ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!
స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.
అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.
అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్‌లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్, తండ్రి సంతోష్ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.
ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.
స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?
ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది.
స్నేహ మా ఇంటి వెలుగు
స్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment