ఆటోలు
విజయనగరం ఫోర్ట్:రాష్ట్ర ప్రభుత్వం మూడు టన్నులలోపు రవాణా వాహనాలపై లైఫ్ ట్యాక్స్ వడ్డించేందుకు రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయలు గుంజేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆటో కార్మికులు, వాహన యాజమానులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ట్యాక్సుల భారం మోయలేమంటూ మదనపడుతున్నారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాలకు లైఫ్ ట్యాక్స్ (జీవితకాలపు పన్ను) ఉంది. ఇకపై మూడు టన్నులలోపు ఉన్న వాహనాలకు కూడా లైఫ్ ట్యాక్స్ వర్తించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆటో కార్మికులపై లైఫ్‌ట్యాక్స్ వల్ల మరింత భారం పడనుంది. లైఫ్ ట్యాక్స్ పరిధిలోకి జిల్లాలో 28 వేల వాహనాలు రానున్నాయి. ప్రయాణికుల ఆటోలు, టాటా ఏసీలు, ట్రక్కులు లైఫ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే బీమాతో పాటు ఇతర పన్నులు, డీజిల్, ఇతర స్పేర్ పార్టుల ధరలు పెరగడంతో వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగం కారణంగా అనేక మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. క్వార్టర్లీ ట్యాక్స్ తక్కువుగా ఉండడంతో ఆటో కార్మికులు సులభంగా చెల్లిస్తున్నారు. జీవిత కాలపు పన్ను అయితే ఆటో కార్మికులకు ఇబ్బందిగా మారుతుందంటూ ఆవేదన చెందుతున్నారు.
ఆటో కార్మికులపై భారం
జిల్లాలో 23 వేల ఆటోలు, ట్రక్కులు, టాటా ఏసీలు మరో 5 వేలు వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఆటోలకు క్వార్టీర్లీ ట్యాక్స్ రూ.110 వసూలు చేస్తున్నారు. ఏడాదికి రూ.460 చెల్లిస్తున్నారు. ట్రక్కు, ఆటోలకు మూడు నెలలకు రూ.500 చొప్పన ఏడాదిక అన్ని పన్నులు కలిపి రూ.2,300 కడుతున్నారు. టాటా ఏసీ వంటి నాలుగు చక్రాల వాహనాలకు మూడు నెలలకు రూ.850, ఏడాదికి రూ.3,500 వరకు కడుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే 15 ఏళ్లుకు సంబంధించి పన్ను ఒకేసారి కట్టాలని ఆటో కార్మికులు, యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ–సేవ కేంద్రాల్లో నూతన విధానం ప్రకారం లైఫ్ ట్యాక్స్ కట్టాలని చెబుతున్నారని ఆటో కార్మికులు చెబుతున్నారు. అయితే, అధికారులు మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు.
ఒకేసారి ఆదాయం కోసం...
కొత్త వాహనాల కొనుగోలుచేసిన సమయంలో ఒకేసారి రోడ్డు ట్యాక్స్ చెల్లించేందుకు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ప్రస్తుతం లైప్ ట్యాక్స్ ద్విచక్రవాహనాలకు మాత్రమే ఉంది. మూడు టన్నులలోపు రవాణా వాహనాలకు అమలు జరిపితే జిల్లా వాహనదారుల నుంచి రూ.30 కోట్లు నుంచి రూ.35 కోట్లు ఒకేసారి ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
పూర్తిస్థాయివిధి విధానాలు రాలేదు..
మూడు టన్నులలోపు రవాణా వాహనాలకు జీవితకాల రోడ్డు ట్యాక్స్ అమలుపై పూర్తిస్థాయి విధివిధానాలు ఇంకా రాలేదు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చ జరుగుతోంది. త్వరలోనే పూర్తి విధి విధానాలు వచ్చే అవకాశం ఉంది.– భువనగిరి కృష్ణవేణి,డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment