పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. డీజిల్ రేట్లు దడపుట్టిస్తున్నాయి. కాలుష్యం కాటేస్తుంది. వాహనదారుల జేబుకు చిల్లు. వీటన్నింటికి ఒకటే సొల్యూషన్ అదిగదిగో ఎలక్ట్రిక్ వెహికల్. పొగుండదు. పొల్యూషన్ అస్సలు ఉండదు? పెట్రోల్, డీజిల్‌తో పనుండదు. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే.
ఇదిగో..ఈ తరహా ధోరణి వాహనదారుల్లో పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఫెస్టివల్ సీజన్ ముగిసింది. అయినా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు ఏమాత్రం తగ్గడం లేదని, పండగ సీజన్‌లో కంటే ఆ తర్వాతే ఈవీ బైక్స్ అమ్మకాలు జోరందుకున్నాయని ఆ నివేదికలు చెబుతున్నాయి.
కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ‘వాహన్’ డేటా ప్రకారం..ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల కాలంలో దేశంలో 1,53,000 ఎలక్ట్రిక్ బైక్స్ అమ్ముడుపోయాయి. ఇదే కాలంలో గతేడాది కేవలం 43,000 వెహికల్స్ అమ్మకాలు జరిగినట్లు ఆ డేటా తెలిపింది.
అమ్మకాల జోరు
2021 అక్టోబర్ నెలలో ఈవీ బైక్స్ 19,702 మాత్రమే కొనుగులో చేయగా..ఈ ఏడాది అక్టోబర్‌లో 77,000 యూనిట్లు సేల్ అయ్యాయి. ఇక, 2021 నవంబర్‌లో 23,099 వెహికల్స్ అమ్ముడుపోగా.. 2022 నవంబర్‌లో 76,150 వెహికల్స్‌ను కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఆటోమొబైల్ సంస్థలు దేశీయంగా ఏప్రిల్-నవంబర్‌లలో కలిపి 4.3 లక్షల యూనిట్ల సేల్స్ నిర్వహించగా..డిసెంబర్ నెలలో సైతం ఇదే జోరు కొనసాగుతుందని పరిశ్రమకు చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్‌లో ఈవీ బైక్స్ మార్కెట్ షేర్ ఎంత?
వాహన్ నివేదికలో దేశీయంగా ఈవీ వెహికల్స్ తయారీ సంస్థలు జరిపిన అమ్మకాలు ఎంత శాతంగా ఉన్నాయో తెలిపింది. ఇందులో ప్రధానంగా ఒక్క నవంబర్‌లో ఓలా 21శాతం ఈవీ వెహికల్స్‌ను అమ్మగా, ఆంపియర్ 16 శాతం, ఓకినావా 12 శాతం, హీరో ఎలక్ట్రిక్ 12 శాతం , టీవీఎస్ 10.6 శాతం, ఎథేర్ 10 శాతం, బజాజ్ 4 శాతం, ఒకయా 2 శాతం అమ్మగా.. ఇతర సంస్థలు 12.4శాతం మేర విద్యుత్ వాహనాల్ని అమ్మినట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment