ఒక శాతం మేర పెరిగే అవకాశం
రూ.10 లక్షల కంటే ఖరీదైన కార్లకూ వడ్డింపు
రవాణాశాఖ ఆదాయం పెంపు లక్ష్యంగా కసరత్తు
9న బడ్జెట్ టాస్క్‌ఫోర్స్ భేటీలో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: వాహనాల పన్నులను సవరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటం.. నిధుల అవసరం అధికంగా ఉండటంతో వీలైనంతమేర ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ప్రభుత్వం రవాణాశాఖపై దృష్టి సారించింది. ఇదివరకే ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి.. దాని ఆదాయ, వ్యయాల వివరాలపై ఆరా తీశారు. ఇప్పుడు బడ్జెట్ రూపొందించే క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్సు కమిటీ దీనిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 9న సమావేశమవుతోంది. ఇందులో వాహనాలకు సంబంధించిన వివిధ రకాల పన్నులను ఏ విధంగా హేతుబద్ధీకరించవచ్చో చర్చించనుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలకు జీవిత పన్ను 9 శాతంగా ఉంది. దీన్ని 10 శాతానికి పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.
అలాగే.. రూ.10 లక్షల కంటే ఖరీదైన విలాసవంతమైన వాహనాలపై ఉన్న 14 శాతం పన్నును పెంచే అంశంపై కూడా ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. విలాసవంతమైన కార్లను ధనికులే వాడుతున్నందున ఆ పెంపు ఒకశాతానికే పరిమితం కాకున్నా ఇబ్బంది ఉండదనే కోణంలో చర్చ జరగనున్నట్టు సమాచారం. వెరసి ఈ పన్ను ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కంపెనీలు, సంస్థలు వాటి పేరుతో కొనే ఖరీదైన వాహనాలైపై విధించే పన్నును కూడా పెంచాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
రవాణా శాఖ ఆదాయం లక్ష్యం
రూ. 2,200 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రవాణా శాఖ ఆదాయాన్ని రూ.2,200 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ నుంచి గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వానికి రూ.3,300 కోట్లు దాఖలయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం తాజా లక్ష్యాన్ని నిర్ధారించింది.
ద్విచక్ర వాహనాల జీవితపన్ను పెంపు!
Published Sun, Sep 7 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement
Advertisement