గడువు దాటిందా.. బండి గోవిందా! | This Month Ending Last For BS4 Vehicle Registrations | Sakshi
Sakshi News home page

గడువు దాటిందా.. బండి గోవిందా!

Published Tue, Mar 10 2020 9:08 AM | Last Updated on Tue, Mar 10 2020 10:07 AM

This Month Ending Last For BS4 Vehicle Registrations - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌:  పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. బీఎస్‌–4 వాహనాల ద్వారా వాతావరణ కాలుష్యం అధికంగా ఉండడంతో వాటి స్థానంలో బీఎస్‌–6 వాహనాలను వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 2016లోనే నిర్ణయం తీసుకుంది. అయితే ఈనెల 31లోగా బీఎస్‌–4 వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోని వాహనాలను స్క్రాప్‌గా పరిగణిస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోని బీఎస్‌–4 వాహన దారుల్లో గుబులు మొదలైంది. గడువు దగ్గర పడడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి భారత్‌ స్టేజ్‌–6 (బీఎస్‌–6) వాహనాలను మాత్రమే ఆర్టీఏ కార్యాలయంలో నమోదు చేస్తారు. బీఎస్‌–4 వాహనాలను అనుమతించరు.

జిల్లాలో రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలు 3,684కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు ఇచ్చింది. సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకోని వాహనాలు తుక్కు కిందికి వస్తాయని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ద్విచక్రవాహనాలు 3,369 ఉండగా కార్లు, ఇతర వాహనాలు 315 ఉన్నాయి. మొత్తంగా 3,684 రిజిస్ట్రేషన్‌ చేసుకోని వాహనాలుఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 2,348, ఇతర వాహనాలు 367, నిర్మల్‌ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 5,144, ఇతర వాహనాలు 640 ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ద్విచక్రవాహనాలు 4,395, ఇతర వాహనాలు 528 ఉన్నాయి. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోని బీఎస్‌–4 వాహనాలు 16,106 ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే స్క్రాపే..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొనుగోలు చేసిన కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా కొంత మంది వాహన దారులు యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లాలో ద్విచక్ర, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు ఉన్నాయి. అయితే బీఎస్‌–4 వాహనాల ద్వారా కాలుష్యం ఎక్కువగా ఉందని ప్రభుత్వం వీటి తయారీని నిలిపివేసింది. కొత్తగా బీఎస్‌–6 వాహనాలను తీసుకురానుంది. వీటి ద్వారా కాలుష్యం కొంత మేరకు తగ్గనుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకోని వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని మండలాల్లో రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల గడిచిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసుకోకుంటే సీజ్‌ చేస్తామని అధికారులు చెబుతున్నారు. జరిమానాలు కూడా విధించనున్నారు. రిజిస్ట్రేషన్‌ విషయంలో ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే పరిష్కరించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 99493 11051 ఫోన్‌ నంబర్‌ ద్వారా సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.

బీఎస్‌–4 వాహనాలకు ఆఫర్లు..
ఆదిలాబాద్‌ జిల్లాలో ఆయా షోరూంలలో ఉన్న బీఎస్‌–4 వాహనాల అమ్మకాల కోసం డీలర్లు వినియోగదారులకు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈనెల 31 వరకు గడువు ఉండడంతో సేల్స్‌ చేసేందుకు వాహన ధరల్లో రూ. 10 వేల నుంచి రూ. 20వేల వరకు తగ్గించి విక్రయాలు జరుపుతున్నారు. వినియోగదారులు ఆ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 50 నుంచి 60 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తుంటారు. వీటి రిజిస్ట్రేషన్‌ల కోసం మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆలోగా బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్‌ అవుతుందో లేదోననే ఆయోమయంలో కొందరు ఉన్నారు.

రిజిస్ట్రేషన్‌ చేసుకోకుంటే సీజ్‌ చేస్తాం
రిజిస్ట్రేషన్‌ చేసుకోని బీఎస్‌–4 వాహనాలు ఆదిలాబాద్‌ జిల్లాలో 3,684 ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు విధించింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే తుక్కు కిందికి అమ్ముకోవాల్సి ఉంటుంది. అలాంటి వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం.  – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement