సాక్షి, అమరావతి: మోటారు కార్ల కొనుగోలు సమయంలో విధించే జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్).. వాహన నికర ఇన్వాయిస్ ధర (పన్నులు కలపక ముందు నిర్ణయించిన ధర) ఆధారంగానే ఉండాలని హైకోర్టు తెలిపింది. అంతేకానీ.. వాహన ఎక్స్ షోరూమ్ ధర (పన్నులన్నీ కలిపి నిర్ణయించిన ధర) ఆధారంగా కాదని స్పష్టం చేసింది. ఏపీ మోటారు వాహనాల ట్యాక్సేషన్ చట్టంలోని 6వ షెడ్యూల్ ప్రకారం లైఫ్ ట్యాక్స్‌ను వాహన ధర ఆధారంగానే వసూలు చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
ఇద్దరు వాహనదారుల నుంచి అధికంగా వసూలు చేసిన లైఫ్ ట్యాక్స్ మొత్తాన్ని నాలుగు వారాల్లో వారికి వాపసు ఇవ్వాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ వెన్యూ కారుకు వాహన ధర మీద కాకుండా నికర ఇన్వాయిస్ ధర మీద 14 శాతం పన్నును చట్టవిరుద్ధంగా వసూలు చేశారని విజయవాడకు చెందిన తలశిల సౌజన్య 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.52,168 తిరిగి వాపసు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని విన్నవించారు. అలాగే ఇదే రీతిలో తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.1.16 లక్షలను వాపసు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజయవాడకు చెందిన వల్లూరు పవన్ చంద్ 2021లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ సుజాత ఇటీవల తుది విచారణ జరిపారు.
వాహన ధరపైనే లైఫ్ ట్యాక్స్..
రవాణా శాఖ తరఫు న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. లైఫ్ ట్యాక్స్‌ను వాహన ధరపైనే నిర్ణయిస్తారన్నారు. వాహన ధర అంటే డీలర్‌కు వాహన కొనుగోలుదారు చెల్లించే మొత్తమని.. ఇందులో జీఎస్టీ, సెస్ వంటివి కలిపి ఉంటాయని తెలిపారు. అందువల్ల పన్నులు కలిపిన మొత్తం మీదనే లైఫ్ ట్యాక్స్ విధించామన్నారు. ఇలా చేయడం ఎంత మాత్రం చట్టవిరుద్ధం కాదన్నారు.
అంతేకాకుండా 1994లో రవాణా శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం వాహన ధర అంటే
అన్ని పన్నులతో కలిపి చెల్లించే మొత్తమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల తరఫు న్యాయవాది చక్రవర్తి వాదనలతో ఏకీభవించారు. లైఫ్ ట్యాక్స్‌ను వాహన నికర ఇన్వాయిస్ ధర ఆధారంగానే వసూలు చేయాలని తేల్చిచెప్పారు.
ఎక్స్‌షోరూం ధర వాహన ధర కాదు..
పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎమ్మార్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ.. వాహన ధర అంటే వాహనదారు డీలర్‌కు చెల్లించే మొత్తమన్నారు. ఈ ధర ఆధారంగానే డీలర్.. వాహనదారుకు వాహనాన్ని బదలాయిస్తారని తెలిపారు. అంతేతప్ప పన్నులన్నింటితో కలిపి చెల్లించే ఎక్స్ షోరూం ధర ఎంతమాత్రం వాహన ధర కాదన్నారు. హ్యుందాయ్ వెన్యూ ఇన్వాయిస్ ధర రూ.8,60,853 అని తెలిపారు.
నిబంధనల ప్రకారం.. రూ.10 లక్షలకన్నా తక్కువ విలువ చేసే వాహనానికి 12 శాతం మాత్రమే లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని ప్రకారం రూ.8.60 లక్షలకు 12 శాతం లెక్కన రూ.1,03,302 లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుందని నివేదించారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్స్‌షోరూం ధరను రూ.11,10,500గా పేర్కొంటూ.. వాహన ధర రూ.10 లక్షలకు మించింది కాబట్టి 14 శాతం పన్ను చెల్లించాలని పిటిషనర్‌తో బలవంతంగా రూ.1,55,470ను లైఫ్ ట్యాక్‌గా కట్టించుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.
తద్వారా రూ.52168 అదనంగా వసూలు చేశారన్నారు. అలాగే రెండో పిటిషనర్ వల్లూరు పవన్ చంద్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారు విషయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. ఇన్వాయిస్ ధరపై కాకుండా ఎక్స్‌షోరూమ్ ధరపై 14 శాతం పన్ను వసూలు చేశారని తెలిపారు. ఇలా పవన్ చంద్ నుంచి రూ.1.16 లక్షలు అదనంగా పన్ను కట్టించుకున్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment