Dangerous journey
-
ఖమ్మం దారి..నరకంలో సవారీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రవి కుటుంబం సంక్రాంతి పండగను సొంతూళ్లో జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాజమండ్రి బయలుదేరింది. భోగి మంటలు వేసే సమయానికి గమ్యం చేరుకోవాలన్న ఉద్దేశంతో ముందురోజు రాత్రి 7.45కు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. కానీ రాజమండ్రి చేరుకునేసరికి ఉదయం 8 దాటింది. ప్రయాణ సమయం ఏకంగా 12 గంటలకుపైగా కొనసాగింది. దీంతో తిరుగు ప్రయాణంలో రిజర్వ్ చేసుకున్న ఆర్టీసీ టికెట్‌ను రద్దు చేసుకుని మరీ ప్రైవేటు బస్సు ఎక్కారు. తిరుగు ప్రయాణం రాత్రి 10కి ప్రైవేటు బస్సులో బయలుదేరారు. ఉదయం 6.15కు లక్డీకాపూల్ చేరుకున్నారు. ఎందుకీ తేడా.. ఆర్టీసీ బస్సు ప్రధాన నినాదం భద్రత. అంతర్గత నినాదం పొదుపు మంత్రం. ఒకటి ప్రయాణికులకు క్షేమదాయకమైతే.. రెండోది సంస్థకు లాభసాటి. నాన్‌స్టాప్‌గా తిరిగే బస్సులను వీలైనంత దగ్గరి దారిలో పంపటం ద్వారా డీజిల్ ఖర్చును తగ్గించుకోవాలని ఆర్టీసీ ఆలోచిస్తుంది. ఇందుకోసం సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులను దగ్గరి దారిలో గమ్యం పంపే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే నాన్‌స్టాప్ బస్సులను ఈ ఉద్దేశంతోనే ఖమ్మం మీదుగా గోదావరి జిల్లాలోకి ప్రవేశించే కొవ్వూరు మార్గాన్ని ఎంచుకుంది. విజయవాడ మీదుగా కంటే ఇది దగ్గరిదారి కావటమే కారణం. ఇక్కడే సమస్య ఎదురైంది. గత కొన్నేళ్లుగా సరైన నిర్వహణ లేకపోవటంతో ఈ దారి బాగా దెబ్బతిన్నది. మెయింటెనెన్స్ పనులు నామమాత్రంగా ఉండటంతో ఇటీవలి భారీ వర్షాలకు పెద్ద గోతులు పడి మారుమూల పల్లె దారికంటే హీనంగా తయారైంది. ముఖ్యంగా వైరా–సత్తుపల్లి మధ్య దాదాపు పది కిలోమీటర్ల మేర రోడ్డుమీద ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. మళ్లీ ఏపీ పరిధిలో జంగారెడ్డి గూడెం–రాజమండ్రి మధ్య ఇలాగే తయారైంది. ఇతర కొన్ని చోట్ల కూడా కిలోమీటర్ల మేర రోడ్డు దారుణంగా మారింది. దీంతో బస్సులు బాగా నెమ్మదిగా వెళ్తే తప్ప క్షేమంగా గమ్యం చేరని పరిస్థితి. ఏమాత్రం వేగంగా వెళ్లినా అదుపుతప్పి బోల్తా కొట్టే ప్రమాదం ఉంది. ఈ దారిలో ప్రస్తుతం దాదాపు పది ప్రాంతాల్లో ఇలాగే బోల్తాపడ్డ లారీలు కనిపిస్తున్నాయి. దీంతో నెమ్మది ప్రయాణం తీవ్ర జాప్యానికి కారణమవుతోంది. విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లేందుకు 8 గంటల సమయం పడుతుండగా, ఖమ్మం మీదుగా 12 గంటల సమయం పడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో నాన్‌స్టాప్ సర్వీసులకు ఇదే రోడ్డు సూచించడంతో ఆ బస్సులో వెళ్లివచ్చే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు ప్రయాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండగా మరోవైపు గోతుల వల్ల వెన్నుపూస సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవలి సంక్రాంతి ప్రయాణాలు వారికి ప్రత్యక్ష నరకాన్ని చవిచూపాయి. రెండు వైపులా ఆర్టీసీ బస్ టికెట్ బుక్ చేసుకున్నవారిలో కొందరు వెళ్లేప్పుడు దుస్థితి చూసి వచ్చేప్పుడు టికెట్ రద్దు చేసుకుని విజయవాడ మీదుగా వచ్చే బస్సులను ఆశ్రయించటం విశేషం. ఆ రోడ్డుకు ఆ దుస్థితి ఎందుకు.. రెండేళ్ల క్రితం వరకు ఇది రాష్ట్ర రహదారి. ఆ సమయంలో కూడా దీనిపై దృష్టి పెట్టకపోవటంతో ఇది గోతులుగానే ఉండేది. కానీ అడపాదడపా చేపట్టే రెన్యూవల్స్‌తో కాస్త మెరుగుపరుస్తూ నెట్టుకొచ్చేవారు. రెండేళ్ల క్రితం దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించారు. అంటే నేషనల్ హైవే విభాగం దీన్ని విస్తరించి మెరుగు చేయాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్రం నిధులు ఇవ్వాలి. ఎన్నికల సమయం కావటంతో దాదాపు ఏడాదిన్నరగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ దీన్ని పెండింగ్‌లో ఉంచింది. జాతీయ రహదారిగా ప్రకటించినందున రాష్ట్ర అధికారులు దీన్ని పట్టించుకోలేదు. ఫలితంగా అసలు మరమ్మతులే లేకపోవటంతో అత్యంత దారుణంగా తయారైంది. దీంతో ఆ దారిగుండా వెళ్లే వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. త్వరలో పనులు రోడ్లు, భవనాల శాఖ అధికారులు జాతీయ రహదారిగా డిక్లేర్ చేసినందున కొంతకాలంగా మేం మరమ్మతులు చేపట్టలేదు. జాతీయ రహదారిగా మార్చే పనిలో జాప్యం జరిగినందున ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రెన్యూవల్స్ చేపట్టనున్నాం. రోడ్డు బాగా దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించాం. దాదాపు రూ.7 కోట్లతో త్వరలో పనులు చేపడతాం ప్రత్యామ్నాయంపై దృష్టి: ఆర్టీసీ అధికారులు రాజమండ్రికి అది దగ్గరి దారి కావటంతో ప్రధాన సర్వీసులను అటుగా తిప్పుతున్నాం. కానీ రోడ్డు బాగా దెబ్బతిన్నందున ఇటు ప్రయాణికులకు ఇబ్బంది కావటంతోపాటు అటు బస్సులు దెబ్బతినే పరిస్థితి ఉంది. స్థానిక డిపో అధికారులతో చర్చించి బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపే దిశగా చర్యలు తీసుకుంటాం. -
డేంజర్ జర్నీ
-
ఈ ప్రయాణం ప్రమాదకరమైనది
భుజాన బిడ్డను మోసుకుంటూ ముందుకెళ్తున్నాడో తండ్రి. స్కూల్ బ్యాగు తడిసిపోకుండా జాగ్రత్తపడుతోందొక విద్యార్థిని. నిత్యావసర సరుకుల కోసం పొరుగు గ్రామానికి బయల్దేరాడో వ్యక్తి. మోకాలి లోతులో నీటి ప్రవాహం. వర్షాలు కురిస్తే తప్పని ప్రమాదకర విన్యాసం. ఏటా వర్షం కురిస్తే సువర్ణముఖి నదిలో కనిపించే దృశ్యాలివి. వంతెన నిర్మించక ఆరు గ్రామాలు పడుతున్న అవస్థలివి. సీతానగరం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆవాలవలస, అంటివలస, రేపటివలస, కొత్తవలస, చినంకలాం, గెడ్డలుప్పి గ్రామాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆవాలవలస, చినంకలాం గ్రామాల ప్రజలు బూర్జలోని రేషన్ డిపోలు, కిరాణా దుకాణాల నుంచి నిత్యావసర సరుకులు తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. తామరఖండి నుంచి రేపటివలస, బగ్గందొరవలసుంచి గెడ్డలుప్పి, కొత్తవలస గ్రామస్తులు సరుకులు తీసుకెళ్తుంటారు. కానీ వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో సరుకులు అందక అవస్థలు పడుతున్నారు. గెడ్డలుప్పి నుంచి నిత్యం పిల్లలను విద్యాలయాలున్న సీతానగరం, చినబోగిలి, విశాఖపట్నం, బొబ్బిలి తదితర సుదూర ప్రాంతాలకు బగ్గందొరవలస కూడలి నుంచి వెళ్లాలి. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు సువర్ణముఖి నదిలో నీరు ఉధ్ధృతంగా ప్రవహించడంతో పిల్లలను తల్లిదండ్రులు భుజాన వేసుకుని నది దాటిస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఉన్నత చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు బ్యాగ్‌లో రెండు జతల బట్టలు వేసుకుని వస్తున్నారు. నదిలో తడిసినబట్టలు ఒడ్డున ఆరవేసి, పొడి బట్టలను వేసుకుని వెళ్తున్నారు. వైఎస్ హఠాన్మరణంతో నిర్లక్ష్యం సుమారు 400 కుటుంబాలున్న గెడ్డలుప్పి గ్రామస్తులు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా సువర్ణముఖి నదిని దాటుకుని బగ్గందొరవలస సెంటర్ మీదుగా మండల కేంద్రానికి రావాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో సువర్ణముఖినదిపై వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరుచేసి పనులకు భూమి పూజ చేశారు. అప్పట్లో 2010-11 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వైఎస్ హఠాన్మరణం అనంతరం 10 శాతం పనులు చేసి నిలిపివేశారు. వంతెన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, వారి మాటలు నమ్మే స్థితిలో లేమంటున్నారు ఈ ప్రాంతీయులు. ఎక్కువ నీరుంటే కాలేజీకి డుమ్మా రోజూ ఉదయం గెడ్డలుప్పి నుంచి కాలేజీకి వెళ్తుంటాను. నదిలో ఎక్కువ నీరు ప్రవహిస్తే దిగలేక కాలేజీ మానేస్తాను. వంతెన నిర్మిస్తామన్న హామీతో ఎంతో సంతోషించాం. కానీ ఇప్పటికీ నిర్మాణం పూర్తికాలేదు. - ఎస్ సురేష్‌కుమార్, ఇంటర్ విద్యార్థి, గెడ్డలుప్పి పనులు మాని పిల్లాడ్ని ఏరు దాటిస్తున్నా రోజూ పిల్లాడ్ని గెడ్డలుప్పి నుంచి నదిని దాటించుకుని బగ్గందొరవలస కూడలికి పంపిస్తున్నాను. సాయంత్రం నది ఒడ్డున పిల్లాడు వచ్చేవరకూ నిరీక్షిస్తున్నాను. దీంతో వ్యవసాయ పనులు చేయలేకపోతున్నాం. - కె.శ్రీనివాసరావు, రైతు, గెడ్డలుప్పి. -
డేంజరస్ జర్నీ..
బంగారు భవిష్యత్తు బుగ్గి రోడ్డు ప్రమాదాల బారిన యువత బైక్‌లను నిర్లక్ష్యంగా నడపడమే కారణం హెల్మెట్ లేకపోవడం.. తాగి నడపడం కారణాలేవైనా ప్రమాదంలో పడుతుంది వీరే.. సాక్షి, సిటీబ్యూరో: వాహనాలు నడపడంలో చిన్నపాటి నిర్లక్ష్యం యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తోంది. ముఖ్యంగా కాలేజీ పిల్లలు అత్యధికంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. మితిమీరిన వేగం, త్రిబుల్ రైడింగ్, అడ్డదిడ్డంగా నడపడం, డ్రంకన్ డ్రైవ్, హెల్మెట్ లేకపోవడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇందులో మరణాలు సైతం సంభవిస్తుండగా వందల సంఖ్యలో గాయాలపాలవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవడం.. లెసైన్స్ లేకపోయినా వారికి బైక్‌లు ఇవ్వడం వల్ల నిత్యం కాలేజీ కుర్రోళ్లు ఎక్కడో అక్కడ మరణిస్తున్నారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులుగా మారుతున్నారు. పిల్లలతోపాటు తల్లిదండ్రులు మేల్కొంటేనే ఈ పరిస్థితి నుంచి బయట పడే అవకాశం ఉందని మేధావులు సూచిస్తున్నారు. నగర రహదారులపై ప్రమాదాల జోరు తగ్గడం లేదు. ముఖ్యంగా బైక్‌లే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఏడాది నగరంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఈ ఏడాది మే 31 వరకు నగరంలో మొత్తం 1,053 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో నిందితుల జాబితాలో 355 మంది ద్విచక్రవాహనదారులు ఉండడం గమనార్హం. 328 కేసులతో రెండో స్థానాన్ని కార్లు నడిపేవారు ఆక్రమించారు. ఇదిలావుంటే గాయపడిన వారిలోనూ ద్విచక్రవానదారులే మొదటి స్థానంలో ఉండగా 407 కేసులతో పాదచారులు రెండో స్థానంలో నిలిచారు. మొత్తం మీద ఇటు నిందితులు, అటు బాధితుల జాబితాల్లోనూ ద్విచక్రవాహన దారులు అగ్రభాగాన నిలిచారు. వీరిలో అత్యధికులు డిగ్రీ, పీజీలు చేసే వారు కావడం గమనార్హం. ఇందులో చాలామంది నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదాలకు గురైనట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల నియంత్రణేది..? చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను కనిపెట్టలేకపోతున్నారు. పిల్లలపై అపారమైన ప్రేమను కనబరచడం వల్ల వారు మైనార్టీ తీరకుండానే, లెసైన్స్ లేకుండానే బైక్‌లపై రోడ్డుపైకి వస్తున్నారు. అదీగాక మితిమీరన వేగంతో బైక్‌లను నడపడం వల్ల నిత్యం అనేక చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు నగరంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బైక్ రేసింగ్‌లు ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. వీటిని అడ్డుకునే పరికరాలు, యంత్రాంగం అందుబాటులేదు. త్రిబుల్ రెడింగ్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులు.. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులే అధికం. కళాశాలలన్నీ నగర శివారుల్లో ఉండడంతో విద్యార్థుల రాకపోకలకు సరిపడా రవాణా వ్యవస్థ లేకపోవడంతో తల్లిదండ్రులు వారికి బైక్‌లను సమకూరుస్తున్నారు. అప్పటివరకు ఆటోలు, స్కూల్, కాలేజీ బస్సుల్లో వెళ్లిన విద్యార్థులకు బైక్‌లను నడిపే అనుభవం తక్కువ. అలాంటి వారికి బైక్‌లు ఇవ్వడంతో వీరు తమ తోటి స్నేహితులకు లిఫ్ట్పేరిట త్రిబుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో సైతం.. రోడ్డు ప్రమాదాల్లో అగ్రస్థానంలో నిలిచిన ద్విచక్ర వాహనదారులు డ్రంకన్ డ్రైవ్‌లోనూ ముందు వరుసలోనే నిలుస్తున్నారు. నాలుగేళ్లలో నమోదైన డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారి జాబితాలో వారే అధికంగా ఉండడం ఇందుకు నిదర్శనం. 2011 నుంచి ఈ ఏడాది జూన్ వరకు నమోదైన కేసుల్లో బైక్ చోదకులు 23,944 మంది పట్టుబడి అగ్రస్థానంలో ఉండగా కార్లు నడుపుతూ పట్టుబడిన వారు 7,641 మంది, ఆటో డ్రైవర్లు 1,427 మంది ఉన్నారు. మద్యం పార్టీల కల్చర్ పెరగడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హెల్మెట్లు తప్పనిసరి... ప్రమాదాల బారిన పడిన ద్విచక్ర వాహనదారుల్లో ఎక్కువ మంది మరణించడమో, గాయపడడానికి ముఖ్య కారణం హెల్మెట్ లేకపోవడమనే విషయం బహిర్గతమవుతోంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి హెల్మెట్లు తప్పనిసరి అని నగర ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇటీవల హెల్మెట్ల వినియోగాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నామని, హెల్మెట్ లేకపోతే కేసులు రాస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గత వారంలో హెల్మెట్ ధరించని రెండు వేలకుపైగా వాహనదారులకు చలానా విధించినట్టు వారు పేర్కొన్నారు. -
అక్కడ అదుపు తప్పితే అడ్రస్ పైలోకంలోనే
ఉత్తర భారతదేశ యాత్రకు దేశం నలుమూల నుంచే గాక ఇతర దేశాల నుంచి సైతం నిత్యం యాత్రికులు వెళ్తుంటారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఉత్తరాదిన ఉండే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర, పుణ్యక్షేత్రాలతో కూడిన ఉత్తరాఖండ్ భూతల స్వర్గంగా పేరుగాంచితే.. బౌద్ధుల పుణ్యక్షేత్రం ధర్మశాల ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి సౌందర్యాలకు మారు పేరు. అయితే ఈ రెండు రాష్ట్రాలు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్‌కు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయిన సంగతి తెలిసిందే. నిర్లక్ష్యమే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. ఇక పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో మంగళవారం బస్సు లోయలోకి పడిన సంఘటనలో 13 మంది రష్యన్లు మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 30 మందికిపైగా మరణించారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో గత నెల 9న నదిలోకి బస్సు పడిన సంఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలకు కారణాలను విశ్లేషిస్తే.. కొండలు, పక్కనే లోయలు, మధ్యన వంద మీటర్ల లోతున ప్రవహించే నదులతో కూడిన కొండ ప్రాంతాల్లో ఇరుకైన దారుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకప్పుడు నడకదారులే నేడు చాలా వరకు బస్సు మార్గాలు. అందులోనూ భయంకరమైన మలుపులు, ఎలాంటి రక్షణ గోడలూ లేని దారిలో వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మరింత ఆధ్వాన్నంగా మారుతుంటాయి. ఈ ప్రాంతంలో బస్సు ప్రయాణమంటే ప్రయాణికులు గుండెను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. రహదారుల విస్తరణ, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోవడం కూడా ఓ కారణం. వర్షాకాలంలో అయితే ఘాట్ ప్రాంతాల్లో ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఆధ్యాత్మిక భావన, ప్రకృతి రమణీయ దృశ్యాలతో యాత్ర మధురానుభూతులు మిగిల్చినా.. ఏ లోయలోనా, ఏ నదిలోనా పడకుంటా గమ్యస్థానం చేర్చాలని దేవుణ్ని ప్రార్థిస్తూ ప్రయాణించాల్సిందే.