ఎల్.ఎన్.పేట, మెళి యాపుట్టి, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాలు నడిపేవారు ప్రమాదాల బారిన పడకుం డా హెల్మెట్లు ధరించాలని పోలీసులు సూచించడం మనకు తెలిసిన విషయమే. కానీ రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మాత్రం కాంగ్రెస్ నాయకులను హెల్మెట్లు ధరించమని సూచిస్తున్నారు. అదేమిటి.. వారికెందుకు హెల్మెట్లు అని ఆశ్చర్యపోతున్నారా!.. దానికి ఆయన చెప్పిన కారణమేమిటంటే.. తమ అభిప్రాయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకత్వం బలవంతంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడంతో ప్రజలు పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు గానీ, రానున్న ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదని.. చెప్పులు, రాళ్లు పడినా ఆశ్చర్యంలేదని అన్నారు.
అందువల్ల పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలంటే ముందుజాగ్రత్తగా తలలకు హెల్మెట్లు పెట్టుకోవాలని బుధవారం రాత్రి పాతపట్నం, మెళియాపుట్టిలలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చవిచూస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో పాతపట్నం నుంచే పోటీ చేస్తానని, లేకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టే పార్టీని ఒక బ్రహ్మపదార్థంగా చెప్పుకొచ్చారు. ఆ పార్టీలో చేరేది లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో త్వరలో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తానని శత్రుచర్ల చెప్పారు.
కాంగ్రెస్ నేతలకు కావాలి హెల్మెట్లు!
Published Thu, Feb 20 2014 2:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement