చోరీ చేసిన బైక్‌లు, నిందితుడిని చూపుతున్న ఎస్పీ కె.నరసింహ
మహబూబ్‌నగర్ క్రైం: ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేయడం ప్రారంభించి.. పోలీసులకు దొరికిపోయాడు. జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని రాజాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సోమవారం మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కె.నరసింహ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా విద్యానగర్‌కాలనీకి చెందిన తాయి ప్రశాంత్‌కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో అతను సుభద్ర అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆ విషయం భార్యకు తెలిసి ఇద్దరు పిల్లలను చెరువులో తోసి ఆమె చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇద్దరు పిల్లలు మృతి చెందగా ఆమె బతకగా.. పోలీసులు జైలుకు పంపారు.
దీంతో తాయి ప్రశాంత్‌కుమార్, సుభద్రను తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని లక్ష్మీనగర్‌కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో జీవనం కోసం చిన్న చిన్న పనులు చేస్తే వచ్చిన డబ్బులు సరిపోవడం లేదని బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట రాజాపూర్‌లో మూడు, రంగారెడ్డిగూడలో రెండు, జడ్చర్లలో ఒకటి, షాద్‌నగర్‌లో రెండు, హయత్‌నగర్‌లో ఒకటి, కొత్తూర్‌లో ఒకటి, మైలార్‌దేవ్‌పల్లిలో ఒక బైక్‌తోపాటు సూర్యాపేటలో ఒక ఆటోను చోరీ చేశాడు. దొంగతనం చేసిన వాహనాలు అన్నింటిని తీసుకువచ్చి లక్ష్మీనగర్‌కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో పెట్టుకున్నాడు.
సోమవారం ఉదయం స్కూటీపై హైదరాబాద్ వెళ్తుండగా రాజాపూర్ పోలీసులు చేసిన వాహన తనిఖీల్లో పట్టుబడగా విచారిస్తే దొంగతనాలు బయటపడినట్లు ఎస్పీ తెలిపారు. అతని నుంచి మొత్తం 11 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇతను 2019లో సూర్యాపేటలో ఆటో దొంగతనం కేసులో జైలుశిక్ష అనుభవించినట్లు వెల్లడించారు. ప్రతి వాహనదారుడు వారికి సంబంధించిన వాహనాలకు జీపీఏ సిస్టంతోపాటు ఇంటి ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో 40 దొంగతనం కేసులు ఛేదించినట్లు వివరించారు. సమావేశంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీ లక్ష్మణ్, సీఐలు జమ్ములప్ప, ఇఫ్తేకార్, ఎస్‌ఐలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment