అయ్ బాబోయ్...‘వేవ్ ఆఫ్ ది ప్యూచర్’గాచెబుతున్న ఏఐ సాంకేతికత యువతలోని ఒక వర్గంలో వేల భయాలను రేకెత్తిస్తోంది. భూతంలా భయపెడుతోంది. ఏఐ టెక్నాలజీ వల్ల ఉన్న ఉద్యోగాలు పోతాయనీ, ఉద్యోగావకాశాలు ఉండవనే ఆందోళనకు ‘ఏఐ యాంగ్జైటీ అని పేరు పెట్టారు....
ఈ భయం ఈనాటిది కాదు. ‘ఈ యంత్రాలు మన ఉపాధిని మింగేస్తాయి’ అనే భయం పారిశ్రామిక విప్లవం రోజుల నుంచి ఉన్నదే. చాట్ జీపీటీ విజయవంతం అయిన తరువాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఇప్పుడు యువతను భూతమై భయపెడుతోంది. ఒక సర్వే ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య వయసు వాళ్లు తమ కెరీర్‌కు సంబంధించిన భయాలతో ఉన్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం 2025 కల్లా 85 మిలియన్‌ల ఉద్యోగాలు ఏఐ సాంకేతికతతో భర్తీ అవుతాయి. ఈ నేపథ్యంలో కంపెనీలలో ఉద్యోగుల భవిష్యత్ పనితీరు ఎలా ఉండబోతున్నది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఎంత పాపులర్ టాపిక్ అయిందంటే మూడు సంవత్సరాల వ్యవధిలో దీనిపై పదుల సంఖ్యలో పుస్తకాలు వచ్చాయి. ఆర్థికవేత్త రిచర్డ్‌బాల్డ్ విన్ తన పుస్తకం ‘ది గ్లోబటిక్స్ అప్‌హీవల్’లో ఏఐ ద్వారా ఏయే రంగాలు ఎలాంటి ప్రభావానికి గురవుతాయో విశ్లేషించారు.
కొన్ని పుస్తకాలు మాత్రం ‘భయం అక్కర్లేదు’ అంటూ యువతను ఆశావహ మార్గం వైపు నడిపిస్తున్నాయి. యంత్రాలతో చెలిమి తప్పదు, తప్పు కాదు అంటున్నాయి.
సాంకేతిక శక్తి ప్రభావితం చేయని, అంటే ఉద్యోగాలకు ప్రమాదం లేని కొన్ని రంగాలు ఉండేవి. ఉదా: ఎకౌంటింగ్, న్యాయశాస్త్రం...మొదలైనవి. అయితే తాజాగా వెల్–ఎడ్యుకేటెడ్ ప్రొఫెషన్స్‌కు సంబంధించిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. లా ప్రాక్టీస్‌లో ఏఐ చాట్‌బాట్ కూడా భాగం కానుంది
కెరీర్ అభద్రతకు సంబంధించిన ఆలోచనల నేపథ్యంలో ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ‘ఏఐ యాంగై్జటీ’ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి పదాలు పుట్టడం కొత్త కాదు. సాంకేతిక పురోగతికి సంబంధించిన ప్రతి సందర్భంలో ఇలాంటి పదాలు ఎన్నో పుట్టాయి. 1980లలో ‘కంప్యూటర్ ఫోబియా’ ‘కంప్యూటర్ యాంగై్జటీ’ ‘టెక్నో స్ట్రెస్’లాంటివి పుట్టాయి.
ఏఐకి సంబంధించి రెండు వర్గాలు కనిపిస్తాయి. మొదటి వర్గానికి చెందిన వారిలో ‘ఆటోమేషన్ ఆందోళన’ కనిపిస్తుంది. రెండో వర్గం వారిలో ఆశాభావం కనిపిస్తుంది. మనుషులు, యంత్రాలతో చేయికలిపితే మెరుగైన ఫలితాలు వస్తాయనేది రెండో వర్గం నమ్మకం. టామ్ క్రూజ్ ‘మైనార్టీ రిపోర్ట్’లాంటి సినిమాలలో, పర్సనల్ ఇంట్రెస్ట్‌లాంటి టీవీ షోలలో మనిషి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో జత కడితే జరిగే అద్భుతాలు కనిపిస్తాయి.
వివిధ రంగాలపై ఏఐ ఎలాంటి మార్పును తీసుకురానుంది? ఆ మార్పు మనపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఏం నేర్చుకోవాలి?... ఈ విషయాలు చెప్పడానికి ఆన్‌లైన్ కోర్సులు వచ్చాయి. ఏఐ సాంకేతికత రీప్లేస్ చేయలేని ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అవి నొక్కి చెబుతున్నాయి. డిజిటల్‌తో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌ను కలగలిపి పాఠాలుగా చెబుతున్నాయి. ఈ కోర్సులపై యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది.
‘ఉద్యోగాలపై ఏఐ టెక్నాలజీ ప్రభావం గురించి ఫ్రెండ్‌కు నాకు మధ్య చర్చ జరిగింది. ఏటీఎం మెషీన్‌లు వచ్చిన కొత్తలో బ్యాంకింగ్ రంగంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారు, కొత్త ఉద్యోగాలు ఉండవు...ఇలా ఎన్నో మాటలు వినిపించేవి. కాని అది నిజం కాలేదు. ఉద్యోగుల పనితీరు మాత్రం మారింది. ఏఐ టెక్నాలజీ విషయంలోనూ జరిగేది ఇదే’ అంటుంది ముంబైకి చెందిన అక్షర.
ఏఐ...అయితే ఏంటీ!
యువతలో ఏఐ ఫోబియాను తొలగించడానికి ‘ఫోర్బ్స్ కోచెస్ కౌన్సిల్’ సభ్యులు కొన్ని సూచనలు చేశారు.
వాటిలో కొన్ని...
- ఏఐ అంటే భయం కాదు, ఇష్టం పెంచుకోండి. ఏఐకు సంబంధించి ప్రతిదీ నేర్చుకోండి. నిపుణులతో మాట్లాడండి. ఉద్యోగ నైపుణ్యానికి ఏఐ ఎలా ఉపయోగపడగలదు అనే కోణంలో ఆలోచించండి.
- మనిషికి ఉండే సహజ నైపుణ్యాలను ఏఐ ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు. మనిషికి ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేరణశక్తి, ఎత్తుగడలు, సమయస్ఫూర్తి...యంత్రం అనుకరించలేనివి.
- ‘ఈ ఉద్యోగం మాత్రమే చేస్తాను. ఇది మాత్రమే చేయగలను’ అని ఫిక్స్ కావద్దు. బీ ఫ్లెక్సిబుల్. ఏ ఉద్యోగమైనా చేసే నైపుణ్యాన్ని సొంతం చేసుకోండి. ఒకే దారిలో నడిచే వారికి ఆ దారి మాత్రమే తెలుస్తుంది. కొత్త దారుల్లో నడవడం నేర్చుకుంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.
- ఒత్తిడి దరి చేరని, సమస్యలను పరిష్కరించే, సానుకూలతను శక్తిగా మార్చుకునే, ఇతరులతో మంచి స్నేహసంబంధాలతో ఉండగలిగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను మెరుగుపరుచుకోండి.
- ఏఐ ఎలాంటి పాత్ర అయినా పోషించగలదు...అని విశ్వసించే సందర్భంలో ఉన్నాం. ఇలాంటి సమయంలోనే ఏఐ కంటే భిన్నంగా, మెరుగ్గా పనిచేసే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి.
(చదవండి: విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!)
Comments
Please login to add a commentAdd a comment