సహాయక చర్యలకు బ్రేక్
అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో శుక్రవారం 63వ రోజు సహాయక చర్యలు కొనసాగాయి. మట్టి, రాళ్లు, టీబీఎం శకలాల తరలింపు దాదాపుగా దగ్గర పడటంలో సహాయక బృందాలు కూడా వెనుదిరుగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు తిరుగుముఖం పట్టగా.. ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్, రెస్క్యూ, దక్షిణ మధ్య రైల్వే బృందాలు శుక్రవారం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నిషేధిత 43 మీటర్ల ప్రదేశం మినహా డీ2, డీ1 మధ్య మట్టి, బురద, బండరాళ్లు, టీబీఎం శకలాల తొలగింపు దాదాపు పూర్తి కావచ్చింది. సొరంగం పైకప్పు కూలిన ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిలో ఇద్దరి మృతదేహాలు లభించగా.. ఆరుగురి జాడ నేటికీ లభించలేదు. చివరి 43 మీటర్లు అత్యంత ప్రమాదకరమని, సహాయక చర్యలు కొనసాగిస్తే మళ్లీ పైకప్పు కూలవచ్చని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు, జీఎస్‌ఐ నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేసేందుకే నిర్ణయం తీసుకుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ప్యూయల్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిపుణలతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని.. సైట్ స్పెసిఫిక్ రిపోర్టు తయారు చేయాలని కోరింది. ఈ కమిటీ నివేధిక ఆధారంగా సహాయక చర్యల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు. నివేదిక తయారీకి మూడు నెలలకు పైగా సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.
బైపాస్ మార్గం..
దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ నుంచి బైపాస్ మార్గంలో సొరంగం తవ్వకాలు చేపట్టాలని గురువారం సమావేశమైన టెక్నికల్ కమిటీ సిఫారస్ చేసింది. సొరంగం పైకప్పు కూలిన 13.936 కిలోమీటరు వద్ద 43 మీటర్ల వరకు నిషేధిత ప్రదేశంగా గుర్తించి కంచె ఏర్పాటు చేశారు. కంచె ముందు నుంచి బైపాస్ మార్గం ఏర్పాటుకు అడ్డంగా ఉన్న టీబీఎం ప్లాట్‌ప్లామ్ భాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది థర్మల్ గ్యాస్ కట్టర్‌తో తొలగించి లోకో ట్రైన్‌లో.. ఉబికి వస్తున్న నీటి ఊటను భారీ మోటార్ల సాయంతో కృష్ణానదిలోకి.. మట్టి, బురదను కన్వేయర్ బెల్టుపై సొరంగం బయటకు తరలిస్తున్నారు. తవ్వకాలు నిలిపివేసి టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)కు బదులుగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు జరపడం శ్రేయస్కరమని టెక్నికల్ కమిటీ నిర్ణయించింది. ఇదే సమయంలో మన్నెవారిపల్లి సొరంగం ఔట్‌లెట్ నుంచి టీబీఎం ద్వారా తవ్వకాలు త్వరగా ప్రారంభిచాలని భావిస్తున్నారు.
నేటితో ముగియనున్న మట్టి, రాళ్లు, టీబీఎం శకలాల తరలింపు
తాత్కాలికంగా నిలిపివేయాలని
భావిస్తున్న ప్రభుత్వం
వెనుదిరుగుతున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, ర్యాట్‌హోల్ మైనర్స్ బృందాలు
ఉప కమిటీ నివేదిక
ఆధారంగా ముందుకు..


