ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత పరిస్తితులను స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది . అదృష్టమో దురదృష్టమో కాని స్మార్ట్ ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది . చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, అందలమెక్కేసినట్లుగా చెలరేగిపోతోంది నేటి యువత. ఒక యువత అనే కాదు, స్మార్ట్ ఫోన్‌లకు దాదాపుగా ప్రతి ఒక్కరూ బానిసలుగా మారిపోతున్నారు. సిటీల నుండి ప్రారంభమైన స్మార్ట్ ఫోన్‌ల వాడకం ప్రస్తుతం ప్రతి గ్రామానికి పాకి వ్యక్తులను తనకు బానిసలుగా మార్చుకుంది. అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి అంతర్జాలానికి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పడింది. సోషల్ మీడియా వ్యసనానికి బానిసలయ్యాక యువకులు త్వరగా డిప్రెషన్‌కి లోనవుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు అలవాటైపోయిన యువకులు ఒక్కరోజు ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే తల్లడిల్లి పోతున్నారు.
చిన్న పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ పడగానే పిల్లవాడి ఏడుపు ఆపేస్తున్నాడంటే ఆలోచించండి. సి.సి.ఈ. విద్యా విధానంతో కూడా ప్రాజెక్టుల పేరుతో పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ విని యోగం పెరుగుతోంది. బాలలకు ఆలోచన గుణం మందగించడం, ప్రతి దానికి గూగుల్‌పై ఆధారపడటం మామూలై పోయింది. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతూ మన ఆరోగ్య విషయాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నాం. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు లభించడంతో ప్రతీ ఒక్కరూ వాటిని క్షణాల్లో కొనేస్తున్నారు. చదువుకునే వయసులో పుస్తకాల పురుగులు కావాల్సిన పిల్లలు.. సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు వదిలిన తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు.. బ్యాగులను ఓ మూలన పడేసి.. స్మార్ట్ ఫోన్లలో మునిగితేలుతున్నారు. ఏ ఫ్రెండ్ ఏం పోస్టు చేశాడు? తను పెట్టిన ఫోటోకు ఎంతమంది లైక్స్ కొట్టారు? ఎంతమంది షేర్ చేశారు? ఏం కామెంట్స్ రాశారు? అని స్మార్ట్ ఫోన్‌లను పట్టుకుని వెతుకుతున్నారు. చివరకు తిండిని కూడా మరిచిపోతున్నారు. నిద్ర కూడా సరిగా పోకుండా అనారోగ్యానికి గురవుతున్నారడంలో సందేహం లేదు.
స్మార్ట్ ఫోన్ పడకగదిలోకి ప్రవేశించింది, దాంపత్యజీవితాలలో చిచ్చులు, గొడవలు ప్రారంభమయ్యింది. అప్పడి వరకు ఆనందంగా గడిపిన జీవితం సెల్ ఫోన్ ప్రవేశంతో దు:ఖ సాగరంలోకి నెట్టి వేసింది. తన జీవిత భాగస్వామితో సన్నిహితంగా మెలగడానికి సమయం దొరకడం లేదు. నిద్ర కూడా కరువవుతోంది. తల్లిదండ్రులు వారి పిల్లల కంటే స్మార్ట్ ఫోన్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఒక నిదర్శనం. స్మార్ట్ ఫోన్‌తో సరదాగా గడిపే సమయంలో నాలుగో వంతు కూడా పిల్లలతో గడపడానికి కేటాయించడం లేదు. పరస్పరం కలుసుకుని, ముఖాముఖి సంభాషించుకోవడం అనేది జరుగడం లేదు. దీనితో అనురాగం, ఆప్యాయతలు, అభిమానం, ప్రేమల విలువల తెలియడం లేదు. యువతలో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ ఫోటోలు తీయడం పిచ్చిగా మారింది.
ఎక్కడ పడితే సెల్ఫీలు దిగడం మామూలైపోయింది. ఆన్ లైన్‌లో, ఫోన్ చాటింగ్‌లలో గడిపే యువత నిద్రించే సమయం బాగా తగ్గిపోయింది. నిద్రలేమి వలన డిప్రెషన్‌లోకి వెళ్లడం జరుగుతుంది.స్మార్ట్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోయిన యువత తమ స్నేహితులతో, బంధువులతో, సన్నిహితులతో కాలం గడిపే సమయమే తగ్గిపోతోంది. ఫలి తంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తీవ్రమైన వ్యాకులత, నిస్పృహ, ఒంటరితనానికి లోనౌతోంది యువత. జీవితాలలోను, ఉద్యోగాలలో కూడా భద్రత తక్కువ, చికాకులు ఎక్కువ. చిన్నపాటి సమస్యల పట్ల కూడా సంయమనం పాటించే గుణం యువకులలో కనిపించడం లేదు. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి : వ్యాసకర్త కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 97039 35321
Comments
Please login to add a commentAdd a comment