న్యూఢిల్లీ: కీలక విడిభాగాల సరఫరాకు సంబంధించిన సవాళ్లు, వివిధ విభాగాల్లో డిమాండ్‌పరమైన (ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు) సమస్యలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వాహన రంగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో గానీ ఆటో పరిశ్రమ కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ (ఫాడా) మంగళవారం ఈ విషయాలు వెల్లడించింది.
రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, చైనాలో లాక్‌డౌన్ వంటి అంశాల కారణంగా కీలకమైన విడిభాగాల సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని ఫాడా పేర్కొంది. ఫలితంగా దేశీ ఆటో పరిశ్రమ రికవరీపై ప్రభావం పడనున్నట్లు వివరించింది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపవచ్చని ఫాడా ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. ‘వివిధ సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కి మాత్రమే పరిమితం కావచ్చని భావిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు.
మొత్తం మీద 2024 ఆర్థిక సంవత్సరంలో గానీ ఆటో పరిశ్రమ కోలుకుని, అమ్మకాలు తిరిగి కరోనా పూర్వ స్థాయికి చేరకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు గులాటీ చెప్పారు. 2020–21లో 1,52,74,314 వాహనాలు అమ్ముడవగా 2021–22లో 7.21 శాతం వృద్ధితో ఆటో విక్రయాలు 1,63,75,799కే పరిమితమయ్యాయి.
చమురు ధరల సెగ..
‘రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, చైనాలో లాక్‌డౌన్ వంటి ప్రతికూలతల కారణంగా దేశీ ఆటో పరిశ్రమకు సమీప భవిష్యత్తులో సవాళ్లు తప్పవు. క్రూడాయిల్ రేటు భారీగా పెరిగింది. ఇంధన ధరలు సుమారు రూ.10 వరకూ పెరిగాయి. ఇవి ఇంకా పెరుగుతాయి. ఫలితంగా సెంటిమెంటు దెబ్బతినవచ్చు‘ అని గులాటీ పేర్కొన్నారు. వాహనాల తయారీలో కీలకంగా ఉండే విలువైన లోహాలు, నియాన్ గ్యాస్ మొదలైనవి యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల నుంచే రావాల్సి ఉన్నందున ప్యాసింజర్ వాహనాల విభాగంపై ప్రభావం పడనుందని ఆయన చెప్పారు. సెమీకండక్టర్ల సరఫరా మరింత మందగించడం వల్ల ప్యాసింజర్ వాహనాల కోసం నిరీక్షించే సమయం ఇంకా పెరిగిపోవచ్చన్నారు.
టూవీలర్లపై ప్రభావం ..
ముడి వస్తువుల ధరలు పెరగడం వల్ల ఆటో కంపెనీలు తమ వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని గులాటీ చెప్పారు. ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో డిమాండ్ తగ్గకపోయినప్పటికీ .. రేట్లపరంగా చాలా సున్నితంగా ఉండే ద్విచక్ర వాహనాల విభాగంపై మాత్రం కచ్చితంగా ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పీవీల రిటైల్ విక్రయాలు 14.16 శాతం వృద్ధి చెందగా, టూవీలర్ల అమ్మకాలు 4 శాతమే పెరిగాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 45 శాతం, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 50 శాతం ఎగిశాయి. కోవిడ్ వల్ల 2020–21లో విక్రయాలు గణనీయంగా పడిపోయిన ప్రభావం (లో–బేస్ ఎఫెక్ట్) వల్లే 2021–22లో కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోందని గులాటీ వివరించారు.
ఇక తాజాగా మార్చి నెలను తీసుకుంటే మాత్రం .. ఫాడా గణాంకాల ప్రకారం గత నెలలో ఆటోమొబైల్ అమ్మకాలు మొత్తం మీద 3 శాతం క్షీణిచాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గతేడాది మార్చితో పోలిస్తే సుమారు 5 శాతం తగ్గి 2,71,358 యూనిట్లకు పరిమితమయ్యాయి. టూవీలర్లు 4 శాతం క్షీణించి 11.57 లక్షలుగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో సవాళ్ల కారణంగా ద్విచక్ర వాహనాల విభాగం ఇప్పటికే ఒత్తిడి లో ఉండగా, ఇంధనాల రేట్లు పెరగడం.. వాహనాల ధరల పెరగడం వంటి కారణాలతో మరింత ప్రతికూల ప్రభావం పడిందని గులాటీ చెప్పారు.
రాబోయే కొన్ని త్రైమాసికాల్లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందవచ్చని ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఎకనమీలో కరోనా కట్టడిపరమైన ఆంక్షల ఎత్తివేత, డిమాండ్ మెరుగుపడటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది.
సెమీకండక్టర్ల సరఫరా సంబంధించిన సవాళ్లు, రిటైల్ ఇంధన ధరల పెరుగుదల వంటి కారణాలతో అమ్మకాల పరిమాణంపై కొంత మేర ప్రభావం పడొచ్చని ఎక్యూట్ రేటింగ్స్ పేర్కొంది. సెమీకండక్టర్ల కొరతతో సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్, ఉత్పత్తి కోతలు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా పీవీ అమ్మకాలు సుమారు 15 శాతం పెరిగాయని వివరించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో లో–బేస్ ప్రభావం ఇందుకు కొంత కారణమని తెలిపింది.
టూవీలర్ల డిమాండ్‌పై అనిశ్చితి ..
కోవిడ్ విజృంభణ సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం వల్ల అసంఘటిత రంగం .. చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ఆ ప్రభావం టూవీలర్ల డిమాండ్‌పై గణనీయంగా కనిపిస్తోందని ఎక్యూట్ తెలిపింది. కోవిడ్ కట్టడిపరమైన ఆంక్షల ఎత్తివేత, వ్యవసాయ రంగ ఆదాయాలు మెరుగ్గా ఉండొచ్చన్న అంచనాలతో 2023 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ .. అది ఎప్పటికి జరుగుతుందనే దానిపై అనిశ్చితి నెలకొందని పేర్కొంది. ఇంధనాల ధరల పెరుగుదల దీనికి ఆజ్యం పోస్తోందని వివరించింది.
మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ రహదారుల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుండటంతో వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ కొనసాగవచ్చని ఎక్యూట్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి చెప్పారు. 2021–22లో సీవీల అమ్మకాలు 25 శాతం వృద్ధి చెందాయి. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం, ఇన్‌ఫ్రాపై పెట్టుబడులు పెరగడం వంటి అంశాలతో ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో డిమాండ్ మెరుగుపడటం ఇందుకు కారణమని చౌదరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment