సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల జీవిత పన్నును ప్రభుత్వం పెంచింది. వాహనాల ధరను బట్టి గతంలో ఉన్న రెండు శ్లాబులను నాలుగుకు పెంచి.. వేర్వేరు పన్ను శాతాలను ఖరారు చేసింది. ద్విచక్ర వాహనాలకు వేరుగా రెండు శ్లాబుల్లో పన్ను శాతాలను నిర్ణయించింది. ఈ కొత్త చార్జీలు సోమవారం నుంచే అమలు చేస్తున్నట్టుగా పేర్కొంటూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నాలుగు శ్లాబులుగా..
ద్విచక్ర వాహనాలకు రూ.50వేల లోపు ధర ఉన్నవి, ఆపై ధర ఉన్నవిగా రెండు శ్లాబులను ఖరారు చేశారు. మూడు, నాలుగు చక్రాల వాహనాలకు.. రూ.5లక్షలలోపు, రూ.5–10లక్షలు, రూ.10–20 లక్షలు, రూ.20 లక్షలపైన అనే 4 శ్లాబులుగా విభజించి.. ఒక్కో శ్లాబుకు ఒక్కో పన్ను నిర్ణయించారు. ఇక నాన్ ట్రాన్స్‌పోర్టు కేటగిరీలో కంపెనీలు, సంస్థలు, సొసైటీలకు చెందిన 10 సీట్ల వరకు ఉండే వాహనాలకు ఆయా శ్లాబుల్లో 15శాతం, 16 శాతం, 19 శాతం, 20 శాతం పన్నును నిర్ధారించారు.
పెరగనున్న ఆదాయం
దాదాపు పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను సవరించారు. రూ.10 లక్షలలోపు ఉన్నవాటిని సాధారణ వాహనాలుగా, అంతకంటే ఎక్కువ ధర ఉంటే ఖరీదైన వాహనాలుగా పరిగణించి రెండు శ్లాబుల్లో పన్ను విధించారు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా పన్ను శ్లాబులు, శాతాలను పెంచారు. దీనితో ఈ పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిరకాల వాహనాలు కలిపి.. సగటున రోజుకు ఆరు వేల వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై బదిలీ చేసుకుంటే..
ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై.. తెలంగాణకు బదిలీ అయిన వాహనాలకు వాటిని కొన్నకాలం ఆధారంగా పన్నులను నిర్ణయించారు. రాష్ట్రంలో రిజిస్టరయ్యే వాహనాల శ్లాబ్‌లకు తగినట్టుగా.. ద్విచక్ర వాహనాలకు వేరుగా.. 3, నాలుగు చక్రాల వాహనాలకు వేరుగా పన్ను శాతాలను ఖరారు చేశారు.
ద్విచక్ర వాహనాలైతే..
♦రూ.50వేలలోపు ధర ఉన్నవాటికి.. వాటిని కొని 2 ఏళ్లకు మించకుంటే 8శాతం పన్ను ఉంటుంది. తర్వాత ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒకశాతం టాక్స్ తగ్గుతూ వస్తుంది. అంటే కొని రెండేళ్లు దాటితే 7శాతం, మూడేళ్లు దాటితే 6 శాతం.. ఇలా తగ్గుతూ వస్తుంది. చివరిగా కనీసం ఒకశాతం పన్ను వసూలు చేస్తారు.
♦రూ.50 వేలు, ఆపై ధర ఉంటే.. కొని రెండేళ్లకు మించకుంటే 11 శాతం పన్ను ఉంటుంది. తర్వాత ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒక్కో శాతం ట్యాక్స్‌ను తగ్గుతూ ఉంటుంది. చివరిగా కనీసం 4 శాతం పన్ను వసూలు చేస్తారు.
మూడు, నాలుగు చక్రాల వాహనాలకు..
♦కొని రెండేళ్లు మించని వాహనాలకు.. రూ.5లక్షల లోపు ధర ఉన్నవాటికి 12 శాతం; రూ.5–10 లక్షల మధ్య ధర ఉన్నవాటికి 13శాతం; రూ.10–20 లక్షల మధ్య ధర ఉన్నవాటికి 16శాతం; రూ.20 లక్షలపై ధర ఉన్నవాటికి 17శాతం పన్ను వసూలు చేస్తారు.
♦ఆయా వాహనాలు కొని ఒక్కో ఏడాది పెరిగిన కొద్దీ పన్ను శాతాన్ని ఒక శాతం, అర శాతం చొప్పున తగ్గిస్తూ ఖరారు చేశారు.
‘లైఫ్ ట్యాక్స్’ లెక్కలివీ..
♦ఇప్పటివరకు వాహనం ఏదైనా.. రూ.10 లక్షల లోపు ధర ఉంటే 12%.. ఆపై ధర ఉంటే 14% లైఫ్ ట్యాక్స్‌ను విధించేవారు.
♦తాజాగా ద్విచక్ర వాహనాలకు వేరుగా.. మిగతా వాహనాలకు వేరుగా నిర్ధారించారు.
♦ద్విచక్ర వాహనాల ధర రూ.50 వేలలోపు ఉంటే 9శాతం, ఆపై ధర ఉంటే 12 శాతం పన్ను వసూలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment