మేయర్‌కు బుగ్గ కారేదీ!
- గన్‌మన్‌లూ లేరు
- సొంత వాహనంలోనే పర్యటనలు
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగర ప్రథమ పౌరురాలికి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. క్యాబినెట్ మినిస్టర్ హోదాతో దర్జాగా బుగ్గ కారులో తిరగాల్సిన ఆమె.. సొంత వాహనంలోనే నగర పర్యటనలు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి మూడు నెలలవుతున్నా.. గన్‌మన్ల జాడ కూడా లేదు. ఆకుల సుజాత నగర ప్రథమ పౌరురాలిగా జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం ఆమెకు బుగ్గకారును, ఇద్దరు గన్‌మన్లకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ బాధ్యతలు స్వీకరించి మూడు నెలలవుతున్నా ఈ సౌకర్యాలేవీ ఆమెకు అందలేదు. సొంత పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కారణంగానే మేయర్‌కు ఈ సౌకర్యాలు దక్కడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
‘నా వల్లే నీకు మేయర్ పదవి దక్కింది. నేను చెప్పినట్లు నడుచుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడే బుగ్గ కారు ఉపయోగించాలి. మిగిలిన సమయాల్లో సాదాసీదాగా ఉండాలి’ అని సదరు నేత సూచించినట్లు సమాచారం. ఆ నాయకుడు చెప్పినట్లే నడుచుకోవాల్సి వస్తోందని కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ కార్యక్రమానికైనా మేయర్ సొంత వాహనంలోనే వెళ్తున్నారు. ఎలాంటి సమావేశాలకైనా తన అనుమతి తీసుకునే హాజరు కావాలని ఆ ప్రజాప్రతినిధి హుకూం జారీ చేసినట్లు సమాచారం. కార్పొరేషన్‌ను శాసిస్తున్న సదరు నేతపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేయర్‌కు సంబంధం లేకుండానే వీక్లీ మార్కెట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు కార్పొరేషన్ అనుమతిని ఇప్పించినట్లు తెలుస్తోంది.