ఫిబ్రవరి 5న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో-2016 ప్రారంభం
ముంబై: ఆటో ఎక్స్‌పో-2016 ప్రదర్శన ఫిబ్రవరి 5న ప్రారంభం కానుంది. గతంతో పోలిస్తే ఈసారి దీనికి భారీ సంఖ్యలో సందర్శకులు రావచ్చని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఐదు రోజులపాటు ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా లోని ఇండియా ఎక్స్‌పో మార్ట్, ప్రగతి మైదాన్‌లో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో కార్యక్రమాన్ని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్(సియామ్), ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2014లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో కార్యక్రమానికి సగటున 1.25 లక్షల మంది వచ్చారు.
దీంతో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆటో ఎక్స్‌పో కార్యక్రమంగా అవతరించింది. 1.13 లక్షల సందర్శకులతో షాంఘై ఆటో ఎక్స్‌పో దీని తర్వాతి స్థానంలో నిలిచింది. త్వ రలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోను 6 లక్షల మంది సందర్శించవచ్చని సియామ్ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ అంచనా వేశారు. గత కార్యక్రమంలో ఉత్పన్నమైన అవాంతరాలు అధిగమిస్తూ, మెరుగైన సేవలను అందించడానికి అన్ని వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు.