గన్నీ బ్యాగుల కోసం రైతుల రాస్తారోకో
మహబూబ్‌నగర్ రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. గన్నీ బ్యాగుల కొరత ఏర్పడడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. గత వానాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రంగా ధాన్యం విక్రయాలు జరగడంతో ఆ విధంగానే ఈ యాసంగిలోనూ కూడా ఉంటాయని భావించిన అధికారులు కేంద్రాలకు కొంత మొత్తంలోనే గన్నీ బ్యాగులను సరఫరా చేశారు. అయితే గతేడాది వ్యాపారులకు నేరుగా ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందించే రూ.500 బోనస్ కోల్పోయిన రైతులు ఈసారి బోనస్ పొందాలనే ఉద్దేశంతో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఊహించని రీతిలో రైతులు ధాన్యాన్ని విక్రయాలకు తీసుకు రావడంతో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. అకాల వర్షాలు వెంటాడుతుండటంతో పండించిన ధాన్యాన్ని త్వరగా విక్రయించాలని చూస్తున్న రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు పోటీ పడుతున్నారు. దాంతో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. శుక్రవారం కోటకదిర వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రానికి గన్నీ బ్యాగుల కోసం పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. వారికి అవసరమైన గన్నీ బ్యాగులు లభించకపోవడంతో రైతులు హైదరాబాద్– రాయచూర్ జాతీయ ప్రధాన రహదారి పైకి వచ్చి పెద్దఎత్తున ఆందోళన చేశారు. దాదాపు గంటపాటు రైతులు రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారికి ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుందర్‌రాజ్, ఎస్సై విజయ్‌కుమార్‌లు హుటాహుటిన అక్కడికి చేరుకుని రైతులతో చర్చించి వెంటనే 18 వేల గన్నీ బ్యాగులను తెప్పించారు. దీంతో రైతులు శాంతించారు.
గంటపాటు జాతీయ రహదారి నిర్బంధం
రైతుల ఆందోళనకు
దిగివచ్చిన అధికారులు
అప్పటికప్పుడు 18 వేల బ్యాగులు పీఏసీఎస్‌కు సరఫరా


