స్టార్‌ డాక్టర్‌ కిల్లర్‌గా మారితే ఇంత ఘోరంగా ఉంటుందా..! | The Infamously Famous Star Doctor Harold Shipman | Sakshi
Sakshi News home page

'డాక్టర్ డెత్‌': అతడితో వైద్యం చావుని ఆహ్వానించినట్లే..!

Feb 2 2025 6:17 PM | Updated on Feb 2 2025 6:20 PM

The Infamously Famous Star Doctor Harold Shipman

వైద్యుడంటే ప్రాణాలు కాపాడే నారాయణుడిగా భావిస్తారు. అందుకే అంతా "వైద్యో నారాయణో హరి:" అని అంటారు. అలాంటి వైద్య వృత్తికి కళంకం వచ్చేలా చేశాడో వ్యక్తి. ప్రాణాలు కాపాడతాడని ఆశతో వచ్చిన వాళ్లందరిని పొట్టనబెట్టుకున్నాడు. తామెందుకు చనిపోతున్నామో తెలియకుండానే ఎందరో అమాయకులు ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. కనీసం చిన్న​ క్లూ దొరక్కుండా పక్కాప్లాన్‌తో చంపేశాడు. సీరియల్‌ కిల్లర్‌కి మించిన కిరాతకుడు. ఒక్క హత్య మాత్రం అతడి ఆగడాలకు చెక్‌పెట్టి దొరికపోయేలా చేసింది. చివరికి ఆ దారుణాలు పశ్చాత్తాపంతో కుమిలిపోయి చనిపోయేలా చేసింది. అయితే అతడు ఎందుకు ఈ హత్యలన్నీ చేశాడన్నది అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయింది.

డాక్టర్‌ డెత్‌గా పిలిచే ఈ వైద్యుడి పేరు హెరాల్డ్ షిప్‌మ్యాన్. బ్రిటన్‌కి చెందిన వ్యక్తి. అతడికేసు పోలీసులకు అర్థంకానీ మిస్టరీలా మిగిలింది. అతడు పోలీసులకు పట్టుబడినప్పుడు 50 మంది రోగులు చనిపోయారని తెలియగా..దర్యాప్తులో మాత్రం ఏకంగా 200 మందిని హతం చేసినట్లు తేలింది. వారిలో అత్యంత చిన్న బాధితుడు నాలుగేళ్ల చిన్నారి కూడా ఉండడం అత్యంత విషాదకరం. 

అయితే అతడి టార్గెట్‌ అత్యంత వృద్ధులే. వారి అయితే ఎలాంటి అనుమానం రాకుండా చంపేయొచ్చనేది అతడి ఆలోచన కావొచ్చనేది పోలీసుల అనుమానం. ఇక ఈ హెరాల్డ్ షిప్‌మాన్ డాక్టర్ అయిన వెంటనే వెస్ట్ యార్క్‌షైర్‌లో ఉద్యోగం పొందాడు. అతను ప్రిమ్రోస్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు కూడా. ఇంత మంచి జీవితాన్ని ఇలా ఎందుకు చీకటి మయం చేసుకున్నాడనేది అర్థంకానీ చిక్కుప్రశ్న.

స్టార్‌ డాక్టర్‌ నుంచి కిల్లర్‌గా..
1972లో, అతను 26 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు న్యుమోనియాతో బాధపడుతున్న  నాలుగేళ్ల బాలికను చికిత్స పేరుతో హతం చేశాడు. బాలిక తల్లిని టీ తీసుకురమ్మని చెప్పి..హతమార్చాడు. అయితే ఆమె కూడా అనుమానించలేకపోయింది. ఎందుకంటే ఆమె అనారోగ్యంతోనే బాధపడటంతో ఆ ఆలోచనే ఆమెకు తట్లలేదు.

ఎప్పుడైతే ఈ డాక్టర్‌ పట్టుబడ్డాడో అప్పుడామె తాను కూడా బాధితురాలినంటూ కోర్టు మందు ప్రత్యక్ష సాక్షిగా వాంగ్మూలం ఇచ్చింది. అతడు వైద్యుడిగా వెస్ట్ యార్క్‌షైర్‌లో ఉన్న సమయంలో అతని సహచరులు పెద్ద మొత్తంలో నొప్పి నివారిణి పెథిడిన్ కనిపించకుండా పోయిందని గమనించడం ప్రారంభించారు. అయితే ఇక్కడ హెరాల్డ్ మంచి డాక్టర్‌గా గుర్తింపు ఉండటంతో ఎవ్వరూ అతడిని అనుమానించే సాహసం చేయలేకపోయారు. 

ఈ డాక్టర్‌ మొదట అక్కడ పేషెంట్ల నమ్మకం పొందాక...తన ప్రణాళికను అమలు చేయడం మొదలు పెడతాడు. వృద్ధులనే టార్గెట్‌ చేసుకుని హత్యలకు పాల్పడుతాడు. ఒక్కొసారి వారిని ఇంటికి రమ్మని పిలచి మరీ హతమారుస్తుంటాడు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే రోగికి కూడా వైద్యుడే తమను చంపుతున్నాడన్న విషయం తెలియదు. అయితే అతడితో చికిత్స పొందిన రోగులంతా చివరగా విపరీతమైన దగ్గుతో లేదా అంబులెన్స్‌కి ఫోన్‌ చేస్తూ మరణించినవారే..!. అలా 1998 వరకు ఇలాంటి దారుణాలకే పాల్పడుతూ వచ్చాడు.

పట్టించిన కేసు..
1998లో, అతను హైడ్ మాజీ మేయర్ కాథ్లీన్ గ్రండి (81)కి చికిత్స చేశాడు. ఆమె అత్యంత చురుకైన వ్యక్తి, మంచి ఆరోగ్యవంతురాలు, ధనవంతురాలు కూడా. అయితే ఆమె చెవులకు సంబంధించిన సమస్యతో అతడి వద్దకు వెళ్లింది. అతడిని సందర్శించిన నాలుగంటల్లోనే చనిపోయింది. ఇక్కడ కాథ్లీన్‌ గ్రండి కూతురు  ఏంజెలా వుడ్రఫ్‌కి తన తల్లి మరణం సహజమైనది కాదనేది ఆమె అనుమానం. ఆ దిశగానే ఆలోచించడం మొదలుపెట్టింది. 

అయితే ఆమె తల్లి అంత్యక్రియలు పూర్తి అయ్యిన నెలకు ఆమె వీలునామా గురించి ఆరా తీసింది. అందులో మొత్తం ఆస్తి అంతా డాక్టర్‌ హెరాల్డ్‌కి కట్టబెట్టినట్లుగా ఉండటంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. అదీగాక ఇక్కడ వుడ్రప్‌ లాయర్‌ కావడంతో పోలీసులతో కలిసి తన తల్లి హత్య కేసుని చేధించడం చాలా తేలికయ్యింది. 

ఆ క్రమంలోనే డాక్టర్‌ హెరాల్డ్‌ పట్టుబట్టాడు. అతడి శస్త్రచికిత్స చేసే రూమ్‌లో టైప్‌రైటర్‌ని గుర్తించారు పోలీసులు. అలాగే వీలునామాలో కూడా కాథ్లీన్ గ్రండి సంతకాన్ని పోర్జరీ చేసినట్లు తేలుతుంది. మరో ట్విస్ట్‌ ఏంటంటే ఇక్కడ వుడ్రఫ్‌ని డాక్టర్‌ హెరాల్డ్‌ ఆమె తల్లిని దహనం చేయమని కోరాడు. అయితే అందుకు వుడ్రఫ్‌ వ్యతిరేకించి తమ మతానుసారం ఖననం చేస్తుంది. 

ఎప్పుడైతే డాక్టరే నేరస్తుడని తేలిందో.. అప్పుడే వుడ్రఫ్‌కి ఈ సంభాషణ గుర్తుకొస్తుంది. ఆ రోజు హెరాల్డ్‌ ఎందుకని తన తల్లిని దహనం చేయమన్నాడన్న అనుమానంతో..  తన తల్లి సమాధి నుంచి అవశేషాలను వెలికి తీసి మరీ పోస్ట్‌మార్ట్‌ చేయిస్తుంది. నివేదికలో కాథ్లీన్‌ శరీరంలో ప్రాణాంతకమైన మార్ఫిన్ పెద్ద మొత్తంలో ఉన్నట్లు తేలుతుంది. దీంతో పోలీసులు సదరు వైద్యుడు హెరాల్డ్‌ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే 50 మంది రోగులను చంపినట్లు తేలుతుంది. 

కానీ పోలీసుల దర్యాప్తు ఆ సంఖ్య 200కి చేరుకుంటుంది. ఇంతమందిని పొట్టనబెట్టుకున్నాడా అని పోలీసులే విస్తుపోతారు. అయితే కోర్టు అతడు ఇంత మందిని హత్య చేసేందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? అతడి మనోస్థితి ఏంటో చెప్పాల్సిందిగా మానసిక నిపుణులను కోరింది. అయితే మానసిక నిపుణులు ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పారు. 

ఒకరు అతడి తల్లి చిన్నతనంలో కేన్సర్‌తో బాధపడుతూ..ఆ నొప్పిని భరించలేక మార్ఫిన్‌ ఇంజెక్షన్‌లు తీసుకుందని అయినా ఫలితం లేక మరణించినట్లు తెలిపారు. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసి ఇలా చేస్తున్నట్లు చెప్పారు. మరికొందరూ నిపుణులు తనను తాను దేవుడిగా ఊహించుకుని మరణాన్ని శాసించాలన్న ఉద్దేశ్యంతో చేశాడని చెప్పుకొచ్చారు.

అయితే హెరాల్డ్‌ మాత్రం కోర్టు ముందు హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు కానీ ఎందుకు చేశాడన్నది వివరించలేదు. చివరికి ఆ కిరాతకు వైద్యుడు హెరాల్డ్‌కి 2000 సంవత్సరంలో జీవిత ఖైదు విధించింది కోర్టు. అయితే రెండేళ్లకే తన 58వ పుట్టిన రోజునాడు తన జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఆ డాక్టర్‌ అందమైన తన జీవితాన్ని ఎందుకు చేజేతులారా నాశనం చేసుకున్నాడనేది ఎవరికీ అర్థకానీ మిస్టరీలా మిగిలిపోయింది.

(చదవండి: 'రియల్‌ లైఫ్‌ పరాన్నజీవి'..ఏడేళ్లుగా ఇంటి పాత యజమాని..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement