
పరికరాల శుభ్రంతో.. బిందు సేద్యం సులభం
అలంపూర్: బిందు సేద్యం పరికరాలను సకాలంలో శుభ్రం చేసుకోవడం వలన పరికరాల మన్నికతోపాటు నీటి పారుదల బాగుంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ అన్నారు. వంద అడుగులకుపైగా పడిపోయిన భూగర్భ జలాల నుంచి వచ్చే సన్నటి మన్ను ఎరువులు బిందు సేద్యం పరికరాలను దెబ్బతిస్తాయి. తద్వారా మోటార్లపై భారం పడి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. పరికరాలను భద్రపర్చడానికి బిందు సేద్య పరికరాలను శుభ్రపర్చుకోవడానికి పలు సూచనలు రైతులకు వివరించారు.
స్క్రీన్ ఫిల్టర్ శుభ్రత కీలకం
బోరు బావుల నుంచి వచ్చే నీటితో సన్నటి మన్ను అధికంగా వస్తోంది. దీని వలన లేటర్ పైప్‌ల నుంచి నీరు వచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీని నివారణకు బోరు వద్ద నుంచి లేటరల్ పైపులకు నీరు వచ్చే ముందు స్క్రీన్ ఫిల్టర్ అమర్చుతారు. దీన్ని వారం రోజులకు ఒకసారి నీటితో శుభ్రపర్చుకోవాలి. ఫిల్టర్‌పై సన్నటి రంధ్రాలు పూడిపోకుండా చూసుకోవాలి. కొత్తగా వేసిన బోర్లు అయితే రోజుకు ఒక పర్యంతమైనా ఫిల్టర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. బావుల నుంచి నీటిని తీసుకుంటున్నప్పుడు సాండ్ ఫిల్టర్‌ను అమర్చుకోవాలి. రెండు ఫిల్టర్లతో రెండు దఫాలుగా వడపోత జరిగి లేటరల్ పైపుల్లోకి మట్టి చేరకుండా ఉంటుంది.
లెటరల్ పైపులకు యాసిడ్ ట్రీట్‌మెంట్
బిందు సేద్య పరికరాల ద్వారా అందించే ఎరువులు వల్ల లేటరల్ పైపులకున్న రంధ్రాలు పూడుకుపోయి.. నీరు కిందికి రావడం నిలిచిపోయి మొక్కలకు అందదు. ఏడాదికి ఒకసారి పైప్‌లను శుభ్రపర్చుకోవాలి. ఇందుకోసం తక్కువ గాఢత గల హైడ్రోక్లోరిక్ లేదా సల్ఫూరిక్ యాసిడ్ వాడతారు. యాసిడ్ ఉపయోగించి పైప్‌లను శుభ్రపరిచేందుకు రెండు పద్ధతులను పాటించవచ్చు. పంట లేని సమయంలో లేటరల్ పైప్‌లను శుభ్రపర్చుకోవాలి. ఎకరా పొలంలో గల లేటరల్ పైప్‌లను శుభ్రపరిచేందుకు 30 – 40 లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను కొనుగోళు చేసుకోవాలి. 10 మీ., హూస్ పైప్‌ను యు ఆకారంలో ఉండేలా అమర్చుకోవాలి. ఇందుకోసం రెండు వైపుల కట్టెలను పాతి వాటికి హూస్ పైప్ కట్టి.. పైప్‌ను యాసిడ్‌ను ఉంచాలి. గాఢత తక్కువ గల యాసిడ్‌ను మాత్రమే మార్కెట్‌లో విక్రయిస్తారు.
● రెండో పద్ధతిలో ఎరువులను వదిలే ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంకు ద్వారా శుభ్రపర్చాలి. పంట లేని సమయంలో మాత్రమే ఈ పద్ధతి అవలంభించాలి. ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంక్‌ను ముందుగా శుభ్రపర్చుకోవాలి. ఆపై తక్కువ గాఢత గల యాసిడ్‌ను నింపి నీటిని అందులోకి పంపాలి. ఈ ప్రక్రియ మెల్లగా జరిగేలా చూడాలి. ఇనుప ఫెర్టిగేషన్ ట్యాంక్ ఉన్నట్లయితే వెంచురీ సహాయంతో లేటరల్ పైప్‌లను శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
● పంట ఉన్న సమయాల్లో యాసిడ్ ద్వారా పైప్‌లను శుభ్రపర్చరాదు.
● డ్రిప్ కంపెనీలు సూచించిన యాసిడ్‌ను వారు నిర్దేశించిన మోతాదులోనే వాడాలి.
● నీటిలో యాసిడ్ కలపాలి. అంతేకాని యాసిడ్ ఉన్న బ్యాంకులో నీటిని ధారపోసే ప్రయత్నం చేయరాదు.
● ఫెర్టిగేషన్ లేదా వెంచురీ సహాయంతో యాసిడ్‌ను పంపేటప్పుడు నీటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
● పైపులు శుభ్రపడిన అనంతరం ఎండ్ క్యాప్‌లను తీసేసీ యాసిడ్ కలిపిన నీటిని వదిలేయాలి.
● శుభ్రపరిచిన పైప్‌లను సైతం మరోమారు నీటితో కడగడం లేదా సబ్‌లైన్‌కు బిగించి నీటిని పారనివ్వాలి.
● శుభ్రపరిచే సమయాల్లో రైతులు ముఖానికి, చేతులకు తొడుగులు ధరించాలి. వీలైతే చలువ కంటి అద్దాలు పెట్టుకోవడం ఉత్తమం.
పాడి–పంట

పరికరాల శుభ్రంతో.. బిందు సేద్యం సులభం

పరికరాల శుభ్రంతో.. బిందు సేద్యం సులభం