ఉద్యాననగరిలో సొంత వాహనం తప్పనిసరి. ఇంట్లో రెండు మూడు వాహనాలకు తక్కువ ఉండవు. ఎక్కడికి వెళ్లాలన్నా వాటి మీదే. అయితే నగర సమస్యలు సొంత వాహనం పెద్ద భారమనే విధంగా చేస్తున్నాయి. గత రెండేళ్ల వాహన రిజిస్ట్రేషన్లు దీనినే స్పష్టంచేస్తున్నాయి.
సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో వాహనాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ 20 శాతం తగ్గిపోయిందని రవాణా శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 7.20 లక్షల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, 2017–18లో ఈ సంఖ్య 5.69 లక్షలకు పడిపోవడం గమనార్హం. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడం, భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు, పార్కింగ్ లేమి, మెట్రోరైలు మార్గం విస్తరణ, అందుబాటులో క్యాబ్ సేవలు ఉండడం తదితర కారణాలతో వాహనాల కొనుగోలుపై నగరవాసుల్లో అనాసక్తి నెలకొంది.
ట్రాఫిక్ రద్దీతో సతమతం
పెరుగుతున్న వాహనాల సంఖ్యతో రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయి కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. రద్దీ సమయాల్లో వాహనాల సగటు వేగం 10 కిలోమీటర్లకు పడిపోతోంది. దీంతో వాహనాల నుంచి పొగ విపరీతంగా వాతావరణంలోకి విడుదలవుతుంది. ఈ సమస్యల వల్ల నగరవాసులు సిటీ బస్సులు, మెట్రో, క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
ఆదుకుంటున్న క్యాబ్‌లు
క్యాబ్స్ సేవలు విస్తరించడం, వాటి చార్జీలు కూడా దిగిరావడంతో నగరవాసులు వాటిలో ప్రయాణం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 2013–14లో 66,264 ట్యాక్సీలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1.57 లక్షలు. ఓలా, ఉబెర్ వంటి
పలు సంస్థలకు చెందిన ట్యాక్సీలు ఉండడం గమనార్హం. అలాగే ఇటీవల ఆశాకాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నగరంలో పార్కింగ్ చేసేందుకు సరైన స్థలం లేకపోవడం కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బీబీఎంపీతో పాటు బీడీఏ నగరంలో పార్కింగ్ స్థలలాను ఏర్పరచడంలో పూర్తిగా విఫలమయింది. గతేడాది జీఎస్టీ కూడా అమ్మకాలకు బ్రేక్ వేసిందని చాలామంది డీలర్లు చెబుతున్నారు.
రోజుకు 1600 వాహనాల నమోదు
వాహన విక్రయాల సగటు వార్షిక వృద్ధి రేటు 10 శాతంగా ఉంది. కానీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం అధికంగా వాహనాల కొనుగోలు జరిగింది. దేవనహళ్లి ఆర్‌టీవో కార్యాలయం బెంగళూరు పట్టణ విభాగానికి మారడంతో వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగింది. సగటున ప్రతి రోజు దాదాపు 1,600 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఇందులో 1,100 వరకు ద్విచక్రవాహనాలు ఉండగా, మరో 300 వరకు కార్లు. ఈ సంఖ్య ఇదేవిధంగా కొనసాగితే 2022లోగా నగరంలో వాహనాల సంఖ్య 1.08 కోట్లకు చేరుకుంటుంది.
మెట్రో సౌకర్యం
నగరంలో మెట్రో విస్తరణ వల్ల ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. 42 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ వల్ల రోజుకి 3.40 లక్షల మంది ప్రజలు సగటున ప్రయాణిస్తున్నారు. 2011లో ఒక రోజుకి 28,007 మంది సగటు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 3.40 లక్షలకు చేరుకుంది. ఈ కారణాలన్నింటి వల్ల కొత్తగా వాహనాల కొనుగోలుపై నగరవాసులు అనాసక్తి కనపరిచి, ఇతర ప్రయాణ మార్గాలను ఆశ్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment