
సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్
సాక్షి, నాగర్‌కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. గత రెవెన్యూ చట్టాలకు భిన్నంగా ఈసారి కొత్త చట్టంలో భూసమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది. భూరికార్డుల్లో తప్పుల సవరణ పరిష్కారం 60 రోజుల్లో పూర్తి కావాలని నిర్దేశించింది. వారసత్వ భూముల్లో హక్కుదారులను 30 రోజుల్లోగా నిర్ణయించాలని, లేకపోతే దరఖాస్తు ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం చర్యలు తీసుకోగా, ఇందుకోసం గరిష్టంగా 90 రోజుల గడువు విధించింది.
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు..
పూర్వంలో గ్రామాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా నిర్వహించినట్టుగా ఇకనుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించనున్నారు. మ్యుటేషన్, రికార్డుల మార్పులు జరిగినప్పుడు వాటిని గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్‌లను మారుస్తారు. భూభారతి పోర్టల్‌లో దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్‌కు, కలెక్టర్ నిర్ణయంపై ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 60 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు ఉచిత న్యాయసాయాన్ని అందించనున్నారు. మండలస్థాయి, జిల్లా లీగల్ అథారిటీల ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించనున్నారు.
మోసపూరితంగా పట్టాలు పొందితే చర్యలు..
ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేయనున్నారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దు కానున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేయవచ్చని భూభారతి చట్టం పేర్కొంది.
గ్రామాల్లో ఎక్కువగా ఆబాదీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికి సరైన చట్టబద్ధమైన భూ హక్కులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లస్థలాలు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో భూధార్ కార్డులను జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు భూధార్ కార్డులను జారీ చేయనున్నారు.
కొత్త రెవెన్యూచట్టంలో సాదా బైనామా దరఖాస్తులను సైతం పరిష్కరించాలని నిర్ణయించడంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో కదలిక రానుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని సంబంధిత ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదాబైనామా దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలో అసైన్డ్, సీలింగ్, షెడ్యూల్ ఏరియా భూములు ఉంటే వాటిపై భూ హక్కులు ఉండవు. దరఖాస్తు సక్రమంగా తేలితే ఆర్డీఓ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోగా పూర్తికావాలని చట్టంలో నిర్దేశించారు.
ఉమ్మడి జిల్లాలో నేడుమంత్రి పొంగులేటి పర్యటన..
భూభారతి చట్టంపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు నిర్వహించే అవగాహన సదస్సునకు హాజరయ్యేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. జోగుళాంబ గద్వాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని సదస్సుల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8.50 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ధరూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి చట్టం –2025 అవగాహన సదస్సుల్లో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరవుతారు. అనంతరం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.
భూభారతిపై విస్త్తృత అవగాహనకల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం
60 రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం
సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
నేడు గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి

సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్