నేటితరంలో యువతను సునిశితంగా పరికిస్తే, కొందరిలో ఒక రకమైన నిరుత్సాహ ధోరణి కనబడుతుంది. ‘‘నేను పెద్ద చదువులు చదువుదామని అనుకున్నా, కానీ అది నాకు సాధ్యం కాని పని కదా’’, ‘‘నేను సివిల్ సర్వీస్ అంటే విపరీతంగా అభిమానిస్తా.. కానీ నాకది సాధ్యం కాదు సుమా..’’ వంటి సంభాషణలు తరచు వింటూ ఉంటాం. కానీ, ఆ ధోరణిలో మాట్లాడే యువతీ యువకుల మాటలను విని వదిలేయడం కాకుండా, వీలున్నంత వరకు వారిని సంస్కరించడానికి యత్నించాలి.
మానవుడు సాధించలేనిది ఏముంది? మహితమైన, జగతికి హితమైన ఎన్నో కార్యాలను మన తోటి మానవులే సాధించారు. వారికి, సామాన్యమైన రీతిలో సాగేవారికి తేడా ఏమిటి? కారణాలు ఎన్నైనా, ప్రధాన సూత్రం ఒక్కటే..!! వారు తమపై తమకు అపురూపమైన రీతిలో నమ్మకాన్ని కలిగి ఉండడమే గాకుండా, తగిన రీతిలో పరిశ్రమించడమనేదే, వారు కోరుకున్నది సాధించగలగడానికి సహకరించిన విశేషమైన అంశం.
వ్యక్తి అస్థిత్వాన్నీ, గుర్తింపును నిర్వచించే వాటిలో మొదటిది వారికి తమపై తమకున్న అవగాహన. వర్తమానంలో తానే స్థితిలో ఉన్నాడు, భవిష్యత్తులో తాను చేరాలనుకునే ఉన్నతస్థానం ఏమిటి అన్నది స్థిరంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలి. ఆ విధంగా తనను తాను ముందుగా అంచనా వేసుకోవడం ప్రతివారికీ అవసరం. స్వీయ పరిశీలన చేసుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం వ్యక్తి పురోగతి సాధించడంలో తీసుకోవవలసిన అత్యంత సమంజసమైన విధిగా నిస్సందేహంగా చెప్పవచ్చు.
విద్యలోనూ, విషయ గ్రాహ్యతలోనూ అంతగా రాణించే శక్తిలేని మనిషి, తాను ఎంత దృఢమైన రీతిలో ఉన్నతస్థానాన్ని అధిరోహించాలని భావించినా, సాధారణ పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఎందుకంటే, వారికున్న మానసిక బలం, శారీరక బలం కార్యసాధనకు సహకరించాలి కదా..!! అయితే, ఇది దుస్సాధ్యమైన విషయంగా పరిగణించవలసిన పనిలేదు.
మనం అనుకున్నదానికంటే, మన అవగాహన గుర్తించినదానికంటే, ఎంతో అధికమైన శక్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. కృతనిశ్చయంతో ‘‘నేను నా రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించగలను’’ అని భావించి, ఉద్యమిస్తే, ఉత్తమ ఫలితాలను సాధించడం కష్టమైన విషయమేమీ కాదు. అంతే కాదు.. అదే కృషిని త్రికరణశుద్ధిగా కొనసాగిస్తే, ఉన్నతస్థానంలో నిలకడను సాధించి నిలబడగలగడమూ కష్టమేమీ కాదు.
తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో ప్రతి వ్యక్తీ స్వీయ క్రమశిక్షణ పాటించడం అవసరం. ఆత్మనియతితో తమపై తాము విధించుకుని అమలుపరచే జీవన విధానమే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి.
స్వీయనియంత్రణ అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తీ తాను రోజుకు ఎంత సమయాన్ని కార్యసాధన కోసం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాడనేది ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. కాసేపు మొక్కుబడిగా పనిచేసి, అనుకున్న ఫలితం రాలేదని భావించడంవల్ల ప్రయోజనం లేదుకదా..!! ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తి ఎటువంటి దురలవాట్లకూ బానిస కాకుండా ఉండడమూ స్వీయ నియంత్రణలో అంతర్భాగమే..!!
తనను తాను సరిచేసుకుని ముందుకు సాగే విధానంలో సాధకుడు సానుకూలమైన ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలకూ చోటు ఇవ్వకూడదు. సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణిని సూచించే ఒక చిన్న ఉదంతాన్ని ప్రస్తావించుకుందాం.
ఒకచోట ఒక వక్త చక్కని ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని ఇస్తున్నాడు. ఇద్దరు మిత్రులు ఆ ఉపన్యాసాన్ని వినగోరి అక్కడకు వచ్చారు. వక్త తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే, ఆయన మెడలో ఉన్న గులాబీ దండలోని రేకులు ఒక్కటొక్కటిగా రాలి పడుతున్నాయి. మిత్రుల్లో ఒకడు రెండోవాడితో ‘‘చూశావా.. ఆయన వేసుకున్న దండలోని గులాబీరేకులు ఎలా రాలి పడుతున్నాయో..!! కాసేపటికి రేకులన్నీ రాలిపోగా చివరికి లోపలున్న దారం ఒక్కటీ ఆయన మెడలో మిగులుతుంది’’ అంటూ ఎకసెక్కపు ధోరణిలో నవ్వాడు.
రెండోవ్యక్తి అతని మాటలకు ప్రతిస్పందిస్తూ, ‘‘నువ్వు ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తు్తన్నావు మిత్రమా.. ఆయన అమృతమయ వాక్కులకు పరవశించి, ఆ గులాబీ రేకులు పూజిస్తున్న చందాన, పవిత్రమైన ఆయన పాదాలను తాకుతున్నాయని భావించవచ్చు కదా’’ అన్నాడట. మనిషిలోని సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణులకు ఈ మిత్రుల మాటలే అద్దం పడతాయి.
సమస్త శక్తీ మనలోనే నిబిడీకృతమై ఉంది. మనసారా పరిశ్రమిస్తే, తలపెట్టిన ఏ పనైనా సమర్థవంతంగా పూర్తి చేయగలడు. అద్వితీయమైన తన చేతలతోనే దైవత్వాన్నీ ప్రదర్శించగలడు. నిద్రావస్థను వదిలి జాగ్రదావస్థలోకి రాగలిగితే మానవమేధ దారిలోఎదురయ్యే అన్ని అవరోధాలను తొలగిస్తుంది... అన్ని అవసరాలనూ తీర్చగల, అన్ని ఆకాంక్షలనూ ఈడేర్చగల అపూర్వమైన శక్తి మనిషిలో దాగి ఉంది. అయితే, ఆ శక్తి తనలో ఉందని గ్రహించగలగడమే వివేకవంతుడు చేయగలిగిన పని.
జీవితంలో లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎంతోమంది ఓటమి పాలవ్వడం లేదా ఆశించిన గమ్యాన్ని అందుకోకపోవడానికి స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే కారణం. జీవులందరూ ఒకేరకమైన రీతిలో జనించినా, అందులో కొంతమంది వ్యక్తులు మాత్రమే అసాధారణమైన విజయాలను అందుకోవడానికి, తాము అనుకున్న ఎత్తుకు ఎదగడానికి కారణం వారు పాటించే స్వీయ నియంత్రణ లేదా క్రమశిక్షణ అని చెప్పవచ్చు.
ప్రతి మనిషీ తన లక్ష్యాన్ని సాధించడానికి కొందరినుంచి స్ఫూర్తిని పొందుతూ ముందుకు సాగుతాడు. తనకు స్ఫూర్తిదాతయైన వ్యక్తి ఆధ్యాత్మికంగా శక్తిమంతుడు కావచ్చు, లేదా ఒక జనహితం కోసం కృషి చేసే నాయకుడో, సమాజ సేవకుడో లేక క్రీడాకారుడో కావచ్చు. అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్న వారో, తమ చేతలద్వారా చరిత్రలో నిలిచిపోయిన ఏ వ్యక్తి నుంచైనా స్ఫూర్తిని పొందవచ్చు. తాను పొందిన అమేయమైన స్ఫూర్తిని, అమలుపరచడంలో ఎడతెగని ఆర్తిని కనబరచి, త్రికరణశుద్ధిగా కృషి చేస్తే, భవిత సాధకునికి తప్పనిసరిగా దీప్తిమంతమవుతుంది.
–వ్యాఖ్యాన విశారద+
.++000000000
వెంకట్ గరికపాటి
Comments
Please login to add a commentAdd a comment