life tax
-
ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నా రాయితీ
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి కొనుగోలు చేసే ప్రతీ ఎలక్ట్రిక్ వాహనానికి రాయితీ వర్తించనుంది. రిజిస్ట్రేషన్ చార్జీలు, లైఫ్ ట్యాక్స్ సహా అన్ని రకాల పన్నులు చెల్లించాల్సిన పని ఉండదు. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహన పాలసీని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అమలులోకి తెచ్చింది. తక్కువ వాహనాలే ఉంటాయన్న ఉద్దేశంతో.. కొనుగోలు చేసే తొలి 5 వేల కార్లకు, ద్విచక్ర వాహనాల్లో తొలి 2 లక్షల వాహనాలకు.. ఇలా అన్ని కేటగిరీలు కలిపి దాదాపు 2.25 లక్షల వాహనాలకు ఆ రాయితీలను పరిమితం చేశారు. వాటిల్లో దాదాపు 1.60 లక్షల వాహనాలు భర్తీ అయ్యాయి. కార్లలో 5 వేల పరిమితి దాటి పోయింది. కొత్తగా కార్లు కొనేవారికి రాయితీలు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆ విధానాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాహనాల సంఖ్యతో ప్రమేయం లేకుండా.. ఎన్ని వాహనాలు కొన్నా, రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రకటిస్తూ జీఓ నెం.41 జారీ చేసింది. అపరిమిత రాయితీ.. గతంలో ఉన్న రాయితీ విధానాన్ని య«థావిధిగా కొనసాగిస్తూనే, రాయితీ పొందే వాహనాల సంఖ్యపై సీలింగ్ ఎత్తేసింది. ఇక నుంచి ఎంతమంది, ఎన్ని వాహనాలు కొన్నా పూర్తి రాయితీ వర్తించేలా పాలసీలో మార్పులు చేసింది. అయితే బస్సుల వరకు వచ్చే సరికి కొన్ని పరిమితులు విధించింది. ఆర్టీసీ బస్సులు, ఉద్యోగులను ఉచితంగా తరలించేందుకు వినియోగించే ప్రైవేట్ కంపెనీల బస్సులకు మాత్రం పూర్తి రాయితీలు వర్తిస్తాయి. పర్మిట్లతో నడిచే టూరిస్టు, ట్రావెల్స్ బస్సులు, విద్యార్థులను తరలించే విద్యా సంస్థల బస్సులకు ఈ రాయితీలు వర్తించవని స్పష్టం చేసింది. 2026 డిసెంబరు 31 వరకు వర్తింపు గత ప్రభుత్వం వాహనాల సంఖ్యపై సీలింగ్ విధిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కాలపరిమితిని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త విధానం ఈ సంవత్సరం నవంబరు 18 నుంచి 2026 డిసెంబరు 31 వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. గడువు తీరిన తర్వాత మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించింది. అప్పుడు రూ.473 కోట్లు.. ఇప్పుడు ఎంతో? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అందుబాటులోకి తెచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం పది వేల ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు 1.61 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. కొత్తగా కొన్న వాహనాలకు (సీలింగ్ లోపు ఉన్న వాహనాలు) వర్తించిన రాయితీ మొత్తం రూ.473 కోట్లు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు భారీగా పెరిగింది. అన్ని కేటగిరీ వాహనాలు కలిపి నిత్యం 15 వరకు అమ్ముడవుతున్నాయి. వీటిల్లో ఐదారు కార్లు ఉంటున్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాయితీ రూపంలో వాహన దారులకు కలిగే లబ్ధి విలువ భారీగానే ఉండనుంది. ఈ లెక్కన గతంతో పోలిస్తే రాయితీల మొత్తం మూడురెట్లు పెరుగుతుందని అంచనా. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం వినియోగంతో సంవత్సరానికి రూ. లక్ష వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది (కేటగిరీ ఆధారంగా కాస్త అటూ ఇటుగా). ఆ వాహనదారుల సంగతేంటి..? గత ప్రభుత్వ విధానం ప్రకారం కొన్ని కేటగిరీల వాహనాలకు సంబంధించి సంఖ్యాపరంగా ఉన్న పరిమితి దాటిపోయింది. ఆ తర్వాత కొన్న వాహనాలకు రాయితీ రావటం లేదు. అన్నింటికి రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించినందున, తమను వాటిల్లో భాగంగా పరిగణించాలంటూ యజమానులు కోరుతూ రవాణాశాఖ కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. కానీ, కొత్త విధానం సోమవారం నుంచి అమలులోకి వస్తున్నందున, రాయితీ ఇవ్వలేమంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించి, రాయితీ తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.ఎలక్ట్రిక్ వాహనాలు కొనేలా చైతన్యం తెస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని, ఈ దిశలో ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన విధానంలో చేసిన మార్పులను ఆయన ఆదివారం సచివాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యపై సీలింగ్ విధించటంతో కొత్తగా ఆ వాహనాలు కొనేవారికి రాయితీలు రావటం లేదని, అందుకే తాము వాటి సంఖ్యపై ఉన్న పరిమితిని తొలగించామ న్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలు సామాజిక బా ధ్యతగా భావించి, ప్రైవేట్‌గా చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యా సంస్థల బస్సులకు రాయితీ వర్తింపు విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. -
నికర ఇన్వాయిస్ ధరను బట్టే లైఫ్ ట్యాక్స్
సాక్షి, అమరావతి: మోటారు కార్ల కొనుగోలు సమయంలో విధించే జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్).. వాహన నికర ఇన్వాయిస్ ధర (పన్నులు కలపక ముందు నిర్ణయించిన ధర) ఆధారంగానే ఉండాలని హైకోర్టు తెలిపింది. అంతేకానీ.. వాహన ఎక్స్ షోరూమ్ ధర (పన్నులన్నీ కలిపి నిర్ణయించిన ధర) ఆధారంగా కాదని స్పష్టం చేసింది. ఏపీ మోటారు వాహనాల ట్యాక్సేషన్ చట్టంలోని 6వ షెడ్యూల్ ప్రకారం లైఫ్ ట్యాక్స్‌ను వాహన ధర ఆధారంగానే వసూలు చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఇద్దరు వాహనదారుల నుంచి అధికంగా వసూలు చేసిన లైఫ్ ట్యాక్స్ మొత్తాన్ని నాలుగు వారాల్లో వారికి వాపసు ఇవ్వాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ వెన్యూ కారుకు వాహన ధర మీద కాకుండా నికర ఇన్వాయిస్ ధర మీద 14 శాతం పన్నును చట్టవిరుద్ధంగా వసూలు చేశారని విజయవాడకు చెందిన తలశిల సౌజన్య 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.52,168 తిరిగి వాపసు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని విన్నవించారు. అలాగే ఇదే రీతిలో తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.1.16 లక్షలను వాపసు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజయవాడకు చెందిన వల్లూరు పవన్ చంద్ 2021లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ సుజాత ఇటీవల తుది విచారణ జరిపారు. వాహన ధరపైనే లైఫ్ ట్యాక్స్.. రవాణా శాఖ తరఫు న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. లైఫ్ ట్యాక్స్‌ను వాహన ధరపైనే నిర్ణయిస్తారన్నారు. వాహన ధర అంటే డీలర్‌కు వాహన కొనుగోలుదారు చెల్లించే మొత్తమని.. ఇందులో జీఎస్టీ, సెస్ వంటివి కలిపి ఉంటాయని తెలిపారు. అందువల్ల పన్నులు కలిపిన మొత్తం మీదనే లైఫ్ ట్యాక్స్ విధించామన్నారు. ఇలా చేయడం ఎంత మాత్రం చట్టవిరుద్ధం కాదన్నారు. అంతేకాకుండా 1994లో రవాణా శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం వాహన ధర అంటే అన్ని పన్నులతో కలిపి చెల్లించే మొత్తమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల తరఫు న్యాయవాది చక్రవర్తి వాదనలతో ఏకీభవించారు. లైఫ్ ట్యాక్స్‌ను వాహన నికర ఇన్వాయిస్ ధర ఆధారంగానే వసూలు చేయాలని తేల్చిచెప్పారు. ఎక్స్‌షోరూం ధర వాహన ధర కాదు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎమ్మార్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ.. వాహన ధర అంటే వాహనదారు డీలర్‌కు చెల్లించే మొత్తమన్నారు. ఈ ధర ఆధారంగానే డీలర్.. వాహనదారుకు వాహనాన్ని బదలాయిస్తారని తెలిపారు. అంతేతప్ప పన్నులన్నింటితో కలిపి చెల్లించే ఎక్స్ షోరూం ధర ఎంతమాత్రం వాహన ధర కాదన్నారు. హ్యుందాయ్ వెన్యూ ఇన్వాయిస్ ధర రూ.8,60,853 అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ.10 లక్షలకన్నా తక్కువ విలువ చేసే వాహనానికి 12 శాతం మాత్రమే లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని ప్రకారం రూ.8.60 లక్షలకు 12 శాతం లెక్కన రూ.1,03,302 లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుందని నివేదించారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్స్‌షోరూం ధరను రూ.11,10,500గా పేర్కొంటూ.. వాహన ధర రూ.10 లక్షలకు మించింది కాబట్టి 14 శాతం పన్ను చెల్లించాలని పిటిషనర్‌తో బలవంతంగా రూ.1,55,470ను లైఫ్ ట్యాక్గా కట్టించుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. తద్వారా రూ.52168 అదనంగా వసూలు చేశారన్నారు. అలాగే రెండో పిటిషనర్ వల్లూరు పవన్ చంద్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారు విషయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. ఇన్వాయిస్ ధరపై కాకుండా ఎక్స్‌షోరూమ్ ధరపై 14 శాతం పన్ను వసూలు చేశారని తెలిపారు. ఇలా పవన్ చంద్ నుంచి రూ.1.16 లక్షలు అదనంగా పన్ను కట్టించుకున్నారని వివరించారు. -
మోటారు వాహనాల చట్ట సవరణ అమలులోకి.. పెరగనున్న లైఫ్ టాక్స్
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి వాహనాల ఎక్స్‌షోరూమ్ ధరల మీదనే జీవిత పన్ను విధిస్తారు. ఇంతకాలం వాహనం కొనుగోలుపై షోరూమ్ నిర్వాహకులు ఇచ్చే డిస్కౌంట్ పోను, మిగతా మొత్తం మీద మాత్రమే పన్ను విధించేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్ట సవరణ ఇప్పుడు అమలులోకి వచ్చింది. చట్ట సవరణ బిల్లుకు గత నెల చివరలో గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టం అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్ విడదుల చేసి, అమలు ప్రారంభించింది. మార్చికి ముందు కారుకొన్నా.. ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే కొత్త విధానమే.. చట్ట సవరణ నేపథ్యంలో అమలుపై రవాణాశాఖ స్పష్టతనిచ్చింది. కారు ఏప్రిల్‌కు ముందు కొన్నా, రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరిగితే, కొత్త విధానమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం అమలులోకి రావటానికి ముందు గత నెలలో కార్లు కొన్నవాళ్లు చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కారు కొన్నందున తమకు కొత్త విధానం వర్తించదన్న ధీమాతో ఉన్నారు. కానీ, కారు ఎప్పుడు కొన్నా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్త విధానమే వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పెరగనున్న పన్ను.. ధర ఎక్కువ కార్లపైనే ఈ కొత్త విధానం ప్రభావం ఉండనుంది. కారు కొన్నప్పుడు ఎక్స్‌షోరూం ధరపైన షోరూం నిర్వాహకులు డిస్కౌంట్ ఇవ్వటం సహజమే. ధర ఎక్కువగా ఉండే కార్లపై ఈ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్కౌంట్‌ను సాకుగా చూపి చాలామంది కొంతమేర పన్ను ఎగవేస్తున్నారు. ఇప్పుడు దానికి అవకాశం లేదు. రూ.5 లక్షల ధర ఉన్న కార్లపై 13 శాతం, రూ.5 లక్షలు దాటి రూ.10 లక్షల లోపు ఉండే కార్లపై 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే కార్లపై 17 శాతం, రూ.20 లక్షలకంటే ఎక్కువ ధర ఉండే కార్లపై 18 శాతం చొప్పున జీవిత పన్నును సవరిస్తూ గతేడాది రవాణాశాఖ ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా సవరణ ప్రకారం.. డిస్కౌంట్ మొత్తం మినహాయించక ముందు ఉండే ఎక్స్‌షోరూం ధరలపై పైన పేర్కొన్న నిర్ధారిత శాతంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థలు, కంపెనీల పేరుతో ఉండే కార్లపై అదనంగా రెండు శాతం, రెండో కారు తీసుకునేవారు అదనంగా 2 శాతం చెల్లించాల్సి ఉంటుంది. -
రవాణాశాఖ వింత వ్యవహారం .. కామ్‌గా కట్టించేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: బస్సు చార్జీలు పెంచినప్పుడు ఆర్టీసీ అధికారులు బహిరంగంగానే వెల్లడించారు.. కరెంటు చార్జీలు పెరిగితే అధికారులు ముందే చెప్పారు.. కానీ వాహనాలకు సంబంధించి జీవిత కాల పన్ను, హరిత పన్నులు పెంచిన రవాణా శాఖ ఒక్కమాట కూడా బహిరంగంగా చెప్పలేదు. ఏయే చార్జీలు ఏ మేరకు, ఎప్పటి నుంచి పెరుగుతున్నాయన్నది అధికారులెవరూ చెప్పలేదు. కానీ పన్ను చెల్లించే సమయంలో భారీ చార్జీలు చూసి జనం నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. రూ.12 లక్షల విలువైన వాహ నాన్ని కొంటే.. వారం కిందటి వరకు రూ.1,68,000 (14 శాతం) జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్) చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది రూ.2,04,000కు (17శాతానికి) పెరిగింది. ఇంత ప్రభావం చూపే మార్పు జరిగితే ఎక్కడా రవాణా శాఖ నుంచి జనానికి తెలియజేసే అధికారిక ప్రకటన వెలువడలేదు. గత ఆర్థిక సంవత్సరం జీవితకాల పన్ను రూపంలో రూ.2,900 కోట్ల ఆదాయాన్ని పొందింది. తాజా ఉత్తర్వులతో అదనంగా మరో రూ.1,400 కోట్లమేర ఆదాయం లభిస్తుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిట్నెస్ పంచాయితీ.. రవాణా వాహనాలు ఏడాదికోసారి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్ష చేయించి సర్టిఫికెట్ పొందాలి. ఇలా ఫిట్నెస్ పరీక్షలు చేయించకుండా తిరిగే ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధించాలి. కేంద్రం ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర రవాణా శాఖ మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఫిట్నెస్ చేయించటం ఆపేశారో.. అప్పటి నుంచీ లెక్కగట్టి పెనాల్టీలు వసూలు చేస్తోంది. ► హైదరాబాద్‌కు చెందిన అష్రాఫ్ అనే ఆటోడ్రైవర్ ఏడేళ్లుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఆటో నడుపుతున్నాడు. కొత్త నిర్ణయం రావటంతో పెనాల్టీలు కట్టే బాధ ఉండొద్దని ఫిట్నెస్ పరీక్ష కోసం వెళ్లాడు. ఏడేళ్ల నుంచి రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ కలిపి మొత్తంగా రూ.1.13 లక్షలు కట్టాలని అధికారులు చెప్పారు. దీనితో బెంబేలెత్తిన అష్రాఫ్ ఆటోను తీసుకెళ్లి ఇంట్లో పెట్టేశాడు. ఆటో నడిపితేనే రోజు గడిచే ఆయన.. ఇప్పుడు దానిని బయటికి తీయట్లేదు. ఇలా 75వేల ఆటోలు పాత బకాయిల పేరిట భారీ పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని.. దీనితో దాదాపు 40వేల మంది డ్రైవర్లు ఆటోలను బయటికి తీయడం మానేశారని యూనియన్ నేతలు చెప్తున్నారు. ఇదే తరహాలో దాదాపు 4 వేల టాటా ఏస్ మినీ ట్రక్లు, మరో 2 వేల వరకు డీసీఎం వాహనాలు, చిన్న లారీలు ఇలాగే మూలకు చేరాయని అంటున్నారు. ఆటో అమ్ముకోలేక, కొత్తది కొనలేక ఇబ్బందిపడుతున్నారు. ఫీజులు పెంచిన తర్వాత నాలుగు రోజుల క్రితం ఓ లారీకి వచ్చిన పన్ను మొత్తం రూ.13,920 కాలుష్యం పేరిట... వాహనాలు పాతబడే కొద్దీ కాలుష్యం పెరుగుతుందన్న ఉద్దేశంతో వాటి వాడకాన్ని తగ్గించడానికి హరితపన్ను (గ్రీన్ ట్యాక్స్) విధిస్తున్నారు. రవాణాశాఖ ఇటీవలే హరితపన్నును పెంచింది. దీనినీ మూడు శ్లాబులు చేసింది. ఈ విషయాన్నీ బయటికి వెల్లడించలేదు. ఏ శ్లాబుకు ఎంత పన్ను చెల్లించాలో వాహన యజమానులకు తెలియదు. రవాణాశాఖ కార్యాలయంలో వివరాలన్నీ నమోదుచేశాక వచ్చే పన్నుమొత్తం చూసి బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ► పాత రేట్ల ప్రకారం ఓ లారీకి గ్రీన్‌టాక్స్ రూ.238 మాత్రమే ఉండేది. అదనంగా ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ► గతంలో ద్విచక్ర వాహనానికి గ్రీన్‌ట్యాక్స్ రూ.285, ప్రభుత్వ ఫీజు రూ.735 ఉండగా.. ఫీజులు పెంచాక గ్రీన్‌ట్యాక్స్ రూ.2,035, ప్రభుత్వ ఫీజు రూ.1,400గా మారింది. ► కార్లకు సంబంధించి గ్రీన్‌ట్యాక్స్ రూ.535, ప్రభుత్వ ఫీజు రూ.1,200 ఉండేది. ఇప్పుడు ట్యాక్స్ రూ.5035, ఫీజు రూ.1,500 అయింది. ఆదాయం కోసం దొడ్డిదారిన పన్ను పెంచారు గ్రీన్‌ట్యాక్స్ పెంచినంత మాత్రాన వాతావరణంలో కాలుష్యం తగ్గుతుందా..? ఇదేం విడ్డూరం. కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలను సీజ్ చేయండి, లేదా మరమ్మతు చేయించుకునేలా చేయండి. అలాకాకుండా పన్ను చెల్లించి పొగవదిలితే ఉపయోగం ఉంటుందా? కేవలం ఆదాయం పెంచుకునేందుకు ఇలా దొడ్డిదారిన గ్రీన్‌ట్యాక్స్ పెంచారు. – మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు 40వేలకుపైగా రవాణా వాహనాలు నిలిచిపోయాయి ఏళ్లపాటు ఫిట్నెస్ పెనాల్టీ లెక్కగట్టి బెదిరిపోయేలా చేశారు. దాదాపు 40 వేలకుపైగా రవాణా వాహనాలు రోడ్డెక్కకుండా చేసిన ఈ పెనాల్టీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఆరు నెలల గడువిస్తే అన్ని వాహనాలకు ఫిట్నెస్ చేయించేసుకుంటారు. అలాగాకుండా ఆదాయం కోసం దీన్ని ఆయుధంగా వాడటం సరికాదు – ఎ.సత్తిరెడ్డి, తెలంగాణ ఆటో డ్రైవర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి -
వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాలపై జీవితకాల పన్ను బాదుడు మొదలైంది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. మొదటి రోజు సుమారు రెండు వేల వాహనాలు నమోదు కాగా.. రెండో రోజు మంగళవారం మరో 1600 వాహనాలు కొత్తగా నమోదయ్యాయి. వీటిలో 75 శాతం వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. సోమవారం నుంచే పెరిగిన జీవితకాల పన్ను అమల్లోకి రానున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. మొదటి రోజు నమోదైన వాహనాలన్నీ పాత జీవితకాల పన్నుపైనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో వాహనదారుల నుంచి కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం మిగతా డబ్బులు వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు స్లాబ్‌ల పద్ధతి ఉండగా, కొత్తగా 4 స్లాబుల్లో జీవిత కాల పన్నును విధించిన సంగతి తెలిసిందే. వాహనాల ఖరీదు ఆధారంగా పన్ను విధించినప్పటికీ సామాన్య, మధ్యతరగతి వర్గాలపై భారం అధికంగా పడనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలైన సగటుజీవిపై పన్ను బాదుడు పిడుగుపాటుగా మారింది. జీవిత కాల పన్ను రూపంలో నగరంలోని వాహనదారులుపై ఏటా రూ.500 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఆదాయంలోనూ ఆ మూడు జిల్లాలే.. ► రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 3500 వరకు కొత్త వాహనాలు నమోదవుతుండగా వీటిలో సగానికి పైగా గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఆదాయంలోనూ ఈ మూడు జిల్లాలే ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తంగా ప్రస్తుతం 1.34 కోట్ల వాహనాలు ఉన్నాయి. గ్రేటర్లో వాహనాల సంఖ్య సుమారు 70 లక్షలు దాటింది. ► రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు, పర్మిట్లు, వివిధ రకాల పౌరసేవల పునరుద్ధరణపై వచ్చే ఆదాయం కంటే జీవితకాల పన్ను రూపంలోనే ఆర్టీఏకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖకు రూ.3,350 కోట్ల వరకు ఆదాయం లభించగా గ్రేటర్ పరిధిలోనే రూ.1600 కోట్లకు పైగా ఆదాయం నమోదు కావడం గమనార్హం. ► కొత్తగా పెంచిన జీవితకాల పన్ను ద్వారా మరో రూ.500 కోట్లకుపైగా గ్రేటర్ నుంచి లభించనుంది. ఇతర రాష్ట్రాలవాహనాల రీరిజిస్ట్రేషన్, హై ఎండ్, లగ్జరీ వాహనాల నమో దు, ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ వేలం తదితర రూపాల్లోనూ రవాణా శాఖకు హైదరాబాద్ నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది. ద్విచక్ర వాహనాలే టాప్... ► గ్రేటర్లో ప్రతి రోజు 1500 నుంచి 2000 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటిలో సుమారు వెయ్యి వరకు ద్విచక్ర వాహనాలే. కోవిడ్ కాలంలో సైతం ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 శాతం చొప్పున పాత జీవితకాల పన్ను ప్రకారం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు బైక్‌లు లభించాయి. ప్రస్తుతం 12 శాతం లైఫ్‌ట్యాక్స్ పెరగడంతో వాహనాల ధర రూ.80 వేల నుంచి రూ.90 వేలు దాటనుంది. పెరిగిన పన్నుల మేరకు ద్విచక్ర వాహనాలపైనే గ్రేటర్లో రోజుకు రూ.50 లక్షల వరకు అదనపు ఆదాయం లభించనున్నట్లు అంచనా. (చదవండి: వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!) ► ఇక పాత పన్నుల ప్రకారం మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వినియోగించే రూ.10 లక్షల వరకు ఖరీదైన కార్లకు 12 శాతం ఉండగా, ఇప్పుడు 14 శాతానికి పెంచారు. ఈ మేరకు ఈ కేటగిరి వాహనాలపైనే రూ.కోటికిపైగా అదనపు భారం పడనుంది. అన్ని రకాల వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం అదనంగా లభించే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: బిల్లులు చూస్తే.. ఫ్యూజులు అవుట్!) -
వాహనాలపై లైఫ్ ట్యాక్స్ మోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల జీవిత పన్నును ప్రభుత్వం పెంచింది. వాహనాల ధరను బట్టి గతంలో ఉన్న రెండు శ్లాబులను నాలుగుకు పెంచి.. వేర్వేరు పన్ను శాతాలను ఖరారు చేసింది. ద్విచక్ర వాహనాలకు వేరుగా రెండు శ్లాబుల్లో పన్ను శాతాలను నిర్ణయించింది. ఈ కొత్త చార్జీలు సోమవారం నుంచే అమలు చేస్తున్నట్టుగా పేర్కొంటూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు శ్లాబులుగా.. ద్విచక్ర వాహనాలకు రూ.50వేల లోపు ధర ఉన్నవి, ఆపై ధర ఉన్నవిగా రెండు శ్లాబులను ఖరారు చేశారు. మూడు, నాలుగు చక్రాల వాహనాలకు.. రూ.5లక్షలలోపు, రూ.5–10లక్షలు, రూ.10–20 లక్షలు, రూ.20 లక్షలపైన అనే 4 శ్లాబులుగా విభజించి.. ఒక్కో శ్లాబుకు ఒక్కో పన్ను నిర్ణయించారు. ఇక నాన్ ట్రాన్స్‌పోర్టు కేటగిరీలో కంపెనీలు, సంస్థలు, సొసైటీలకు చెందిన 10 సీట్ల వరకు ఉండే వాహనాలకు ఆయా శ్లాబుల్లో 15శాతం, 16 శాతం, 19 శాతం, 20 శాతం పన్నును నిర్ధారించారు. పెరగనున్న ఆదాయం దాదాపు పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను సవరించారు. రూ.10 లక్షలలోపు ఉన్నవాటిని సాధారణ వాహనాలుగా, అంతకంటే ఎక్కువ ధర ఉంటే ఖరీదైన వాహనాలుగా పరిగణించి రెండు శ్లాబుల్లో పన్ను విధించారు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా పన్ను శ్లాబులు, శాతాలను పెంచారు. దీనితో ఈ పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిరకాల వాహనాలు కలిపి.. సగటున రోజుకు ఆరు వేల వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై బదిలీ చేసుకుంటే.. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై.. తెలంగాణకు బదిలీ అయిన వాహనాలకు వాటిని కొన్నకాలం ఆధారంగా పన్నులను నిర్ణయించారు. రాష్ట్రంలో రిజిస్టరయ్యే వాహనాల శ్లాబ్‌లకు తగినట్టుగా.. ద్విచక్ర వాహనాలకు వేరుగా.. 3, నాలుగు చక్రాల వాహనాలకు వేరుగా పన్ను శాతాలను ఖరారు చేశారు. ద్విచక్ర వాహనాలైతే.. ♦రూ.50వేలలోపు ధర ఉన్నవాటికి.. వాటిని కొని 2 ఏళ్లకు మించకుంటే 8శాతం పన్ను ఉంటుంది. తర్వాత ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒకశాతం టాక్స్ తగ్గుతూ వస్తుంది. అంటే కొని రెండేళ్లు దాటితే 7శాతం, మూడేళ్లు దాటితే 6 శాతం.. ఇలా తగ్గుతూ వస్తుంది. చివరిగా కనీసం ఒకశాతం పన్ను వసూలు చేస్తారు. ♦రూ.50 వేలు, ఆపై ధర ఉంటే.. కొని రెండేళ్లకు మించకుంటే 11 శాతం పన్ను ఉంటుంది. తర్వాత ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒక్కో శాతం ట్యాక్స్‌ను తగ్గుతూ ఉంటుంది. చివరిగా కనీసం 4 శాతం పన్ను వసూలు చేస్తారు. మూడు, నాలుగు చక్రాల వాహనాలకు.. ♦కొని రెండేళ్లు మించని వాహనాలకు.. రూ.5లక్షల లోపు ధర ఉన్నవాటికి 12 శాతం; రూ.5–10 లక్షల మధ్య ధర ఉన్నవాటికి 13శాతం; రూ.10–20 లక్షల మధ్య ధర ఉన్నవాటికి 16శాతం; రూ.20 లక్షలపై ధర ఉన్నవాటికి 17శాతం పన్ను వసూలు చేస్తారు. ♦ఆయా వాహనాలు కొని ఒక్కో ఏడాది పెరిగిన కొద్దీ పన్ను శాతాన్ని ఒక శాతం, అర శాతం చొప్పున తగ్గిస్తూ ఖరారు చేశారు. ‘లైఫ్ ట్యాక్స్’ లెక్కలివీ.. ♦ఇప్పటివరకు వాహనం ఏదైనా.. రూ.10 లక్షల లోపు ధర ఉంటే 12%.. ఆపై ధర ఉంటే 14% లైఫ్ ట్యాక్స్‌ను విధించేవారు. ♦తాజాగా ద్విచక్ర వాహనాలకు వేరుగా.. మిగతా వాహనాలకు వేరుగా నిర్ధారించారు. ♦ద్విచక్ర వాహనాల ధర రూ.50 వేలలోపు ఉంటే 9శాతం, ఆపై ధర ఉంటే 12 శాతం పన్ను వసూలు చేస్తారు. -
‘మేళా’ల పేరిట మేసేశారు!
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. రూ.వంద కోట్ల ప్రభుత్వ సొమ్మును టీడీపీ నేతలకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టిన అక్రమ బాగోతమిది. రూ.250 కోట్ల మేర రవాణా శాఖకు రావాల్సిన జీవిత పన్ను (లైఫ్ ట్యాక్స్) ఎగ్గొట్టిన వైనం మరువక ముందే లెర్నర్ లైసెన్సు రిజిస్ట్రేషన్ (ఎల్ఎల్ఆర్) మేళాల పేరిట టీడీపీ నేతలు, అధికారులు రూ.వంద కోట్ల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు. ఈ దోపిడీలో టీడీపీ నేతలదే ముఖ్య పాత్ర. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ప్రచారం పొందాలనే ఉద్దేశంతో, ఎన్నికల ముందు ప్రజల దగ్గర పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఎల్ఎల్ఆర్ మేళాల్లో లైసెన్సు లేని వాహనదారులకు ఎల్ఎల్ఆర్ ఇప్పిస్తామని, దీనికయ్యే రిజిస్ట్రేషన్ రుసుములను తామే భరిస్తామని రవాణా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రవాణా శాఖ అధికారులు కూడా టీడీపీ నేతలతో జత కట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, కళాశాలల్లో 300 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా టీడీపీ నేతలు చెప్పినట్టు అధికారులు నడుచుకోవడం వివాదాస్పదమైంది. ద్విచక్ర వాహనాలకు ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.390, ద్విచక్ర వాహనం, కారు రెండు కలిపి లైసెన్సుకు రూ.440 రుసుములను రవాణా అధికారులకు టీడీపీ నేతలు చెల్లించారు. రవాణా అధికారులు మేళాలో ల్యాప్‌టాప్ తీసుకుని స్లాట్లు బుక్ చేయడంతోపాటు వాహనదారులకు కంప్యూటర్లో పరీక్ష నిర్వహించాలి. పరీక్ష లేకుండానే టీడీపీ నేతలు ఇచ్చిన పేర్లతో ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ చేసేశారు. అంతేకాకుండా ఒక్కో మేళాలో పదివేల మంది వరకు లైసెన్సు లేని వాహనదారులకు ఎల్ఎల్ఆర్ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపారు. ప్రభుత్వ సొమ్ముతో టీడీపీ నేతలకు ప్రచారం అనంతపురం జిల్లాలో చీటికిమాటికి నోరు పారేసుకునే టీడీపీ ముఖ్య నేత ఒకరు తన నియోజకవర్గంలో మేళా నిర్వహించి పది వేల మందికి ఎల్ఎల్ఆర్ లైసెన్సులు ఇప్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత తనకు రూ.30 లక్షల వరకు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని తనకు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో టీడీపీ ప్రభుత్వం సదరు నేతకు ఆ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇలా టీడీపీ నేతకు చెల్లించడంతో రవాణా శాఖకు లైసెన్సు తీసుకున్నవారు చెల్లించాల్సిన రుసుమును ప్రభుత్వం కోల్పోయింది. ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మేళాల్లో ఎల్‌ఎల్‌ఆర్‌లు ఇచ్చినందుకు టీడీపీ నేతలకు రూ.వంద కోట్ల వరకు చెల్లింపులు జరిపినట్లు రవాణా శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలు లైసెన్సు మేళాల్లో ఎంతమందికి ఎల్‌ఎల్‌ఆర్‌లు ఇచ్చారో.. టీడీపీ నేతలకు ఎంత మొత్తం నిధులు చెల్లించారో స్పష్టత లేదని రవాణా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ప్రభుత్వ సొమ్ముతో టీడీపీ నేతలకు ప్రచారం దక్కినట్లయింది. కొంత మంది అధికారుల హస్తం రవాణా శాఖలో పౌర సేవలను ఆన్లైన్ చేయడంతో సేవలకు స్వైపింగ్ మెషీన్లు వినియోగించారు. వాహనదారుల రిజిస్ట్రేషన్‌కు, యాజమాన్య హక్కులు బదలాయించడం, తదితర సేవలకు స్వైపింగ్ ద్వారా నిర్ణీత రుసుమును రవాణా శాఖ జమ చేసుకుంది. 2016 నుంచి స్వైపింగ్ మెషీన్ల ద్వారానే లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీలకు సంబంధించి రూ.40 కోట్ల సొమ్ము లెక్క తేలడం లేదని విశ్వసనీయ సమాచారం. రవాణా శాఖను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన దోపిడీకి ఆ శాఖలోని కొందరు అధికారులు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతి బాగోతంపై ఇప్పటికే నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. -
ఆటోలపై లైఫ్ ట్యాక్స్ ‘భారం’..!
విజయనగరం ఫోర్ట్:రాష్ట్ర ప్రభుత్వం మూడు టన్నులలోపు రవాణా వాహనాలపై లైఫ్ ట్యాక్స్ వడ్డించేందుకు రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయలు గుంజేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆటో కార్మికులు, వాహన యాజమానులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ట్యాక్సుల భారం మోయలేమంటూ మదనపడుతున్నారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాలకు లైఫ్ ట్యాక్స్ (జీవితకాలపు పన్ను) ఉంది. ఇకపై మూడు టన్నులలోపు ఉన్న వాహనాలకు కూడా లైఫ్ ట్యాక్స్ వర్తించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆటో కార్మికులపై లైఫ్‌ట్యాక్స్ వల్ల మరింత భారం పడనుంది. లైఫ్ ట్యాక్స్ పరిధిలోకి జిల్లాలో 28 వేల వాహనాలు రానున్నాయి. ప్రయాణికుల ఆటోలు, టాటా ఏసీలు, ట్రక్కులు లైఫ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే బీమాతో పాటు ఇతర పన్నులు, డీజిల్, ఇతర స్పేర్ పార్టుల ధరలు పెరగడంతో వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగం కారణంగా అనేక మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. క్వార్టర్లీ ట్యాక్స్ తక్కువుగా ఉండడంతో ఆటో కార్మికులు సులభంగా చెల్లిస్తున్నారు. జీవిత కాలపు పన్ను అయితే ఆటో కార్మికులకు ఇబ్బందిగా మారుతుందంటూ ఆవేదన చెందుతున్నారు. ఆటో కార్మికులపై భారం జిల్లాలో 23 వేల ఆటోలు, ట్రక్కులు, టాటా ఏసీలు మరో 5 వేలు వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఆటోలకు క్వార్టీర్లీ ట్యాక్స్ రూ.110 వసూలు చేస్తున్నారు. ఏడాదికి రూ.460 చెల్లిస్తున్నారు. ట్రక్కు, ఆటోలకు మూడు నెలలకు రూ.500 చొప్పన ఏడాదిక అన్ని పన్నులు కలిపి రూ.2,300 కడుతున్నారు. టాటా ఏసీ వంటి నాలుగు చక్రాల వాహనాలకు మూడు నెలలకు రూ.850, ఏడాదికి రూ.3,500 వరకు కడుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే 15 ఏళ్లుకు సంబంధించి పన్ను ఒకేసారి కట్టాలని ఆటో కార్మికులు, యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ–సేవ కేంద్రాల్లో నూతన విధానం ప్రకారం లైఫ్ ట్యాక్స్ కట్టాలని చెబుతున్నారని ఆటో కార్మికులు చెబుతున్నారు. అయితే, అధికారులు మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. ఒకేసారి ఆదాయం కోసం... కొత్త వాహనాల కొనుగోలుచేసిన సమయంలో ఒకేసారి రోడ్డు ట్యాక్స్ చెల్లించేందుకు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ప్రస్తుతం లైప్ ట్యాక్స్ ద్విచక్రవాహనాలకు మాత్రమే ఉంది. మూడు టన్నులలోపు రవాణా వాహనాలకు అమలు జరిపితే జిల్లా వాహనదారుల నుంచి రూ.30 కోట్లు నుంచి రూ.35 కోట్లు ఒకేసారి ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. పూర్తిస్థాయివిధి విధానాలు రాలేదు.. మూడు టన్నులలోపు రవాణా వాహనాలకు జీవితకాల రోడ్డు ట్యాక్స్ అమలుపై పూర్తిస్థాయి విధివిధానాలు ఇంకా రాలేదు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చ జరుగుతోంది. త్వరలోనే పూర్తి విధి విధానాలు వచ్చే అవకాశం ఉంది.– భువనగిరి కృష్ణవేణి,డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ -
పెద్ద మనసు చాటుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు
-
ఆటోవాలా.. విలవిల!
ఉపాధి దొరక్క.. కుటుంబ పోషణ కష్టమై.. అప్పులు చేసి మరీ ఆటోలు కొనుక్కొని.. నెలనెలా వాటికి కిస్తీలు చెల్లించడానికే ఆపసోపాలు పడుతూ జీవనం సాగిస్తున్న ఆటోవాలాల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా వాహనాలకు జీవితకాలం పన్ను(లైఫ్‌ట్యాక్స్) చెల్లించాలని సర్కారు విధించిన గడువు నేటితో ముగియనుంది. అయితే ఈ లైఫ్‌ట్యాక్స్ ఎత్తివేయాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండగా.. కాదు, డిసెంబరు 8వ తేదీలోగా పన్ను చెల్లించాల్సిందేనని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ పన్ను గండం గట్టెక్కేదేలా అంటూ ఆటోవాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో : ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను విధింపు చట్టం–1963కు ఈ ఏడాది మార్పులు చేశారు. జూన్ 8న ఈ చట్టాన్ని రాష్ట్ర రాజపత్రం (గెజిట్)లో పొందుపరిచారు. దీని ప్రకారం నలుగురు వ్యక్తులు కూర్చుని వెళ్లే ఆటో రిక్షాలు, మూడు టన్నుల లోపు బరువు కలిగిన సరకులను తీసుకెళ్లే తేలికపాటి వాహనాలు తప్పనిసరిగా జీవితకాల పన్ను చెల్లించాలి. సాధారణంగా లారీలు, కార్లు, బస్సులు తదితర వాహనాలకు షోరూం వద్దే జీవిత కాల పన్ను కట్టించేస్తున్నారు. ఆటోలు, కొన్ని ట్రాక్టర్లకు ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటి వరకూ మూడు/ఆరు నెలలకోమారు పన్ను చెల్లిస్తే సరిపోయేది. కట్టాల్సిన పన్నుకూడా చాలా తక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలిగేది కాదు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్త ఆటోలు కొన్న వారికి ఇప్పుడు పన్ను చెల్లించడం సమస్య కాదు. అలాగే దాదాపు జీవితకాలం ముగిసే దశలో ఉన్న వాటికి వాహనపు విలువలో 10 శాతం మాత్రమే ఉండటంతో వారికి ఇబ్బంది ఉండదనే చెప్పాలి. ఇదిగో వీరిపైనే భారం.. విజయవాడకు చెందిన కుమార్ అనే వ్యక్తి ఏడాది కిందట మహింద్రా కంపెనీకి చెందిన ఓ ఆటోను రూ. 5.40 లక్షలకు కొనుగోలు చేశారు. ఇప్పటికే మూడు సార్లు త్రైమాసిక పన్ను చెల్లించాడు. తాజా ప్రభుత్వ నిబంధనతో అతను ఆటోకు జీవితకాలం పన్ను రూ. 38 వేలు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే రుణం తీసుకుని ఆటోను కొనుగోలు చేసిన అతను ఆ రుణాన్ని తీర్చేందుకు ప్రతినెలా రూ. 15 వేల వరకు కిస్తీ చెల్లిస్తున్నాడు. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి అంత మొత్తం చెల్లించేదని కుమార్ వాపోతున్నారు. ఇలా కుమార్ లాగే ఏడాది, రెండేళ్ల కిందట వాహనాలు కొన్నవారు నలిగిపోతున్నారు. వీరంతా ఇప్పటికే అనేక మార్లు సాధారణంగా త్రైమాసిక పన్నులు చెల్లించారు. తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయంతో వాహనదారులు నష్టపోతున్నారు. కేవలం కొత్తగా కొనుగోలు చేయబోయే వాటికి మాత్రమే జీవిత కాల పన్నును విధించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. చెల్లించాల్సిందే.. రవాణా శాఖ అధికారులు మాత్రం పన్ను చెల్లించని వాహనాలపై కొరడా ఝుళిపిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు శనివారానికి పూర్తవుతోంది. ఇప్పటి వరకు చాలా వరకు వాహనాలు జీవిత కాల పన్ను చెల్లించలేదని.. గడువు దాటిన తర్వాత రహదారిపైకి ఆటోలు వస్తే జీవితకాల పన్ను చెల్లించని నేపథ్యంలో వాటిని సీజ్ చేసేందుకు తాము వెనుకాడబోమని రవాణా శాఖ ఉప కమిషనర్ మీరా ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. -
కొత్త బండి.. జేబులకు గండి
కొత్తగా బైక్ కొనాలని కొన్ని షోరూంలకు వెళితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకుంటే రవాణా శాఖ నిబంధనలతో పేరుతో షోరూం యజమానులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్, బీమా తదితరాలు వారి వద్దే చేయించుకోవాలనే నిబంధన వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. వారు చెప్పినంత ఇచ్చి బైక్‌ను కొనాల్సిందే. ఇది పలమనేరు పట్టణంలో మాత్రమే కాదు జిల్లా వ్యాప్తంగా సాగుతున్న తంతు. పలమనేరుకు చెందిన శరత్చంద్ర షోరూంలో ఓ బైక్ కొన్నాడు. బైక్ విలువతోపాటు అదనంగా ఆర్సీ, ఇన్సూరెన్స్, లైఫ్‌టాక్స్, నెంబర్ ప్లేట్‌కు ఇలా అధికంగానే డబ్బులు గుంజారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీరు ఏ షోరూంకు వెళ్లినా ఇంతేనని సమాధానమిచ్చారు. దీంతో విధిలేక అదనంగా డబ్బులు చెల్లించి బైక్‌ను సొంతం చేసుకున్నాడు. పలమనేరు: కొత్తగా వాహనాన్ని కొనేటప్పుడే అందుకు సంబంధించిన మొత్తం ప్రొసెస్‌తో పాటు అవసమైన సర్టిఫికెట్లను షోరూం నిర్వాహులే అందించాలని రవాణాశాఖ ఈ మధ్యనే ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా ఆన్లైన్లో సాగే ప్రక్రియే. రవాణా శాఖ నిబంధనల మేరకు ఆర్సీకి రూ.760, లైఫ్‌టాక్స్ బండి విలువలో 9 నుంచి 12శాతం, ఇన్సూరెన్స్ రూ.1800, నంబర్ ప్లేటుకు రూ. 250 వసూలు చేయాల్సి ఉంది. జరుగుతున్న తతంగం ఇలా.. అయితే కొన్ని షోరూంల నిర్వాహకులు ఆర్సీకి రూ.1000 నుంచి 1,600, టాక్స్ రూ.1200, ఇన్సూరెన్స్ రూ.2,200, నంబర్ ప్లేటుకు రూ.400 వసూలు చేస్తున్నారు. దీంతోపాటు లైసెన్స్ లేకుంటే దాన్ని తామే ఇస్తామంటూ వసూలుకు పాల్పడుతున్నారు. ఇక హెల్మెట్లు బయటి మార్కెట్‌కంటే రూ.500 వరకు ఎక్కువగా గుంజుతున్నారు. మొత్తం మీద ఓ బైక్‌కు రూ. 2వేలు అదనంగా ఇవ్వాల్సిందే. జిల్లాలో పలు వాహనాల కంపెనీలకు సంబంధించి సుమారు 220 షోరూంలున్నాయి. అన్ని చోట్ల ఇదే తంతు కొనసాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. అన్ని చోట్ల సిండికేటే.. పట్టణాల్లోని షోరూం నిర్వాహకులంతా సిండికేట్‌గా మారి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొనుగోలుదారులు ఏ షోరూంకు వెళ్లినా ఇదే ధరలుంటాయి. దీంతో వారు చెప్పిన ధర ఇచ్చి బైక్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక షోరూంలలో వాయిదాలతో వాహనాలు కొనేవాళ్లపై ఈ వాతలు కాస్త అధికంగానే ఉంటున్నాయి. దీన్ని ప్రశ్నించినా లాభం లేకుండా ఉంది. దీనిపై ఎంవీఐ శివారెడ్డిని వివరణ కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ధరల పట్టికలు పెట్టాలి ప్రభుత్వం నిర్దేశించిన ధరల వివరాలను సంబంధిత షోరూంల వద్ద రవాణాశాఖ ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. షోరూం నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలివ్వాలి. దీనిపై కొనుగోలుదారుకు అవగాహన లేకపోవడంతో దోపిడీ సాగుతోంది.–శరత్చంద్ర, పలమనేరు ఈఎంఐలో అధిక వసూళ్లు కొనుగోలు సమయంలో మొ త్తం నగదు కట్టి బండి కొనేవాళ్లు రిసిప్టులు చూస్తారు కాబట్టి తెలుస్తుంది. వాయిదాల్లో వాహనాలు కొనేవాళ్ల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. సేవలకు ధరలను పట్టిక రూపంలో షోరూంల వద్ద తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి.–చెంగారెడ్డి, కూర్మాయి, పలమనేరు -
ద్విచక్ర వాహనాల జీవితపన్ను పెంపు!
ఒక శాతం మేర పెరిగే అవకాశం రూ.10 లక్షల కంటే ఖరీదైన కార్లకూ వడ్డింపు రవాణాశాఖ ఆదాయం పెంపు లక్ష్యంగా కసరత్తు 9న బడ్జెట్ టాస్క్‌ఫోర్స్ భేటీలో కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: వాహనాల పన్నులను సవరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటం.. నిధుల అవసరం అధికంగా ఉండటంతో వీలైనంతమేర ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ప్రభుత్వం రవాణాశాఖపై దృష్టి సారించింది. ఇదివరకే ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి.. దాని ఆదాయ, వ్యయాల వివరాలపై ఆరా తీశారు. ఇప్పుడు బడ్జెట్ రూపొందించే క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్సు కమిటీ దీనిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 9న సమావేశమవుతోంది. ఇందులో వాహనాలకు సంబంధించిన వివిధ రకాల పన్నులను ఏ విధంగా హేతుబద్ధీకరించవచ్చో చర్చించనుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలకు జీవిత పన్ను 9 శాతంగా ఉంది. దీన్ని 10 శాతానికి పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. అలాగే.. రూ.10 లక్షల కంటే ఖరీదైన విలాసవంతమైన వాహనాలపై ఉన్న 14 శాతం పన్నును పెంచే అంశంపై కూడా ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. విలాసవంతమైన కార్లను ధనికులే వాడుతున్నందున ఆ పెంపు ఒకశాతానికే పరిమితం కాకున్నా ఇబ్బంది ఉండదనే కోణంలో చర్చ జరగనున్నట్టు సమాచారం. వెరసి ఈ పన్ను ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కంపెనీలు, సంస్థలు వాటి పేరుతో కొనే ఖరీదైన వాహనాలైపై విధించే పన్నును కూడా పెంచాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రవాణా శాఖ ఆదాయం లక్ష్యం రూ. 2,200 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రవాణా శాఖ ఆదాయాన్ని రూ.2,200 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ నుంచి గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వానికి రూ.3,300 కోట్లు దాఖలయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం తాజా లక్ష్యాన్ని నిర్ధారించింది.