ఖమ్మం దారి..నరకంలో సవారీ | Dangerous Roads From Khammam To Rajahmundry | Sakshi
Sakshi News home page

ఖమ్మం దారి..నరకంలో సవారీ

Published Sat, Jan 18 2020 4:37 AM | Last Updated on Sat, Jan 18 2020 8:13 AM

Dangerous Roads From Khammam To Rajahmundry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన రవి కుటుంబం సంక్రాంతి పండగను సొంతూళ్లో జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాజమండ్రి బయలుదేరింది. భోగి మంటలు వేసే సమయానికి గమ్యం చేరుకోవాలన్న ఉద్దేశంతో ముందురోజు రాత్రి 7.45కు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. కానీ రాజమండ్రి చేరుకునేసరికి ఉదయం 8 దాటింది. ప్రయాణ సమయం ఏకంగా 12 గంటలకుపైగా కొనసాగింది. దీంతో తిరుగు ప్రయాణంలో రిజర్వ్‌ చేసుకున్న ఆర్టీసీ టికెట్‌ను రద్దు చేసుకుని మరీ ప్రైవేటు బస్సు ఎక్కారు. తిరుగు ప్రయాణం రాత్రి 10కి ప్రైవేటు బస్సులో బయలుదేరారు. ఉదయం 6.15కు లక్డీకాపూల్‌ చేరుకున్నారు.

ఎందుకీ తేడా.. 
ఆర్టీసీ బస్సు ప్రధాన నినాదం భద్రత. అంతర్గత నినాదం పొదుపు మంత్రం. ఒకటి ప్రయాణికులకు క్షేమదాయకమైతే.. రెండోది సంస్థకు లాభసాటి. నాన్‌స్టాప్‌గా తిరిగే బస్సులను వీలైనంత దగ్గరి దారిలో పంపటం ద్వారా డీజిల్‌ ఖర్చును తగ్గించుకోవాలని ఆర్టీసీ ఆలోచిస్తుంది. ఇందుకోసం సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులను దగ్గరి దారిలో గమ్యం పంపే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వెళ్లే నాన్‌స్టాప్‌ బస్సులను ఈ ఉద్దేశంతోనే ఖమ్మం మీదుగా గోదావరి జిల్లాలోకి ప్రవేశించే కొవ్వూరు మార్గాన్ని ఎంచుకుంది. విజయవాడ మీదుగా కంటే ఇది దగ్గరిదారి కావటమే కారణం. ఇక్కడే సమస్య ఎదురైంది.

గత కొన్నేళ్లుగా సరైన నిర్వహణ లేకపోవటంతో ఈ దారి బాగా దెబ్బతిన్నది. మెయింటెనెన్స్‌ పనులు నామమాత్రంగా ఉండటంతో ఇటీవలి భారీ వర్షాలకు పెద్ద గోతులు పడి మారుమూల పల్లె దారికంటే హీనంగా తయారైంది. ముఖ్యంగా వైరా–సత్తుపల్లి మధ్య దాదాపు పది కిలోమీటర్ల మేర రోడ్డుమీద ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. మళ్లీ ఏపీ పరిధిలో జంగారెడ్డి గూడెం–రాజమండ్రి మధ్య ఇలాగే తయారైంది. ఇతర కొన్ని చోట్ల కూడా కిలోమీటర్ల మేర రోడ్డు దారుణంగా మారింది. దీంతో బస్సులు బాగా నెమ్మదిగా వెళ్తే తప్ప క్షేమంగా గమ్యం చేరని పరిస్థితి. ఏమాత్రం వేగంగా వెళ్లినా అదుపుతప్పి బోల్తా కొట్టే ప్రమాదం ఉంది.

ఈ దారిలో ప్రస్తుతం దాదాపు పది ప్రాంతాల్లో ఇలాగే బోల్తాపడ్డ లారీలు కనిపిస్తున్నాయి. దీంతో నెమ్మది ప్రయాణం తీవ్ర జాప్యానికి కారణమవుతోంది. విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లేందుకు 8 గంటల సమయం పడుతుండగా, ఖమ్మం మీదుగా 12 గంటల సమయం పడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో నాన్‌స్టాప్‌ సర్వీసులకు ఇదే రోడ్డు సూచించడంతో ఆ బస్సులో వెళ్లివచ్చే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు ప్రయాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండగా మరోవైపు గోతుల వల్ల వెన్నుపూస సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవలి సంక్రాంతి ప్రయాణాలు వారికి ప్రత్యక్ష నరకాన్ని చవిచూపాయి. రెండు వైపులా ఆర్టీసీ బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నవారిలో కొందరు వెళ్లేప్పుడు దుస్థితి చూసి వచ్చేప్పుడు టికెట్‌ రద్దు చేసుకుని విజయవాడ మీదుగా వచ్చే బస్సులను ఆశ్రయించటం విశేషం.

ఆ రోడ్డుకు ఆ దుస్థితి ఎందుకు.. 
రెండేళ్ల క్రితం వరకు ఇది రాష్ట్ర రహదారి. ఆ సమయంలో కూడా దీనిపై దృష్టి పెట్టకపోవటంతో ఇది గోతులుగానే ఉండేది. కానీ అడపాదడపా చేపట్టే రెన్యూవల్స్‌తో కాస్త మెరుగుపరుస్తూ నెట్టుకొచ్చేవారు. రెండేళ్ల క్రితం దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించారు. అంటే నేషనల్‌ హైవే విభాగం దీన్ని విస్తరించి మెరుగు చేయాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్రం నిధులు ఇవ్వాలి. ఎన్నికల సమయం కావటంతో దాదాపు ఏడాదిన్నరగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ దీన్ని పెండింగ్‌లో ఉంచింది. జాతీయ రహదారిగా ప్రకటించినందున రాష్ట్ర అధికారులు దీన్ని పట్టించుకోలేదు. ఫలితంగా అసలు మరమ్మతులే లేకపోవటంతో అత్యంత దారుణంగా తయారైంది. దీంతో ఆ దారిగుండా వెళ్లే వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. 

త్వరలో పనులు రోడ్లు, భవనాల శాఖ అధికారులు
జాతీయ రహదారిగా డిక్లేర్‌ చేసినందున కొంతకాలంగా మేం మరమ్మతులు చేపట్టలేదు. జాతీయ రహదారిగా మార్చే పనిలో జాప్యం జరిగినందున ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రెన్యూవల్స్‌ చేపట్టనున్నాం. రోడ్డు బాగా దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించాం. దాదాపు రూ.7 కోట్లతో త్వరలో పనులు చేపడతాం 

ప్రత్యామ్నాయంపై దృష్టి: ఆర్టీసీ అధికారులు
రాజమండ్రికి అది దగ్గరి దారి కావటంతో ప్రధాన సర్వీసులను అటుగా తిప్పుతున్నాం. కానీ రోడ్డు బాగా దెబ్బతిన్నందున ఇటు ప్రయాణికులకు ఇబ్బంది కావటంతోపాటు అటు బస్సులు దెబ్బతినే పరిస్థితి ఉంది. స్థానిక డిపో అధికారులతో చర్చించి బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపే దిశగా చర్యలు తీసుకుంటాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement