డేంజరస్ జర్నీ..
- బంగారు భవిష్యత్తు బుగ్గి
- రోడ్డు ప్రమాదాల బారిన యువత
- బైక్‌లను నిర్లక్ష్యంగా నడపడమే కారణం
- హెల్మెట్ లేకపోవడం.. తాగి నడపడం
- కారణాలేవైనా ప్రమాదంలో పడుతుంది వీరే..
సాక్షి, సిటీబ్యూరో: వాహనాలు నడపడంలో చిన్నపాటి నిర్లక్ష్యం యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తోంది. ముఖ్యంగా కాలేజీ పిల్లలు అత్యధికంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. మితిమీరిన వేగం, త్రిబుల్ రైడింగ్, అడ్డదిడ్డంగా నడపడం, డ్రంకన్ డ్రైవ్, హెల్మెట్ లేకపోవడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇందులో మరణాలు సైతం సంభవిస్తుండగా వందల సంఖ్యలో గాయాలపాలవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవడం.. లెసైన్స్ లేకపోయినా వారికి బైక్‌లు ఇవ్వడం వల్ల నిత్యం కాలేజీ కుర్రోళ్లు ఎక్కడో అక్కడ మరణిస్తున్నారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులుగా మారుతున్నారు. పిల్లలతోపాటు తల్లిదండ్రులు మేల్కొంటేనే ఈ పరిస్థితి నుంచి బయట పడే అవకాశం ఉందని మేధావులు సూచిస్తున్నారు.
నగర రహదారులపై ప్రమాదాల జోరు తగ్గడం లేదు. ముఖ్యంగా బైక్‌లే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఏడాది నగరంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఈ ఏడాది మే 31 వరకు నగరంలో మొత్తం 1,053 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో నిందితుల జాబితాలో 355 మంది ద్విచక్రవాహనదారులు ఉండడం గమనార్హం. 328 కేసులతో రెండో స్థానాన్ని కార్లు నడిపేవారు ఆక్రమించారు. ఇదిలావుంటే గాయపడిన వారిలోనూ ద్విచక్రవానదారులే మొదటి స్థానంలో ఉండగా 407 కేసులతో పాదచారులు రెండో స్థానంలో నిలిచారు. మొత్తం మీద ఇటు నిందితులు, అటు బాధితుల జాబితాల్లోనూ ద్విచక్రవాహన దారులు అగ్రభాగాన నిలిచారు. వీరిలో అత్యధికులు డిగ్రీ, పీజీలు చేసే వారు కావడం గమనార్హం. ఇందులో చాలామంది నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదాలకు గురైనట్టు తెలుస్తోంది.
తల్లిదండ్రుల నియంత్రణేది..?
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను కనిపెట్టలేకపోతున్నారు. పిల్లలపై అపారమైన ప్రేమను కనబరచడం వల్ల వారు మైనార్టీ తీరకుండానే, లెసైన్స్ లేకుండానే బైక్‌లపై రోడ్డుపైకి వస్తున్నారు. అదీగాక మితిమీరన వేగంతో బైక్‌లను నడపడం వల్ల నిత్యం అనేక చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు నగరంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బైక్ రేసింగ్‌లు ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. వీటిని అడ్డుకునే పరికరాలు, యంత్రాంగం అందుబాటులేదు.
త్రిబుల్ రెడింగ్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులు..
రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులే అధికం. కళాశాలలన్నీ నగర శివారుల్లో ఉండడంతో విద్యార్థుల రాకపోకలకు సరిపడా రవాణా వ్యవస్థ లేకపోవడంతో తల్లిదండ్రులు వారికి బైక్‌లను సమకూరుస్తున్నారు. అప్పటివరకు ఆటోలు, స్కూల్, కాలేజీ బస్సుల్లో వెళ్లిన విద్యార్థులకు బైక్‌లను నడిపే అనుభవం తక్కువ. అలాంటి వారికి బైక్‌లు ఇవ్వడంతో వీరు తమ తోటి స్నేహితులకు లిఫ్ట్‌పేరిట త్రిబుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.
డ్రంకన్ డ్రైవ్‌లో సైతం..
రోడ్డు ప్రమాదాల్లో అగ్రస్థానంలో నిలిచిన ద్విచక్ర వాహనదారులు డ్రంకన్ డ్రైవ్‌లోనూ ముందు వరుసలోనే నిలుస్తున్నారు. నాలుగేళ్లలో నమోదైన డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారి జాబితాలో వారే అధికంగా ఉండడం ఇందుకు నిదర్శనం. 2011 నుంచి ఈ ఏడాది జూన్ వరకు నమోదైన కేసుల్లో బైక్ చోదకులు 23,944 మంది పట్టుబడి అగ్రస్థానంలో ఉండగా కార్లు నడుపుతూ పట్టుబడిన వారు 7,641 మంది, ఆటో డ్రైవర్లు 1,427 మంది ఉన్నారు. మద్యం పార్టీల కల్చర్ పెరగడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
హెల్మెట్‌లు తప్పనిసరి...
ప్రమాదాల బారిన పడిన ద్విచక్ర వాహనదారుల్లో ఎక్కువ మంది మరణించడమో, గాయపడడానికి ముఖ్య కారణం హెల్మెట్ లేకపోవడమనే విషయం బహిర్గతమవుతోంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి హెల్మెట్‌లు తప్పనిసరి అని నగర ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇటీవల హెల్మెట్‌ల వినియోగాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నామని, హెల్మెట్ లేకపోతే కేసులు రాస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గత వారంలో హెల్మెట్ ధరించని రెండు వేలకుపైగా వాహనదారులకు చలానా విధించినట్టు వారు పేర్కొన్నారు.