బస్సులు – మినీ వ్యానులు)పై ఆధారపడుతోంది. చిన్న నగరాల్లో (ద్వితీయ – తృతీయ శ్రేణి నగరాలు) ఇలాంటి వారు 28 శాతమే. ఆరు ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లోని యువతీయువకుల్లో 46శాతం మంది టూ వీలర్లు వాడుతున్నారు. ఇక్కడ ప్రజా రవాణాపై ఆధారపడిన యువత 27 శాతమే. 15 శాతం మంది కార్లకు, మరో 12శాతం మంది క్యాబ్ సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద నగరాల్లోని సొంత వాహనదారుల్లో 25శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థనే వాడుకుంటున్నారు (చిన్న నగరాల్లో ఇలాంటి వారు 16శాతం మంది). మరో 7 శాతం మంది క్యాబుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. రూ.50,000కు పైగా ఆదాయం గడించే యువతీయువకుల్లో ఇంచుమించు 26 శాతం మంది, రూ. 20,000లోపు సంపాదించే వారిలో 39 శాతం ప్రజా రవాణా వైపు మొగ్గు చూపుతున్నారు.
బండి కొనేస్తాం..
మొత్తంగా నగర యువతలో అత్యధికులు సొంత వాహనాల (కార్లు/టూ వీలర్లు) కొనుగోలుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రయాణానికి ప్రజా రవాణాయే మిన్న అంటున్న వారిలో పాతికశాతం మంది – ఏడాదిలోగా సొంత వాహనం కొనేస్తామంటున్నారు. 43శాతం మంది భవిష్యత్తులో ఏదో ఒక వాహనం కొనుగోలు చేయడం ఖాయమంటున్నారు. క్యాబ్ వాడుతున్న వారిలో 70 శాతం మంది బండి కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. సొంత బళ్లపై యువత ఆసక్తి ఇటీవల కాలంలో పెచ్చు పెరిగిందనడానికి ఈ ధోరణి ఓ ఉదాహరణ. సర్వే నిర్వాహకులు ఈ అంశానికి సంబంధించి.. ఇంచుమించు వెయ్యిమంది 38 – 53 వయస్కుల (జన్ ఎక్స్) అభిప్రాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికులు ఏడాది లోపో (43శాతం) ఆ తర్వాతో (45శాతం) బండి కొంటామని చెబుతున్నారు.
సగటున 1 – 2 గంటల ప్రయాణం
భారతీయ యువత ప్రతి రోజూ సగటున 91 నిమిషాల సమయాన్ని ప్రయాణంలో గడుపుతున్నట్టు సర్వే తెలిపింది. దలియా రీసెర్చ్ (వినియోగదార్లపై పరిశోధనలు జరిపే బెర్లిన్ సంస్థ) 2017లో జరిపిన సర్వే ప్రకారం – ఇతర దేశాల వారితో పోల్చుకుంటే మన దేశంలో ప్రయాణానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. చైనా (57నిమిషాలు) బ్రెజిల్ (77 నిమిషాలు) పాకిస్తాన్ (88 నిమిషాలు) వారి కంటే మన వాళ్ల ప్రయాణ సమయం ఎక్కువగా వుంటోంది. హైదరాబాద్‌లో.. గంటలోపు ప్రయాణాన్ని ముగించగలిగే అవకాశమున్నవారు 23 శాతమే. 34 శాతం మంది 1 – 2 గంటల సమయం వెచ్చించాల్సివస్తోంది. 18 శాతం మంది 2– 4 గంటల పాటు ప్రయాణించాల్సివస్తోంది. 13 శాతం మంది ప్రయాణ సమయం నాలుగు గంటలుదాటిపోతోంది. ఇక్కడ ప్రయాణాలకు దూరంగా వున్నవారు 12 శాతం మంది మాత్రమే.
రయ్.. రయ్.. దూసుకెళ్తాం
Published Sun, Sep 23 2018 8:12 AM | Last Updated on Sun, Sep 23 2018 1:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment