two wheeler vehicles
-
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
మహబూబ్‌నగర్ క్రైం: ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేయడం ప్రారంభించి.. పోలీసులకు దొరికిపోయాడు. జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని రాజాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సోమవారం మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కె.నరసింహ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా విద్యానగర్‌కాలనీకి చెందిన తాయి ప్రశాంత్‌కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో అతను సుభద్ర అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆ విషయం భార్యకు తెలిసి ఇద్దరు పిల్లలను చెరువులో తోసి ఆమె చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇద్దరు పిల్లలు మృతి చెందగా ఆమె బతకగా.. పోలీసులు జైలుకు పంపారు. దీంతో తాయి ప్రశాంత్‌కుమార్, సుభద్రను తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని లక్ష్మీనగర్‌కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో జీవనం కోసం చిన్న చిన్న పనులు చేస్తే వచ్చిన డబ్బులు సరిపోవడం లేదని బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట రాజాపూర్‌లో మూడు, రంగారెడ్డిగూడలో రెండు, జడ్చర్లలో ఒకటి, షాద్‌నగర్‌లో రెండు, హయత్‌నగర్‌లో ఒకటి, కొత్తూర్‌లో ఒకటి, మైలార్‌దేవ్‌పల్లిలో ఒక బైక్‌తోపాటు సూర్యాపేటలో ఒక ఆటోను చోరీ చేశాడు. దొంగతనం చేసిన వాహనాలు అన్నింటిని తీసుకువచ్చి లక్ష్మీనగర్‌కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో పెట్టుకున్నాడు. సోమవారం ఉదయం స్కూటీపై హైదరాబాద్ వెళ్తుండగా రాజాపూర్ పోలీసులు చేసిన వాహన తనిఖీల్లో పట్టుబడగా విచారిస్తే దొంగతనాలు బయటపడినట్లు ఎస్పీ తెలిపారు. అతని నుంచి మొత్తం 11 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇతను 2019లో సూర్యాపేటలో ఆటో దొంగతనం కేసులో జైలుశిక్ష అనుభవించినట్లు వెల్లడించారు. ప్రతి వాహనదారుడు వారికి సంబంధించిన వాహనాలకు జీపీఏ సిస్టంతోపాటు ఇంటి ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో 40 దొంగతనం కేసులు ఛేదించినట్లు వివరించారు. సమావేశంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీ లక్ష్మణ్, సీఐలు జమ్ములప్ప, ఇఫ్తేకార్, ఎస్ఐలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటి వరకు ఇదే అత్యధికం..రికార్డ్ స్థాయిలో వెహికల్స్ అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్‌లో వాహన అమ్మకాలు నవంబరులో 23,80,465 యూనిట్లు నమోదయ్యాయి. 2021 నవంబర్‌తో పోలిస్తే 26 శాతం అధికం. అంతేగాక భారత వాహన పరిశ్రమలో ఈ స్థాయి విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘బీఎస్–4 నుంచి బీఎస్–6 ప్రమాణాలకు మళ్లిన నేపథ్యంలో 2020 మార్చిలో జరిగిన అత్యధిక అమ్మకాలను మినహాయించాలి. పండుగల సీజన్ ముగిసినప్పటికీ పెళ్లిళ్ల కారణంగా గత నెలలో విక్రయాల జోరు కొనసాగింది. విభాగాలవారీగా ఇలా.. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ప్యాసింజర్ వెహికిల్స్ గత నెలలో 21 శాతం వృద్ధితో 3 లక్షల మార్కును దాటాయి. కార్ల లభ్యత, కొత్త మోడళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం ఈ వృద్ధికి కారణం. కాంపాక్ట్ ఎస్యూవీ, ఎస్‌యూవీల జోరు కొనసాగింది. టూ వీలర్లు 24 శాతం అధికమై 18,47,708 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 81 శాతం, ట్రాక్టర్లు 57 శాతం పెరిగాయి. వాణిజ్య వాహనాలు 33 శాతం దూసుకెళ్లి 79,369 యూనిట్లుగా ఉంది. మౌలిక రంగంపై ప్రభుత్వం దృష్టిసారించడం, కొత్త మైనింగ్ ప్రాజెక్టుల రాక, పాత వాహనాల స్థానంలో కొత్తవి చేరికతో కమర్షియల్ విభాగం మెరుగ్గా ఉంది. డిస్కౌంట్లు సైతం.. చాలా కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. మరోవైపు స్టాక్ క్లియర్ చేసుకోవడానికి బేసిక్ వేరియంట్లతోపాటు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. రెపో రేటు పెరగడంతో కస్టమర్లపై రుణ భారం పెరిగి ద్విచక్ర వాహనాలు, ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా లాక్డౌన్ కారణంగా సెమికండక్టర్ల సరఫరా మందగించే చాన్స్ ఉంది. ఇదే జరిగితే విక్రయాల స్పీడ్‌కు బ్రేకులు పడతాయి. తద్వారా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండదు’ అని ఫెడరేషన్ తెలిపింది. -
దుమ్ము లేపుతున్న ఈవీ అమ్మకాలు..ఏ కంపెనీ వెహికల్స్ ఎక్కువగా కొంటున్నారో తెలుసా?
పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. డీజిల్ రేట్లు దడపుట్టిస్తున్నాయి. కాలుష్యం కాటేస్తుంది. వాహనదారుల జేబుకు చిల్లు. వీటన్నింటికి ఒకటే సొల్యూషన్ అదిగదిగో ఎలక్ట్రిక్ వెహికల్. పొగుండదు. పొల్యూషన్ అస్సలు ఉండదు? పెట్రోల్, డీజిల్‌తో పనుండదు. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే. ఇదిగో..ఈ తరహా ధోరణి వాహనదారుల్లో పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఫెస్టివల్ సీజన్ ముగిసింది. అయినా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు ఏమాత్రం తగ్గడం లేదని, పండగ సీజన్లో కంటే ఆ తర్వాతే ఈవీ బైక్స్ అమ్మకాలు జోరందుకున్నాయని ఆ నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ‘వాహన్’ డేటా ప్రకారం..ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల కాలంలో దేశంలో 1,53,000 ఎలక్ట్రిక్ బైక్స్ అమ్ముడుపోయాయి. ఇదే కాలంలో గతేడాది కేవలం 43,000 వెహికల్స్ అమ్మకాలు జరిగినట్లు ఆ డేటా తెలిపింది. అమ్మకాల జోరు 2021 అక్టోబర్ నెలలో ఈవీ బైక్స్ 19,702 మాత్రమే కొనుగులో చేయగా..ఈ ఏడాది అక్టోబర్‌లో 77,000 యూనిట్లు సేల్ అయ్యాయి. ఇక, 2021 నవంబర్‌లో 23,099 వెహికల్స్ అమ్ముడుపోగా.. 2022 నవంబర్‌లో 76,150 వెహికల్స్‌ను కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఆటోమొబైల్ సంస్థలు దేశీయంగా ఏప్రిల్-నవంబర్లలో కలిపి 4.3 లక్షల యూనిట్ల సేల్స్ నిర్వహించగా..డిసెంబర్ నెలలో సైతం ఇదే జోరు కొనసాగుతుందని పరిశ్రమకు చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌లో ఈవీ బైక్స్ మార్కెట్ షేర్ ఎంత? వాహన్ నివేదికలో దేశీయంగా ఈవీ వెహికల్స్ తయారీ సంస్థలు జరిపిన అమ్మకాలు ఎంత శాతంగా ఉన్నాయో తెలిపింది. ఇందులో ప్రధానంగా ఒక్క నవంబర్‌లో ఓలా 21శాతం ఈవీ వెహికల్స్‌ను అమ్మగా, ఆంపియర్ 16 శాతం, ఓకినావా 12 శాతం, హీరో ఎలక్ట్రిక్ 12 శాతం , టీవీఎస్ 10.6 శాతం, ఎథేర్ 10 శాతం, బజాజ్ 4 శాతం, ఒకయా 2 శాతం అమ్మగా.. ఇతర సంస్థలు 12.4శాతం మేర విద్యుత్ వాహనాల్ని అమ్మినట్లు తేలింది. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
బైక్స్ కాదు...స్కూటర్లు దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతేడాది ఏప్రిల్-జూలైలో దేశవ్యాప్తంగా 9,77,986 స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 16,87,062 యూనిట్లు నమోదైంది. అంటే 72.5 శాతం అధికం. మోటార్‌సైకిళ్ల వృద్ధి 27 శాతానికే పరిమితమైంది. భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. తక్కువ బరువు, సులభంగా నడపడానికి వీలుండడం స్కూటర్ల ప్రత్యేకత. నగరాల్లో అయితే కిక్కిరిసిన ట్రాఫిక్‌లో గేర్‌లెస్ వాహనాలే నయం అన్న భావన ప్రజల్లో ఉంది. స్కూటర్ల డిజైన్, పనితీరు విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. బ్యాటరీతో నడిచే ఈ-స్కూటర్ల అమ్మకాలు క్రమంగా అధికం అవుతున్నాయి. జోరుగా వృద్ధి నమోదు.. కంపెనీనిబట్టి స్కూటర్ల అమ్మకాల్లో 15–437 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మోటార్‌సైకిళ్ల కంటే ఇదే అధికం. ఈ ఏడాది జూలైలో 49.79 శాతం వాటాతో స్కూటర్ల రంగంలో హోండా యాక్టివా రారాజుగా నిలిచింది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ ఎంటట్రీ ఇచ్చిన బజాజ్ ఆటో 9,261 యూనిట్లతో ఏకంగా 437.49 శాతం వృద్ధిని సాధించింది. ఇక 2021తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో హోండా మోటార్‌సైకిల్స్, స్కూటర్స్ ఇండియా 78.39 శాతం అధికంగా 8,12,086 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 108.14 శాతం వృద్ధితో 4,08,036 యూనిట్లు, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30.3 శాతం దూసుకెళ్లి 2,21,931 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 15.42 శాతం అధికమై 1,04,885 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 60.32 శాతం హెచ్చి 57,525 యూనిట్లను సాధించాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు సైతం.. క్రమంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఈ–టూవీలర్ల వాటా ఈ ఏడాది జనవరిలో 2.7 శాతం. జూన్ నాటికి ఇది 3.8 శాతానికి ఎగసింది. అన్ని కంపెనీలవి కలిపి జనవరిలో 27,590 యూనిట్లు రోడ్డెక్కితే, జూన్ నాటికి ఈ సంఖ్య 42,262 యూనిట్లకు చేరింది. జనవరి-జూన్‌లో దేశవ్యాప్తంగా 2,40,662 ఈ-టూవీలర్లు విక్రయం అయ్యాయి. హీరో మోటోకార్ప్ పెట్టుబడి చేసిన ఏథర్ ఎనర్జీ 2022 ఏప్రిల్-జూలైలో 219.48 శాతం వృద్ధిని సాధించింది 13,265 యూనిట్లను విక్రయించింది. ఓకినావా ఆటోటెక్ 259 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఓకినావా నుంచి 47,121 యూనిట్లు, హీరో ఎలక్ట్రిక్ 44,084, ఓలా 41,994, యాంపీర్ ఎలక్ట్రిక్ 33,785, ఏథర్ 15,952, ప్యూర్ ఈవీ 9,531, టీవీఎస్ 8,670, రివోల్ట్ 8,462, బజాజ్ 7,394 యూనిట్లు రోడ్డెక్కాయి. జోరుగా ఈ-స్కూటర్ల విక్రయాలు మోటార్‌సైకిళ్లు ఇలా.. భారత్‌లో 2021 ఏప్రిల్-జూలైలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 25,77,474 యూనిట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో ఈ సంఖ్య 27.07 శాతం వృద్ధితో 32,75,256 యూనిట్లుగా ఉంది. ఈ కాలంలో మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో బజాజ్ 5.53 శాతం, సుజుకీ 5.69 శాతం తిరోగమన వృద్ధి చెందాయి. హీరో 29.31 శాతం, హోండా 55.56, టీవీఎస్ 13.58, యమహా 67.19, రాయల్ ఎన్ఫీల్డ్ 41.81 శాతం వృద్ధి నమోదు చేశాయి. కాగా, 2021-22లో భారత్‌లో 1,34,66,412 యూనిట్ల ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2025 నాటికి టూవీలర్స్ పరిశ్రమ దేశంలో 2.49 కోట్ల యూనిట్లకు చేరుతుందని అంచనా. -
మృత్యువులోనూ వీడని బంధం
చిన్ననాటి నుంచి వారిద్దరూ మిత్రులు. ఏ పనైనా కలిసే చేసుకునేవారు. ‘స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం’ అనుకుంటూ సాగేవారు. వీరిని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వారి జీవితాలను విషాదాంతంగా ముగించింది. బాధిత కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గరుడంపల్లి సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో దర్శనమల ఫీల్డ్ అసిస్టెంట్ తలారి నరేంద్ర(24), అతని స్నేహితుడు అంకే రామాంజనేయులు(23) మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... దర్శనమలకు చెందిన నరేంద్ర, రామాంజనేయులు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇటీవలే రామాంజనేయులు తన వ్యవసాయ పొలంలో బోరు వేయించాడు. చీనీ మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. పొలంలోని మట్టిని అనంతపురంలోని ల్యాబ్‌లో పరీక్ష చేయించేందుకు శుక్రవారం మిత్రుడు నరేంద్రతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అక్కడ పని ముగిశాక మిత్రులిద్దరూ బైక్‌పై ధర్మవరం వైపు వస్తున్నారు. గరుడంపల్లి సమీపంలోకి రాగానే ఎస్కే యూనివర్సిటీలో పనిచేస్తున్న లక్ష్మీపతి ద్విచక్రవాహనంలో వేగంగా వచ్చి ఎదురుగా వీరి వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. సంఘటనా స్థలంలోనే ముగ్గురు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ నరేంద్ర, రామాంజనేయులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ద్విచక్ర వాహనదారుడు లక్ష్మీపతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్రకు భార్య ఇందు, కుమార్తె సంతానం. రామాంజనేయులుకు భార్య రమాదేవి, కుమారుడు ఉన్నారు. ధర్మవరం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో దర్శనమలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ మృతుల కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. (చదవండి: వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం.. చక్రం తిప్పిన పరిటాల బంధువు) -
ఆటో డిమాండ్‌కు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం షాక్!
న్యూఢిల్లీ: కీలక విడిభాగాల సరఫరాకు సంబంధించిన సవాళ్లు, వివిధ విభాగాల్లో డిమాండ్‌పరమైన (ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు) సమస్యలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వాహన రంగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో గానీ ఆటో పరిశ్రమ కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ (ఫాడా) మంగళవారం ఈ విషయాలు వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, చైనాలో లాక్డౌన్ వంటి అంశాల కారణంగా కీలకమైన విడిభాగాల సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని ఫాడా పేర్కొంది. ఫలితంగా దేశీ ఆటో పరిశ్రమ రికవరీపై ప్రభావం పడనున్నట్లు వివరించింది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపవచ్చని ఫాడా ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. ‘వివిధ సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కి మాత్రమే పరిమితం కావచ్చని భావిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద 2024 ఆర్థిక సంవత్సరంలో గానీ ఆటో పరిశ్రమ కోలుకుని, అమ్మకాలు తిరిగి కరోనా పూర్వ స్థాయికి చేరకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు గులాటీ చెప్పారు. 2020–21లో 1,52,74,314 వాహనాలు అమ్ముడవగా 2021–22లో 7.21 శాతం వృద్ధితో ఆటో విక్రయాలు 1,63,75,799కే పరిమితమయ్యాయి. చమురు ధరల సెగ.. ‘రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, చైనాలో లాక్డౌన్ వంటి ప్రతికూలతల కారణంగా దేశీ ఆటో పరిశ్రమకు సమీప భవిష్యత్తులో సవాళ్లు తప్పవు. క్రూడాయిల్ రేటు భారీగా పెరిగింది. ఇంధన ధరలు సుమారు రూ.10 వరకూ పెరిగాయి. ఇవి ఇంకా పెరుగుతాయి. ఫలితంగా సెంటిమెంటు దెబ్బతినవచ్చు‘ అని గులాటీ పేర్కొన్నారు. వాహనాల తయారీలో కీలకంగా ఉండే విలువైన లోహాలు, నియాన్ గ్యాస్ మొదలైనవి యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల నుంచే రావాల్సి ఉన్నందున ప్యాసింజర్ వాహనాల విభాగంపై ప్రభావం పడనుందని ఆయన చెప్పారు. సెమీకండక్టర్ల సరఫరా మరింత మందగించడం వల్ల ప్యాసింజర్ వాహనాల కోసం నిరీక్షించే సమయం ఇంకా పెరిగిపోవచ్చన్నారు. టూవీలర్లపై ప్రభావం .. ముడి వస్తువుల ధరలు పెరగడం వల్ల ఆటో కంపెనీలు తమ వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని గులాటీ చెప్పారు. ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో డిమాండ్ తగ్గకపోయినప్పటికీ .. రేట్లపరంగా చాలా సున్నితంగా ఉండే ద్విచక్ర వాహనాల విభాగంపై మాత్రం కచ్చితంగా ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పీవీల రిటైల్ విక్రయాలు 14.16 శాతం వృద్ధి చెందగా, టూవీలర్ల అమ్మకాలు 4 శాతమే పెరిగాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 45 శాతం, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 50 శాతం ఎగిశాయి. కోవిడ్ వల్ల 2020–21లో విక్రయాలు గణనీయంగా పడిపోయిన ప్రభావం (లో–బేస్ ఎఫెక్ట్) వల్లే 2021–22లో కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోందని గులాటీ వివరించారు. ఇక తాజాగా మార్చి నెలను తీసుకుంటే మాత్రం .. ఫాడా గణాంకాల ప్రకారం గత నెలలో ఆటోమొబైల్ అమ్మకాలు మొత్తం మీద 3 శాతం క్షీణిచాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గతేడాది మార్చితో పోలిస్తే సుమారు 5 శాతం తగ్గి 2,71,358 యూనిట్లకు పరిమితమయ్యాయి. టూవీలర్లు 4 శాతం క్షీణించి 11.57 లక్షలుగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో సవాళ్ల కారణంగా ద్విచక్ర వాహనాల విభాగం ఇప్పటికే ఒత్తిడి లో ఉండగా, ఇంధనాల రేట్లు పెరగడం.. వాహనాల ధరల పెరగడం వంటి కారణాలతో మరింత ప్రతికూల ప్రభావం పడిందని గులాటీ చెప్పారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందవచ్చని ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఎకనమీలో కరోనా కట్టడిపరమైన ఆంక్షల ఎత్తివేత, డిమాండ్ మెరుగుపడటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. సెమీకండక్టర్ల సరఫరా సంబంధించిన సవాళ్లు, రిటైల్ ఇంధన ధరల పెరుగుదల వంటి కారణాలతో అమ్మకాల పరిమాణంపై కొంత మేర ప్రభావం పడొచ్చని ఎక్యూట్ రేటింగ్స్ పేర్కొంది. సెమీకండక్టర్ల కొరతతో సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్, ఉత్పత్తి కోతలు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా పీవీ అమ్మకాలు సుమారు 15 శాతం పెరిగాయని వివరించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో లో–బేస్ ప్రభావం ఇందుకు కొంత కారణమని తెలిపింది. టూవీలర్ల డిమాండ్‌పై అనిశ్చితి .. కోవిడ్ విజృంభణ సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం వల్ల అసంఘటిత రంగం .. చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ఆ ప్రభావం టూవీలర్ల డిమాండ్‌పై గణనీయంగా కనిపిస్తోందని ఎక్యూట్ తెలిపింది. కోవిడ్ కట్టడిపరమైన ఆంక్షల ఎత్తివేత, వ్యవసాయ రంగ ఆదాయాలు మెరుగ్గా ఉండొచ్చన్న అంచనాలతో 2023 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ .. అది ఎప్పటికి జరుగుతుందనే దానిపై అనిశ్చితి నెలకొందని పేర్కొంది. ఇంధనాల ధరల పెరుగుదల దీనికి ఆజ్యం పోస్తోందని వివరించింది. మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ రహదారుల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుండటంతో వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ కొనసాగవచ్చని ఎక్యూట్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి చెప్పారు. 2021–22లో సీవీల అమ్మకాలు 25 శాతం వృద్ధి చెందాయి. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం, ఇన్ఫ్రాపై పెట్టుబడులు పెరగడం వంటి అంశాలతో ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో డిమాండ్ మెరుగుపడటం ఇందుకు కారణమని చౌదరి తెలిపారు. -
ఇండియాలో ఎక్కువ టూ వీలర్లు తయారవడానికి కారణమేంటో తెలుసా?
క్షణం తీరిక లేకుండా వ్యాపారాల్లో మునిగితేలుతున్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. స్పూర్తినిచ్చే కథనాలు, ఆసక్తి గొలిపే అంశాలను క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అయితే ఇన్నాళ్లు జోకులకు ఎన్నో మీమ్స్‌కి కారణమైన ఓ ఫోటోని ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఫన్నీగా కనిపించే ఆ ఫోటో వెనుక దాగున్న వ్యాపార కిటుకులను నెటిజన్లతో పంచుకున్నారు. మోపెడ్‌పై ప్రయాణిస్తున్న ఓ జంట ఫోటోను నెట్లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. అయితే ఈ ఫోటోలో ఆ మోపెడ్‌పై ఆ జంటకు తోడుగా పదుల సంఖ్యలో కూర్చీలు, చాపలు కూడా తీసుకెళ్తుంటారు. ఇంతకాలం ఇదే ఫోటోను అందరూ టిపికల్ ఇండియన్ మెంటాలిటీ అంటూ ఓ జోక్‌గా పరిగణించేవారు. కానీ ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్ర కంటికి ఈ ఫోటో మరోలా కనిపించింది. ఇండియాలోనే ఎక్కువ టూ వీలర్లు ఎందుకు తయారవుతాయో తెలుసా? ప్రతీ చదరపు ఇంచుకి ప్రపంచంలోనే అత్యధికంగా సరుకు రవాణా చేయగల సామర్థ్యం మన సొంతం. టూవీలర్లు మన దగ్గర అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ‘వీ ఆర్ లైక్ దట్ ఓన్లీ’ ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా చమత్కరించారు. Now you know why India makes the most two-wheelers in the world. We know how to carry the highest volume of cargo per square inch of wheel…We are like that only… #Sunday pic.twitter.com/3A0tHk6IoM — anand mahindra (@anandmahindra) April 3, 2022 -
ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్!
ద్విచక్ర వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం మరో కొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి బండి మీద 9 నెలల నుంచి 4 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు వారు కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. తాజాగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 9 నెలల నుంచి 4 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు కూడా ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో వారికి సరిపడే హెల్మెట్‌ను ధరించాలి. లేకపోతే రూ.1,000 జరిమానా లేదా డ్రైవర్ లైసెన్స్'ను మూడు నెలల వరకు సస్పెన్షన్ చేయనున్నారు. సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్, 1989కు సవరణ చేసి ఈ కొత్త నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది. నాలుగు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలను ద్విచక్ర వాహనం మీద తీసుకొని వెళ్తున్నప్పుడు వాహనం గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది అని కూడా పేర్కొంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు పిల్లల భద్రత దృష్ట్యా హార్నెస్, హెల్మెట్ ఉపయోగించడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ప్రతిపాదించింది. ఈ విషయంపై పౌరుల అభిప్రాయాన్ని అడగడానికి అక్టోబర్ 2021లో ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. .@MORTHIndia issues notification for safety measures for children below four years of age, riding or being carried on a motorcycle It specifies use of a safety harness and crash helmet and also restricts speed of such motorcycles to 40 kmphhttps://t.co/rAMr9lMCuc pic.twitter.com/4rnwcAxMVL — PIB India (@PIB_India) February 16, 2022 ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు వారి భద్రత కోసం ఈ మార్గదర్శకాలను తప్పక పాటించాలని మంత్రిత్వశాఖ పేర్కొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై పిల్లల్ని తీసుకువెళ్లాలంటే వారికి సేఫ్టీ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలి. అది కూడా చాలా తక్కువ బరువుతో వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. 30 కేజీల బరువును మోసే సామర్థ్యం దీనికి ఉండాలి. ఈ నియమాన్ని అతిక్రమిస్తే చలానా వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలానే పిల్లల హెల్మెట్ల విషయానికి వస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎస్) త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అప్పటివరకు సైకిల్ హెల్మెట్లను వినియోగించాలని ప్రభుత్వం తెలిపింది. (చదవండి: వారెవ్వా! అదిరిపోయిన ఎలన్ మస్క్ మార్స్ విజన్ వీడియో..!) -
నలుగురు బైక్ దొంగలు అరెస్ట్.. 12 బైక్‌లు స్వాధీనం!
పిడుగురాళ్ల: నలుగురు బైక్ దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ కె.ప్రభాకరరావు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని న్యూ ఖలీల్ దాబా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 12 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. పట్టణ పరిసరాల్లో 10 బైక్‌లు, నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామంలో ఒక్క బైక్, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మట్టపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బైక్ దొంగిలించారు. నిందితులైన మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన ఇస్లావత్ శ్రీనివాస నాయక్, మేఘవత్ నాగరాజునాయక్, పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మురుగు బాలు, దాసరి భవానీప్రసాద్‌ను కోర్టుకు పంపినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌ల విలువ సుమారు రూ.4.85 లక్షలు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ సమీర్‌బాషా, సిబ్బంది డి.వెంకటేశ్వర్లు, ఇమాంవలి పాల్గొన్నారు. చదవండి: అక్రమ మద్యంపై పోలీసుల ఉక్కు పాదం.. రూ.30 కోట్ల విలువ చేసే మద్యం సీజ్! -
ఎలక్ట్రిక్ వాహనాలకు స్టార్టప్‌ల జోరు..
న్యూఢిల్లీ: ఒకవైపు ఇంధనాల రేట్లు పెరుగుతుండటం మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండటం వంటి పరిణామాలు దేశీయంగా విద్యుత్ ద్విచక్ర వాహనాలకు కలిసి వస్తోంది. సరఫరాను మించి ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ నెలకొంటోంది. దీంతో ఈ విభాగంలోని స్టార్టప్ సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకునే పనిలో ఉన్నాయి. ఎథర్ ఎనర్జీ కొత్తగా రెండో ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇది వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4,00,000 యూనిట్లుగా ఉంటుంది. ఎథర్‌కు ఇప్పటికే 1,20,000 యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంలో హోసూరులో ఒక ప్లాంటు ఉంది. ఇది ఉత్పత్తి ప్రారంభించిన 10 నెలల్లోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సంస్థకు హీరో మోటోకార్ప్ తోడ్పాటు అందిస్తోంది. మరోవైపు, అనుకున్న స్థాయి కన్నా ప్రీ–బుకింగ్స్ వెల్లువెత్తడంతో కోయంబత్తూర్‌కు చెందిన బూమ్ మోటార్స్ సంస్థ.. కొత్తగా మరో ప్లాంటు ఏర్పాటు చేసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1,00,000 యూనిట్లుగా ఉండనుంది. అటు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈ మధ్యే తమిళనాడులోని రాణిపేట్‌లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటును ప్రారంభించింది. దీని వార్షిక ఉత్పత్తి సామర్త్యం 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ యూనిట్లుగా ఉంటుంది. ఇక ఈ రంగానికి సారథ్యం వహిస్తున్న హీరో ఎలక్ట్రిక్ వచ్చే ఐదేళ్ల పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 10 లక్షల యూనిట్లుగా పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. భారీగా ప్రీ–ఆర్డర్లు... గతేడాది నవంబర్ నుంచి అమ్మకాలు నెలవారీగా 20 శాతం పైగా వృద్ధి చెందుతున్నట్లు ఎథర్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో వాహనాల బుకింగ్స్ నాలుగు రెట్లు పెరిగినట్లు వివరించింది. అటు బూమ్ మోటార్స్ తమ ఎలక్ట్రిక్ బైక్ కార్బెట్ కోసం నవంబర్ 12న బుకింగ్స్ ప్రారంభించగా.. కేవలం 17 రోజుల్లోనే 36,000 పైచిలుకు ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. బంగ్లాదేశ్, నేపాల్, దక్షిణాఫ్రికా, టర్కీ వంటి దేశాల నుంచి కూడా సం స్థకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. సింపుల్ వన్ పేరిట టూవీలర్ ఆవిష్కరించిన.. సింపుల్ ఎనర్జీ అనే సంస్థ కూడా తమకు ప్రీ–బుకింగ్‌లో 30,000 పైచిలుకు ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపింది. భారీ పెట్టుబడులు.. డిమాండ్‌కు తగ్గట్లుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సరఫరా చేసేందుకు కంపెనీలు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎథర్ వచ్చే అయిదేళ్లలో రూ. 650 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ దాదాపు రూ. 700 కోట్లు ఈ–మొబిలిటీ విభాగంపై ఇన్వెస్ట్ చేస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దెకు ఇచ్చే స్టార్టప్ సంస్థ బౌన్స్ కూడా తయారీలోకి అడుగుపెడుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ, బ్యాటరీ మార్పిడి ఇన్ఫ్రా విస్తరించడంపై వచ్చే 12 నెలల్లో రూ. 742 కోట్లు పైగా వెచ్చించనున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో వివేకానంద హలెకెరె తెలిపారు. కంపెనీకి రాజస్తాన్‌లోని భివాడీలో 1,80,000 స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటు ఉంది. అటు గుజరాత్‌లోని వడోదరకు చెందిన వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ కూడా సొంత ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. అంచనాలు అప్... 2030 నాటికి మొత్తం దేశీయ టూ–వీలర్ మార్కెట్లో వీటి వాటా 30 శాతం పైగా చేరవచ్చని భావిస్తున్నట్లు నొమురా రీసెర్చ్ తెలిపింది. ఎథర్ ఎనర్జీ తదితర సంస్థలన్నీ ఉత్పత్తి సామర్థ్యాలను భారీగా పెంచుకునే పనిలో ఉండటం ఇందుకు నిదర్శనమని వివరించింది. చౌక రుణాలపై ఆర్బీఐ దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈవీల కొనుగోలు కోసం ప్రాధాన్యతా రంగం (పీఎస్ఎల్) కింద రుణాలు ఇవ్వాలంటూ నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోంది. ఒకవేళ దీనికి ఆమోదముద్ర లభిస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభించగలవు. ప్రస్తుతం ఆటో రిటైల్ విభాగానికి పీఎస్ఎల్ రుణాలు లభిస్తున్నాయి. అయితే, ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎదురయ్యే రిస్కుల విషయంలో స్పష్టత లేకపోవడంతో, వీటికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనుకాడుతున్నాయి. కాలుష్యకారక వాయువులను తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలకపాత్ర పోషించగలవని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐకి సదరు ప్రతిపాదన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పీఎస్ఎల్ కింద ఈవీలను చేర్చడం వల్ల వడ్డీ భారం తగ్గడమే కాకుండా మరింత మందికి రుణ సదుపాయం లభిస్తుందని కాంత్ వివరించారు. -
హైదరాబాద్: ఒక బైక్‌పై 88 చలాన్లు.. కంగుతిన్న పోలీసులు
సాక్షి,సుల్తాన్‌బజార్: ఓ ద్విచక్ర వాహనంపై 88 చలాన్లు పెండింగ్‌లో ఉన్న వ్యక్తి ఎట్టకేలకు సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బుధవారం సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు అఫ్జల్‌గంజ్‌లో వాహన తనిఖీలు చేస్తుండగా (టీ.ఎస్.11.1588) ఈ నెంబర్ గల ద్విచక్రవాహనం అబ్దుల్ రహా్మన్ అనే వ్యక్తిది. కాగా ఇతనిని పోలీసులు ఆపి తనిఖీ చేయగా ద్విచక్ర వాహనంపై 2019 నుంచి ఇప్పటి వరకు 28 చలాన్లు పెండింగ్‌లో ఉండటమే కాకుండా దానిపై రూ.28,110 వేలు చెల్లించాల్సి ఉంది. చదవండి: ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్ దీంతో కంగుతిన్న పోలీసులు వెంటనే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనంపై నెంబర్‌ప్లేట్స్ టాంపరింగ్ స్టిక్కర్స్ పెట్టడంలాంటి దానిపై మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం చీటింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్‌కుమార్ హెచ్చరించారు. చదవండి: ట్రాఫిక్ చలాన్ వేశారని బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం -
ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్ధేశించిన తదుపరి దశ ఉద్గార నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తే.. తయారీ కంపెనీలు వాహనాల ధరలను పెంచాల్సి వస్తుందని మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ స్పష్టం చేశారు.ఇదే జరిగితే అమ్మకాలు మరింత పడిపోతాయని,పరిశ్రమ ఇప్పటికే తీవ్ర మందగమనంలో కొట్టుమిట్టాడుతోందని గుర్తుచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ధరలు గణనీయంగా పెరగడంతో ప్రజలు కొత్త కార్లను కొనడం కష్టంగా ఉందని అన్నారు. ‘కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్ఈ) ప్రమాణాల అమలుకు ఇది సరైన సమయం కాదని నా అభిప్రాయం. పరిశ్రమ వృద్ధి సున్నా స్థాయికి వచ్చింది. కరోనా మహమ్మారి వేళ ప్రజల ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో కార్ల ధర ఇంకాస్త అధికమైతే పరిశ్రమ మరింత దిగజారుతుంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు కార్లను కొనే స్తోమత తగ్గింది’ అని పేర్కొన్నారు. బీఎస్–6 ఉద్గార నిబంధనలలో పొందుపరిచిన సీఏఎఫ్ఈ రెండవ దశ ప్రమాణాలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి. అమలు తేదీని 2024 ఏప్రిల్ 1 తేదీకి వాయిదా వేయాల్సిందిగా సియామ్ సైతం ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించింది. సీఏఎఫ్ఈ లక్ష్యాలను చేరుకోవడానికి వాహన సంస్థలు సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిందే. చదవండి: గుజరాత్లో జర్మన్ బ్యాంక్, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?! -
హీరో మోటోకార్ప్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ చార్జర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి హంగులు పొందుపరిచారు. 125 సీసీ బీఎస్–6 ఇంజన్‌తో తయారైంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ రూ.78,900, డిస్క్ బ్రేక్స్‌తో రూ.83,500 ఉంది. సాంకేతికత, శైలి, భద్రత కోరుకునే వినియోగదార్ల కోసం దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 2005లో హీరో గ్లామర్ భారత్‌లో రంగ ప్రవేశం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో దేశీయంగా కంపెనీ 10,24,507 యూనిట్ల మోటార్ సైకిల్స్, స్కూటర్స్‌ను విక్రయించింది. -
Ola Electric Vehicles : ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్ తయారీకి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీకి సంబంధించి భారీ ప్రణాళికలతో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ 100 మిలియన్ డాలర్ల (రూ.744 కోట్లు) దీర్ఘకాలిక రుణాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఓలా రూ.2,400 కోట్లతో మొదటి విడత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించింది. తాజాగా సమీకరించనున్న రుణాన్ని ఇందుకోసం వినియోగించనున్నట్టు తెలిపింది. తమిళనాడులో 500 ఎకరాల్లో ‘ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ పేరుతో ఓలా నిర్మిస్తున్న అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కేంద్రం త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ కేంద్రం ఏటా కోటి వాహనాలను తయారు చేసే సామర్థ్యంతో ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఓలా ఎలక్ట్రిక్ పరిగణిస్తోంది. ‘ఓలా, బ్యాంక్ ఆఫ్ బరోడా మధ్య కుదిరిన దీర్ఘకాల రుణ ఒప్పందం.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ ప్లాంట్‌ను రికార్డు సమయంలోనే ఏర్పాటు చేయాలన్న మా ప్రణాళికల పట్ల రుణ దాతల్లో నమ్మకానికి నిదర్శనం. ప్రపంచానికి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలన్న ప్రణాళికకు కట్టుబడ్డాం’ అని ఓలా చైర్మన్, గ్రూపు సీఈవో భవీష్ అగర్వాల్ పేర్కొన్నారు. చదవండి : వెయ్యి టన్నులా, బంగారం కొనుగోళ్లపై సెంట్రల్ బ్యాంక్‌ల ఫోకస్ -
రూ.6.80 లక్షల బైక్ లాంచ్ చేసిన హోండా
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) నేడు దేశంలో సిబి500 ఎక్స్‌ని రూ.6.87 లక్షల(ఎక్స్‌షోరూమ్, గురుగ్రామ్) ధరతో విడుదల చేసింది. ఈ మోడల్ కోసం కంపెనీ బుకింగ్ కూడా ప్రారంభించింది. ఈ కొత్త మోడల్ నీ కంపెనీకి చెందిన బిగ్‌వింగ్ డీలర్షిప్స్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించనున్నారు. ప్రయాణికులకు మరిచిపోలేని అనుభూతిని అందించేందుకు ఈ ప్రీమియం బైక్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అత్సుషి ఒగాటా ఓ ప్రకటనలో తెలిపారు. హోండా సీబీ 500ఎక్స్ లో ట్విన్ సిలిండర్ 471 సీసీ లిక్విడ్ కూల్ ఇంజిన్ అమర్చారు. ఈ ట్విన్-సిలిండర్ ఇంజన్ 47 బిహెచ్పి గరిష్ట శక్తిని, 43.2 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. డైమండ్ ఆకారంలో ఉన్న స్టీల్-ట్యూబ్ ఫ్రేమ్ ఆధారంగా కొత్త సిబి 500 ఎక్స్‌కు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో హోండా ప్రో-లింక్ మోనోషాక్ 9-స్టెప్ స్ప్రింగ్ ప్రీలోడ్ సస్పెన్షన్ లభిస్తుంది. ముందు భాగంలో 310 ఎంఎం డిస్క్ ఉండగా, వెనుక వైపు 240 ఎంఎం డిస్క్ ఉంది. డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ కూడా ఉంది. హోండా సిబి 500ఎక్స్‌లో ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్, నెగటివ్-డిస్ప్లే ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, అప్‌స్వీప్ట్ ఎగ్జాస్ట్, అసిస్ట్/స్లిప్పర్ క్లచ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఈ బైక్ గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాటీ గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్ రంగుల్లో లభించనుంది. చదవండి: మారుతి సుజుకి బంపర్ అఫర్ -
బంపర్ ఆఫర్ : రూపాయికే బైక్ బుక్
సాక్షి, ముంబై: కరోనా కాలంలో రవాణా సదుపాయాలు తగినంతగా లేక ఇబ్బందులు పడుతూ, ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికోసం ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. బ్యాంక్ కస్టమర్లుఫెడరల్ డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరోవైపు ఫెస్టివల్ ఆఫర్‌గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసినవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను సైతం బ్యాంక్ అందిస్తోంది. 3, 6, 9,12 నెలలకు ఈఎంఐను ఎంచుకునే అవకాశాన్ని ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంక్ కల్పిస్తోంది. ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అలాగే 7812900900 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. హోండా మోటార్ సైకిల్ షోరూమ్‌ల నుండి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి పండుగ ఆఫర్‌గా5 శాతం క్యాష్ బ్యాక ఆఫర్ కూడా ఉంది. 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 17 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. రానున్న పండుగ సీజన్, కరోనా మహమ్మారి ప్రోటోకాల్స్, కార్డ్‌ల ద్వారా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఈజీ ఫైనాన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లకు ప్రోత్సాహాన్నివ్వాలని భావిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. భారతదేశం అంతటా 36,000 దుకాణాలలో వినియోగదారుల డ్యూరబుల్స్ కొనుగోలు కోసం బ్యాంక్ డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. కాగా ఈకామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై కూడా ఇటీవలఈఎంఐ ఆఫర్ అందించడం ప్రారంభించింది. -
జీఎస్టీ తగ్గింపు!- ఆటో షేర్లు రయ్రయ్
ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గించాలంటూ ఆటో పరిశ్రమ చేస్తున్న వినతులను పరిశీలించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 28 శాతంగా అమలవుతోంది. ద్విచక్ర వాహనాలు.. అటు విలాసవంత(లగ్జరీ) కేటగిరీలోకి లేదా ఇటు డీమెరిట్లోకీ రావని సీతారామన్ వ్యాఖ్యానించారు. దీంతో జీఎస్టీ కౌన్సిల్ ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గింపునకు వీలుగా సవరణలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి హామీనిచ్చారు. పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సభ్యులతో నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాలను ప్రస్తావించారు. కాగా.. గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంకానున్నప్పటికీ సెప్టెంబర్ 17న నిర్వహించనున్న సమావేశంలో ద్విచక్ర వాహన పన్ను తగ్గింపును చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఆటో రంగ ఇండెక్స్ దాదాపు 2 శాతం ఎగసింది. షేర్లు జూమ్ ఆటో కౌంటర్లలో మొత్తం రుణ భారాన్ని తగ్గించుకోనున్న ప్రణాళికల నేపథ్యంలో టాటా మోటార్స్ 8 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో జీఎస్టీ రేట్ల తగ్గింపు అంచనాలతో హీరో మోటో, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, అపోలో టైర్ 6-3.3 శాతం మధ్య జంప్‌చేయగా.. బాలకృష్ణ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్, ఎంఆర్ఎఫ్ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. -
మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్టు
తిరుపతి క్రైం : మోటార్ సైకిళ్ల దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.11లక్షల విలువగల 17 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అవుల రమేష్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపిన వివరాలు..కొన్ని రోజులుగా తిరుపతి పరిసర ప్రాంతాలలో 17 మోటారు సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదుయ్యాయి. మోటార్ సైకిళ్ల దొంగల భరతం పట్టేందుకు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో లభించిన కొన్ని క్లూల ఆధారంగా మంగళవారం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే చోరీల బాగోతం బైటపడింది. మొత్తం ఆరుమంది సభ్యుల ముఠాగా ఏర్పడి మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడినట్లు తేలింది. దీంతో మిగిలిన నిందితులనూ అరెస్ట్ చేశా రు. వీరిలో మైనర్లు కూడా ఉండటం గమనార్హం! ప్రాథమిక విచారణలో తిరుపతి బొమ్ముగుంటకు చెందిన ఎస్.దేవేంద్ర కుమారుడు సాకే దినేష్ (18), అదే ప్రాంతానికి చెందిన రామ్మోహన్‌రెడ్డి కుమారుడు పురుషోత్తమరెడ్డి అలియాస్ బాబురెడ్డి (22), జీడీ నెల్లూరు మండలం ఆంబోధరపల్లెకు చెందిన చెందిన సోము కుమారుడు వంశీ(17), పి.సోము కుమారుడు చంద్ర(20), తిరుపతి మంగళం తిరుమల నగర్‌కు చెందిన స్వామి కుమారుడు బసవవంశీ(19), చిత్తూరులోని పలమనేరు రోడ్డులో నివాసముంటున్న పయణి కుమారుడు విక్రమ్ (17) అని తేలింది. వీరిని తిరుపతి వైకుంఠం ఆర్చి సమీపంలో ఎస్వీయూ పోలీ సు స్టేషన్ సీఐ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. కేసును ఛేదించిన సబ్ డివిజన్ పోలీసు అధికారి నరసప్ప, ఎస్వీ యూ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, ఎస్బీ టీమ్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రివార్డులు ప్రకటించారు. పలు స్టేషన్లలో కేసులు నిందితులపై కోడూరు, మదనపల్లె, రేణిగుంట, ఆర్సిపురం, తిరుచానూరు, తిరుపతి ఈస్టు పోలీసు స్టేషన్, ముత్యాలరెడ్డిపల్లె పోలీ సు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. మోటారు సైకిళ్లను పా ర్కింగ్ చేసిన ప్రతిచోట ముందు చక్రానికి లాక్ చేసుకోవాలని, మోటార్ మెకానిక్స్ కూడా తమ వద్దకు రిపేరు, సర్వీసు నిమిత్తం వచ్చే బైక్స్ తీసుకువచ్చే వారికి ఫ్రంట్‌వీల్ లాక్ వినియోగించేలా చెప్పాలని సూచించారు. తల్లిదండ్రులూ! పిల్లలపై ఓ కన్నేయండి మోటార్ సైకిళ్ల దొంగలు దురలవాట్లకు, విలాసాలకు అలవాటుపడి చోరీలు, నేరాలకు పాల్పడ్డారని, ఇది సమాజానికి మంచిది కాదని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్త వహించకపోతే భారీమూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. -
మీ బైక్ పాడయ్యిందా.. ఐతే ఇది చదవండి !
సనత్‌నగర్: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధుల ప్రభావమే కాదు.. బైక్ కష్టాలూ తప్పవు. నిత్యం మనల్ని గమ్యస్థానానికి చేర్చడంలో కీలకంగా నిలిచే ద్విచక్ర వాహనాలను పదిలంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా వర్షాకాలంలోబైక్లు మొరాయిస్తుండడం సహజం. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ కష్టాలను అధిగమించవచ్చంటున్నారు బైక్ మెకానిక్‌లు. ♦ వర్షాకాలంలో పవర్ ఫ్లగ్‌లు తరచూ పాడవుతుంటాయి. దీంతో ఎంతగా ప్రయత్నించినా∙బైక్ స్టార్ట్ కాదు. ♦ నిరంతరాయంగా కురిసే వర్షం కారణంగా కాయిల్స్ సామర్థ్యం తగ్గి కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ♦ ప్రయాణంలో మార్గమధ్యలో భారీగా వర్షం నీరు నిలిచినప్పుడు చాలామంది అందులో నుంచే వాహనాన్ని నడిపేస్తుంటారు. ఈ క్రమంలో వాహనం మునిగి ఇంజన్‌లోకి నీరు వెళ్ళి పాడయ్యే ప్రమాదం ఉంది. అలాగే సైలెన్సర్లోకి నీరు వెళ్ళడం గానీ, కొన్ని బైక్‌లకు సీటు కింద ఉండే ఫిల్టర్ బాక్స్‌లోకి నీరు వెళుతుంది. దీంతో బైక్ మొరాయిస్తుంది. ♦ వర్షాకాలంలో రోడ్లు కొట్టుకుపోయి కంకర తేలుతాయి. ఈ క్రమంలో కంకర తేలిన రోడ్లపై నీరు నిల్వ ఉంటాయి. అయితే టైర్ల సామర్ధ్యం సరిగా లేకుంటే రాళ్లు దిగి పంక్చర్‌కు అవకాశం ఉంటుంది. ♦ చాలామంది వాహనాలు సెల్లార్లలో గానీ, లోతట్టు ప్రాంతాల్లో గానీ పార్క్ చేస్తుంటారు. దీంతో భారీ వర్షం కురిసినప్పుడు ఆయా వాహనాలు కొట్టుకుపోవడమే కాకుండా ఇంజన్‌లోకి నీరు వెళ్ళి పాడైపోతుంటాయి. ♦ కూర్చొనే సీటు సరైన క్వాలిటీ లేనిపక్షంలో వర్షం పడిన సమయంలో సీటు వర్షంలో నానిపోయి త్వరగా పాడైపోతుంది. ♦ వర్షాకాలంలో బైక్ ఎక్కువ సేపు తడిస్తే ఆ చల్లదనానికి బ్యాటరీ పవర్ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో స్టార్టర్ నొక్కిన వెంటనే స్టార్ట్ అవ్వదు. బ్యాటరీ పవర్ డౌన్ అవడంతో హారన్, ఇండికేటర్స్ శబ్దాలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంటాయి. ♦ వర్షాకాలంలో కీస్ రంధ్రంలోకి నీరు చేరి అరిగిపోతుంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే... ♦ వర్షాకాలానికి ముందే కొత్త పవర్ ఫ్లగ్‌లు వేయించుకుంటే మేలు. ♦ ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తుండడం ద్వారా కాయిల్ వీక్ కాకుండా చూసుకోవచ్చు. ♦ రోడ్డుపై భారీగా వరదనీరు చేరినప్పుడు డైరెక్ట్‌గా వాహనం ఆన్‌లో ఉంచి వెళ్ళడం కంటే సైలెన్సర్‌కు, సీటు కింద ఉన్న ఫిల్టర్ బాక్స్‌లకు ఉన్న రంధ్రాలను వస్త్రంతో మూసివేసి నడిపించుకుని వెళ్ళడం ఉత్తమం. ఆ తరువాత వాటిని తీసేసి కిక్ కొడితే త్వరగా స్టార్ట్ అవుతుంది. ♦ వర్షాకాలంలో కంకర తేలిన రోడ్లపై రాళ్లు గుచ్చుకుని తరచూ పంక్చర్ పడే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు టైర్ల సామర్థ్యం ఉండేలా చూసుకోవాలి. ♦ కీస్ రంధ్రంలోకి నీరు చేరకుండా ఉండేలా కవర్ అయ్యేలా చూసుకోవాలి. ♦ సీటు నాని పాడవకుండా ఉండేలా క్వాలిటీ కవర్లను తొడిగితే మేలు. ♦ వర్షాకాలంలో లోతట్టు ప్రాంతం, సెల్లార్లలో కాకుండా సాధ్యమైనంతవరకు వాహనం మునగకుండా ఉండే చోట పార్క్ చేస్తే మేలు. తద్వారా ఇంజన్‌లోకి నీరు చేరకుండా ఉంటుంది. బ్యాటరీ సామర్ధ్యం కూడా తగ్గకుండా ఉంటుంది. వర్షాకాలంలో బైక్లకుఎక్కువ ముప్పు వర్షంలో సైతం రయ్‌మని దూసుకుపోతుంటారు. భారీగా నిలిచిన నీటిలో నుంచి కూడా బైక్‌లను నడిపేయడం వల్ల మునిగిపోయి ఇంజన్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. సాధ్యమైనంతవరకు బైక్ మునిగిపోతుందనుకుంటే సైలెన్సర్‌ను మూసివేసి నడిపించుకుని వెళ్ళాలి. వర్షాకాలంలో ప్రధానంగా పవర్ ఫ్లగ్‌లు తరచూ మొరాయిస్తుంటాయి. ముందస్తుగా కొత్తది వేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. లేదంటే మార్గమధ్యంలో ఆగిపోతే ఇబ్బందులు పడాల్సివస్తుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే బైక్‌లను పదిలంగా ఉంచుకోవచ్చు. – శ్రీను, బైక్ మెకానిక్ -
గడువు దాటిందా.. బండి గోవిందా!
ఆదిలాబాద్‌టౌన్: పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. బీఎస్–4 వాహనాల ద్వారా వాతావరణ కాలుష్యం అధికంగా ఉండడంతో వాటి స్థానంలో బీఎస్–6 వాహనాలను వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 2016లోనే నిర్ణయం తీసుకుంది. అయితే ఈనెల 31లోగా బీఎస్–4 వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలను స్క్రాప్‌గా పరిగణిస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకోని బీఎస్–4 వాహన దారుల్లో గుబులు మొదలైంది. గడువు దగ్గర పడడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారత్ స్టేజ్–6 (బీఎస్–6) వాహనాలను మాత్రమే ఆర్టీఏ కార్యాలయంలో నమోదు చేస్తారు. బీఎస్–4 వాహనాలను అనుమతించరు. జిల్లాలో రిజిస్ట్రేషన్ కాని వాహనాలు 3,684కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు ఇచ్చింది. సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలు తుక్కు కిందికి వస్తాయని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ద్విచక్రవాహనాలు 3,369 ఉండగా కార్లు, ఇతర వాహనాలు 315 ఉన్నాయి. మొత్తంగా 3,684 రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలుఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 2,348, ఇతర వాహనాలు 367, నిర్మల్ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 5,144, ఇతర వాహనాలు 640 ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ద్విచక్రవాహనాలు 4,395, ఇతర వాహనాలు 528 ఉన్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకోని బీఎస్–4 వాహనాలు 16,106 ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే స్క్రాపే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొనుగోలు చేసిన కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కొంత మంది వాహన దారులు యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లాలో ద్విచక్ర, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు ఉన్నాయి. అయితే బీఎస్–4 వాహనాల ద్వారా కాలుష్యం ఎక్కువగా ఉందని ప్రభుత్వం వీటి తయారీని నిలిపివేసింది. కొత్తగా బీఎస్–6 వాహనాలను తీసుకురానుంది. వీటి ద్వారా కాలుష్యం కొంత మేరకు తగ్గనుంది. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండలాల్లో రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల గడిచిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే సీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. జరిమానాలు కూడా విధించనున్నారు. రిజిస్ట్రేషన్ విషయంలో ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే పరిష్కరించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 99493 11051 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. బీఎస్–4 వాహనాలకు ఆఫర్లు.. ఆదిలాబాద్ జిల్లాలో ఆయా షోరూంలలో ఉన్న బీఎస్–4 వాహనాల అమ్మకాల కోసం డీలర్లు వినియోగదారులకు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈనెల 31 వరకు గడువు ఉండడంతో సేల్స్ చేసేందుకు వాహన ధరల్లో రూ. 10 వేల నుంచి రూ. 20వేల వరకు తగ్గించి విక్రయాలు జరుపుతున్నారు. వినియోగదారులు ఆ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 50 నుంచి 60 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. వీటి రిజిస్ట్రేషన్ల కోసం మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆలోగా బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ అవుతుందో లేదోననే ఆయోమయంలో కొందరు ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే సీజ్ చేస్తాం రిజిస్ట్రేషన్ చేసుకోని బీఎస్–4 వాహనాలు ఆదిలాబాద్ జిల్లాలో 3,684 ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు విధించింది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తుక్కు కిందికి అమ్ముకోవాల్సి ఉంటుంది. అలాంటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్ -
భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు జూలై నెలలో గణనీయంగా పడిపోయాయి. హీరో మోటోకార్ప్.. విక్రయాలు ఏకంగా 21.18% దిగజారి 5,35,810 యూనిట్లకు పరిమితమమ్యాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 27% తగ్గిపోయాయి. ఈ సంస్థ దేశీ విక్రయాలు 49,182 యూనిట్లు కాగా, బజాజ్ ఆటో అమ్మకాల్లో 13%, టీవీఎస్ మోటార్ విక్రయాల్లో 16% తగ్గుదల నమోదైంది. మరోవైపు టాటా మోటార్స్ అమ్మకాలు 34 శాతం తగ్గుదలతో 32,938 యూనిట్లుగా నయోదయ్యాయి. ఇక పూణేలో ఈ సంస్థ ఏడు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసింది. ఈ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో 300 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లలో వీటిని ప్రారంభించనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. రూ.1.58 లక్షలు తగ్గిన ‘కోనా’ ధర హ్యుందాయ్ తాజాగా విడుదలచేసిన తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘కోనా’ ధరను రూ.1.58 లక్షలు తగ్గించింది. దీంతో ఈ కారు ధర రూ.23.71 లక్షలకు తగ్గింది. జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీచేయడంలో భాగంగా ఈ మేరకు ధర తగ్గినట్లు కంపెనీ వివరించింది. మహీంద్రా కూడా ఈ–వెరిటో ధరను రూ.80 వేల వరకూ తగ్గించింది. -
బైక్‌ల దొంగ అరెస్టు
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట: పట్టణంలో ఆరుబయట పార్కు చేసిన ద్విచక్ర వాహనాల చోరీకి పాల్ప డుతున్న బాలుడిని అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్ఐ హరిబాబు సోమవారం చెప్పారు. ఆ యన కధనం ప్రకారం పట్టణానికి చెందిన బాలుడు కొంత కాలంగా ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నాడు. ఈ మేరకు ద్విచక్ర యజమానులు ఫిర్యాదు చేయటంతో కేసును విచారించి పట్ట ణానికి చెందిన బాలుడిగా గుర్తించారు. మ ధ్యాహ్న సమయంలో ముక్త్యాల రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రయ్.. రయ్.. దూసుకెళ్తాం
పెద్ద నగరాల యువతీయువకుల్లో 40 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థను వాడుకుంటున్నారు. చిన్న నగరాల్లో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. మొత్తంగా నగర యువతీయువకుల్లో అత్యధికులు సొంత వాహనాల కొనుగోలుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. యువ్‌గవ్ – మింట్ మిలినియల్ సర్వేలో తేలిన విషయాలివి. 1981 – 96 మధ్య పుట్టిన (22–37 వయోశ్రేణి ; మిలినియల్స్గా వ్యవహరిస్తారు) 1996 తర్వాత పుట్టిన (వీరిని జనరేషన్ జడ్ / జన్ జర్స్ అన్నారు) యువత ప్రయాణ తీరుతెన్నులపై ఈ సర్వేలో పరిశీలన జరిపారు. 180కి పైగా భారతీయ నగరాలపై జరిగిన ఈ ఆన్లైన్ అధ్యయనం ప్రకారం – ఢిల్లీ ఎన్సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం) ముంబయి, చెన్నయ్, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులు వాడుకుంటున్న వారి సంఖ్య ఎక్కువే.. సర్వే ప్రకారం – కోల్‌కతా (55శాతం) ముంబయి (52శాతం) నగరాల్లో అత్యధిక యువత ప్రజా రవాణా (లోకల్ రైళ్లు – మెట్రో రైళ్లు – బస్సులు – మినీ వ్యానులు)పై ఆధారపడుతోంది. చిన్న నగరాల్లో (ద్వితీయ – తృతీయ శ్రేణి నగరాలు) ఇలాంటి వారు 28 శాతమే. ఆరు ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లోని యువతీయువకుల్లో 46శాతం మంది టూ వీలర్లు వాడుతున్నారు. ఇక్కడ ప్రజా రవాణాపై ఆధారపడిన యువత 27 శాతమే. 15 శాతం మంది కార్లకు, మరో 12శాతం మంది క్యాబ్ సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద నగరాల్లోని సొంత వాహనదారుల్లో 25శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థనే వాడుకుంటున్నారు (చిన్న నగరాల్లో ఇలాంటి వారు 16శాతం మంది). మరో 7 శాతం మంది క్యాబుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. రూ.50,000కు పైగా ఆదాయం గడించే యువతీయువకుల్లో ఇంచుమించు 26 శాతం మంది, రూ. 20,000లోపు సంపాదించే వారిలో 39 శాతం ప్రజా రవాణా వైపు మొగ్గు చూపుతున్నారు. బండి కొనేస్తాం.. మొత్తంగా నగర యువతలో అత్యధికులు సొంత వాహనాల (కార్లు/టూ వీలర్లు) కొనుగోలుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రయాణానికి ప్రజా రవాణాయే మిన్న అంటున్న వారిలో పాతికశాతం మంది – ఏడాదిలోగా సొంత వాహనం కొనేస్తామంటున్నారు. 43శాతం మంది భవిష్యత్తులో ఏదో ఒక వాహనం కొనుగోలు చేయడం ఖాయమంటున్నారు. క్యాబ్ వాడుతున్న వారిలో 70 శాతం మంది బండి కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. సొంత బళ్లపై యువత ఆసక్తి ఇటీవల కాలంలో పెచ్చు పెరిగిందనడానికి ఈ ధోరణి ఓ ఉదాహరణ. సర్వే నిర్వాహకులు ఈ అంశానికి సంబంధించి.. ఇంచుమించు వెయ్యిమంది 38 – 53 వయస్కుల (జన్ ఎక్స్) అభిప్రాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికులు ఏడాది లోపో (43శాతం) ఆ తర్వాతో (45శాతం) బండి కొంటామని చెబుతున్నారు. సగటున 1 – 2 గంటల ప్రయాణం భారతీయ యువత ప్రతి రోజూ సగటున 91 నిమిషాల సమయాన్ని ప్రయాణంలో గడుపుతున్నట్టు సర్వే తెలిపింది. దలియా రీసెర్చ్ (వినియోగదార్లపై పరిశోధనలు జరిపే బెర్లిన్ సంస్థ) 2017లో జరిపిన సర్వే ప్రకారం – ఇతర దేశాల వారితో పోల్చుకుంటే మన దేశంలో ప్రయాణానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. చైనా (57నిమిషాలు) బ్రెజిల్ (77 నిమిషాలు) పాకిస్తాన్ (88 నిమిషాలు) వారి కంటే మన వాళ్ల ప్రయాణ సమయం ఎక్కువగా వుంటోంది. హైదరాబాద్‌లో.. గంటలోపు ప్రయాణాన్ని ముగించగలిగే అవకాశమున్నవారు 23 శాతమే. 34 శాతం మంది 1 – 2 గంటల సమయం వెచ్చించాల్సివస్తోంది. 18 శాతం మంది 2– 4 గంటల పాటు ప్రయాణించాల్సివస్తోంది. 13 శాతం మంది ప్రయాణ సమయం నాలుగు గంటలుదాటిపోతోంది. ఇక్కడ ప్రయాణాలకు దూరంగా వున్నవారు 12 శాతం మంది మాత్రమే. -
మూణ్నాళ్ల ముచ్చటేనా..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్) : ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లఘుచిత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినా హెల్మెట్ పెట్టుకుంటే బరువని, హేర్‌స్టైల్ చెదిరిపోతుందని భావిస్తూ చాలామంది దానిని ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పో తున్నారు. కుటుంబాలకు దూరమై తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. గతంలో హెల్మెట్ వినియోగం చాలా వరకు అమలు జరిగినా పోలీసులు, రవాణాశాఖ అధికారులు రానురాను కొంత పట్టించుకోకపోవడంతో అదికాస్తా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రత్యేక డ్రైవ్‌తో... గతంలో పోలీస్, రవాణాశాఖ అధికారులు సం యుక్తంగా హెల్మెట్ వినియోగాన్ని అమలు చేశా రు. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్ ధరించని వాహనదారులపై కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పోలీస్స్టేషన్లకు వస్తే హెల్మెట్ లేకుండా రావద్దని ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేశారు. దీంతో కొంత హెల్మెట్ వినియోగంలో వాహన చోదకులు బాధ్యతగా తీసుకున్నారు. హెల్మెట్‌ను విధిగా ఉపయోగించారు. ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ వినియోగం చాలా వరకు తగ్గిపోగా పోలీ సులు సైతం నామమాత్రంగా తీసుకుంటున్నారు. భారీ ఎత్తున జరిమానాలు... హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో నూతన రవాణ చట్టం అమలులోకి వచ్చింది. గతంలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టు పడితే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించే వారు. ఇక ఇప్పుడు భారీగా జరిమానా విధించైనా సరే హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నో హెల్మెట్–నో పెట్రోల్ నినాదం అమలు జరిపేలా చర్యలు తీసుకొనే విధంగా పోలీసులు చూస్తున్నారు. ఇక రవాణ శాఖాధికారులకు హెల్మెట్ లేకుండా పట్టుబడితే ఆ శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1వెయ్యితో పాటు హెల్మెట్ లేని కారణంగా మరో రూ. 100 మొత్తం కలిపి రూ.1,100 జరిమానా విధిస్తారు. అయితే ఇటీవల హెల్మెట్ వినియోగం తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇకపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈ క్రమంలో వాహన చోదకులు హెల్మెట్ రోజూవారీగా ధరించేలా చూస్తామని రవాణ శాఖ సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గడ్డం వివేకానంద్‌రెడ్డి అన్నారు. ప్రాణాలు కోల్పోతున్నా... రహదారి ప్రమాదాల్లో 70శాతం మంది ద్విచక్రవాహనదారులు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ మృత్యువాత పడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కిందపడి తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోయే సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. 2016లో 222 ద్విచక్ర వాహన ప్రమాదాలు జరగగా 160 మంది మృతి చెందారు. మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. 2017లో జరిగిన 236 ద్విచక్ర వాహనప్రమాదాల్లో 196 మంది మృతి చెందగా 145 మంది క్షతగాత్రులయ్యారు. ఇక 2018 మే నెల వరకు 95 ప్రమాదాలు జరగగా 80 మంది వరకు మృత్యువాత పడగా 50 మంది వరకు క్షతగాత్రులయ్యారు. కఠినంగా వ్యవహరిస్తాం... హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. జరిమానా తక్కువగా ఉండటం, తనిఖీల సమయాల్లో వాహనదారులు అప్రమత్తం కావడం వలన హెల్మెట్ వినియోగంపై నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. రవాణ చట్టాలను కఠినంగా అమలు చేసి హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేస్తాం. అవసరమైతే రవాణాశాఖా అధికారులతో కలిసి సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్ వినియోగం పెంచడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. –జి.సతీశ్, ట్రాఫిక్ సీఐ, మంచిర్యాల -
చిటికెలో బండి మాయం చేస్తారు..
పీఎంపాలెం (భీమిలి): రోడ్డుపై నిలిపిన ద్విచక్రవాహనాలు చోరీ చేయడంలో ఘనత వహిం చిన నలుగురు ఘరానా దొంగలను పీఎంపాలెం పోలీసులు అరెస్టు చేశా రు. వీరితోపాటు ఒక బాల నేరస్తుడ్ని, చోరీ సోత్తు కొనుగోలు చేసినందుకు ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ సీఐ కె. ఈశ్వరరావు తెలిపిన వివరాలు.. ఈ ప్రాంతంలో ఇటీవల పార్కింగ్ చేసిన ద్విక్రవాహనాలు చోరీకి సంబంధించి అధికంగా ఫిర్యాదులు అందడంతో నేరవిభాగం ఎస్ఐలు సూరిబాబు, అప్పారావు ప్రత్యేక దృష్టి సారించారు. ముందస్తు సమాచారం మేరకు బైకుల చోరీ ముఠాతో సంబంధం ఉన్న శివశక్తి నగర్‌కు చెందిన కళ్లేపల్లి రమేష్‌పై నిఘా వేసి శనివారం ఇక్కడి క్రికెట్ స్టేడియంకు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. శివవక్తినగర్ ప్రాంతానికే చెందిన రౌతు శ్రీనివాస్, డి.రవికుమార్, ఆర్ హెచ్ కాలనీకి చెందిన కాకర పోతురాజు, కొలకాని పవన్‌కుమార్‌లు ముఠాగా ఏర్పడి బైకులు విలువైన వస్తువుల చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వీరు చోరీ చేసిన ద్విచక్రవాహనాలు, విలువైన వస్తు సామగ్రికి సంబంధించి పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదు కాగా భీమిలి పోలీస్ స్టేషన్లో 3, ఆనందపురం పోలీస్ స్టేషన్లో 3 కేసులు, పద్మనాభం, విజయనగరం పోలీస్ స్టేషన్లలో ఒక్కొకటి నమోదయినట్టు గుర్తించారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన శివశక్తి నగర్‌కు చెందిన రాంబాబు, నారాయణమూర్తిలను సైతం అరెస్టు చేసి రిమాండుకు తరలించామని సీఐ తెలిపారు. 9 బైకులు స్వాధీనం నిందితుల వద్ద నుంచి వివిధ ప్రదేశాలలో చోరీ చేసిన సుమారు రూ. లక్ష విలువ చేసే 9 బైకులు స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ ఎస్ఐలు తెలిపారు. వీటితోపాటు వాటర్ పంపింగ్ చేసే 2 మో టార్లు, ఒక టీవీ, గ్రైండింగ్ మిషన్ మొదలైన విలువైన సామగ్రిని స్వాధీనపరచుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన క్రైమ్ విభాగం హెచ్‌సీ పైడిరాజు, పైడంనాయుడు, రాజేష్, అనిల్, బాలులను సీఐ అభినందించారు.