ఉపాధి దొరక్క.. కుటుంబ పోషణ కష్టమై.. అప్పులు చేసి మరీ ఆటోలు కొనుక్కొని.. నెలనెలా వాటికి కిస్తీలు చెల్లించడానికే ఆపసోపాలు పడుతూ జీవనం సాగిస్తున్న ఆటోవాలాల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా వాహనాలకు జీవితకాలం పన్ను(లైఫ్‌ట్యాక్స్) చెల్లించాలని సర్కారు విధించిన గడువు నేటితో ముగియనుంది. అయితే ఈ లైఫ్‌ట్యాక్స్ ఎత్తివేయాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండగా.. కాదు, డిసెంబరు 8వ తేదీలోగా పన్ను చెల్లించాల్సిందేనని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ పన్ను గండం గట్టెక్కేదేలా అంటూ ఆటోవాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, అమరావతిబ్యూరో : ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను విధింపు చట్టం–1963కు ఈ ఏడాది మార్పులు చేశారు. జూన్ 8న ఈ చట్టాన్ని రాష్ట్ర రాజపత్రం (గెజిట్)లో పొందుపరిచారు. దీని ప్రకారం నలుగురు వ్యక్తులు కూర్చుని వెళ్లే ఆటో రిక్షాలు, మూడు టన్నుల లోపు బరువు కలిగిన సరకులను తీసుకెళ్లే తేలికపాటి వాహనాలు తప్పనిసరిగా జీవితకాల పన్ను చెల్లించాలి. సాధారణంగా లారీలు, కార్లు, బస్సులు తదితర వాహనాలకు షోరూం వద్దే జీవిత కాల పన్ను కట్టించేస్తున్నారు. ఆటోలు, కొన్ని ట్రాక్టర్లకు ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటి వరకూ మూడు/ఆరు నెలలకోమారు పన్ను చెల్లిస్తే సరిపోయేది. కట్టాల్సిన పన్నుకూడా చాలా తక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలిగేది కాదు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్త ఆటోలు కొన్న వారికి ఇప్పుడు పన్ను చెల్లించడం సమస్య కాదు. అలాగే దాదాపు జీవితకాలం ముగిసే దశలో ఉన్న వాటికి వాహనపు విలువలో 10 శాతం మాత్రమే ఉండటంతో వారికి ఇబ్బంది ఉండదనే చెప్పాలి.
ఇదిగో వీరిపైనే భారం..
విజయవాడకు చెందిన కుమార్ అనే వ్యక్తి ఏడాది కిందట మహింద్రా కంపెనీకి చెందిన ఓ ఆటోను రూ. 5.40 లక్షలకు కొనుగోలు చేశారు. ఇప్పటికే మూడు సార్లు త్రైమాసిక పన్ను చెల్లించాడు. తాజా ప్రభుత్వ నిబంధనతో అతను ఆటోకు జీవితకాలం పన్ను రూ. 38 వేలు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే రుణం తీసుకుని ఆటోను కొనుగోలు చేసిన అతను ఆ రుణాన్ని తీర్చేందుకు ప్రతినెలా రూ. 15 వేల వరకు కిస్తీ చెల్లిస్తున్నాడు. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి అంత మొత్తం చెల్లించేదని కుమార్ వాపోతున్నారు. ఇలా కుమార్ లాగే ఏడాది, రెండేళ్ల కిందట వాహనాలు కొన్నవారు నలిగిపోతున్నారు. వీరంతా ఇప్పటికే అనేక మార్లు సాధారణంగా త్రైమాసిక పన్నులు చెల్లించారు. తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయంతో వాహనదారులు నష్టపోతున్నారు. కేవలం కొత్తగా కొనుగోలు చేయబోయే వాటికి మాత్రమే జీవిత కాల పన్నును విధించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
చెల్లించాల్సిందే..
రవాణా శాఖ అధికారులు మాత్రం పన్ను చెల్లించని వాహనాలపై కొరడా ఝుళిపిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు శనివారానికి పూర్తవుతోంది. ఇప్పటి వరకు చాలా వరకు వాహనాలు జీవిత కాల పన్ను చెల్లించలేదని.. గడువు దాటిన తర్వాత రహదారిపైకి ఆటోలు వస్తే జీవితకాల పన్ను చెల్లించని నేపథ్యంలో వాటిని సీజ్ చేసేందుకు తాము వెనుకాడబోమని రవాణా శాఖ ఉప కమిషనర్ మీరా ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment