భారీగా తగ్గిన జీఎస్టీ ..! | Eating out gets cheaper; GST rate on restaurants flat at 5% | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్లపై 5 శాతం జీఎస్టీ

Published Sat, Nov 11 2017 1:41 AM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM

Eating out gets cheaper; GST rate on restaurants flat at 5% - Sakshi

18 శాతం: చూయింగ్‌ గమ్, చాకొలెట్లు, కాఫీ, మార్బుల్స్, గ్రానైట్లు, దంత సంబంధిత ఉత్పత్తులు, క్రీమ్‌లు, శానిటరీ ఉత్పత్తులు, లెదర్‌ వస్తువులు, కృత్రిమ ఉన్ని, విగ్గులు, కుక్కర్లు, స్టవ్‌లు, డిటర్జెంట్, వాషింగ్‌ పౌడర్, రేజర్లు, బ్లేడ్లు, కత్తులు, స్టోరేజ్‌ వాటర్‌ హీటర్‌లు, బ్యాటరీలు, చేతి వాచీలు, పరుపులు, వైర్లు, కేబుళ్లు, ఫర్నిచర్, షాంపూ, హెయిర్‌ క్రీమ్, హెయిర్‌ డై, మేకప్‌ వస్తువులు, ఫ్యాన్లు, ల్యాంపులు, రబ్బరు ట్యూబులు 28 నుంచి 18 శాతానికి చేరాయి.

12 శాతం: కండెన్స్‌డ్‌ మిల్క్, రిఫైన్డ్‌ చక్కెర, పాస్తా కర్రీ పేస్టు, మధుమేహ ఆహారం, మెడికల్‌ స్థాయి ఆక్సిజన్, ప్రింటింగ్‌ ఇంక్, హ్యాండ్‌ బ్యాగ్‌లు, టోపీలు, కళ్లద్దాల ఫ్రేమ్‌లు, వెదురు ఫర్నిచర్‌ మొదలైనవి 18 నుంచి 12 శాతానికి చేరాయి.

6 శాతం: ఆలూ పిండి, చట్నీ పౌడర్, పేలాల ఉండలు, చమురు వెలికితీతలో వెలువడే పొడి సల్ఫర్, ఫ్లై యాష్‌ 18 నుంచి 6 శాతానికి వచ్చాయి.

5  శాతం: ఇడ్లీ, దోశ తయారీ వస్తువులు, లెదర్, కొబ్బరి పీచు, చేపలు పట్టే వల, ఉన్ని దుస్తులు, కొబ్బరి తురుము 12 నుంచి 5 శాతానికి చేరాయి. గువార్‌ మీల్, హాప్‌కోన్, కొన్ని ఎండబెట్టిన కూరగాయలు, చేపలు, కొబ్బరి చిప్పలు, 5 శాతం నుంచి పన్ను రహిత పరిధిలోకి చేరాయి

     
గువాహటి: వస్తు, సేవల పన్ను శ్లాబుల్లో జీఎస్టీ కౌన్సిల్‌ కీలక మార్పులు చేసింది.  28% పన్ను భారాన్ని తగ్గించింది. ఇప్పటివరకు 28% పన్ను పరిధిలో 228 వస్తువులుండగా వాటిని 50కి కుదించింది. అంటే 178 వస్తు, సేవలపై పన్నును 18% పరిధిలోకి మార్చింది. ఇప్పటివరకు ఏసీ రెస్టారెంట్లపై 18%, నాన్‌ ఏసీ రెస్టారెంట్లపై 12% జీఎస్టీ విధిస్తుండగా ఏసీ, నాన్‌ ఏసీ రెస్టారెంట్లపై పన్ను భారాన్ని 5%  తగ్గించింది. ఈ మార్పులతో వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. నవంబర్‌ 15 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఈ మార్పులు తమ ఒత్తిడి కారణంగానే అని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం పేర్కొనగా.. కేంద్రం అహంకారాన్ని తగ్గించుకుని వాస్తవ, సులభమైన పన్నును అందించాలని రాహుల్‌ సూచించారు.   

రెస్టారెంట్లకు భారీ లాభం
ప్రస్తుతం నాన్‌–ఏసీ రెస్టారెంట్లలో భోజనంపై 12%, ఏసీ రెస్టారెంట్లలో 18% జీఎస్టీ అమలవుతోంది. వీటన్నింటికీ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ ఉంటుంది. ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను రెస్టారెంట్లు వినియోగదారులకు ఇవ్వట్లేదు. దీనిపై గువాహటి సమావేశంలో చర్చించిన మండలి ఏసీ, నాన్‌–ఏసీ రెస్టారెంట్లను 5% పరిధిలోకి తీసుకొచ్చి ఐటీసీని ఎత్తేసింది.  

28 శాతంలో 50 వస్తువులే
జీఎస్టీలో తాజా మార్పులకు ముందు 228 వస్తువులు 28% పన్ను పరిధిలో ఉండేవి. ఇందులో చాలావరకు నిత్యావసర వస్తువలున్నందున తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ పన్ను పరిధిలోని మెజారిటీ వస్తువులను జీఎస్టీ మండలి 18% పరిధిలోకి తీసుకొచ్చింది. వెట్‌ గ్రైండర్లు, సాయుధ వాహనాలను 28 నుంచి 12%పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటుగా.. ఆరు వస్తువులను 18 నుంచి ఐదు శాతానికి, ఎనిమిది వస్తువులను 12 నుంచి ఐదు శాతానికి మార్చిన మండలి.. ఆరు వస్తువులను ఐదు నుంచి పన్ను పరిధిలోనే లేకుండా నిర్ణయించింది. ప్రస్తుతం 28% పరిధిలో లగ్జరీ వస్తువులతోపాటు పాన్‌మసాలా, సిగరెట్లు, సిగార్లు, పొగాకు ఉత్పత్తులు, సిమెంట్, పెయింట్లు, పర్‌ఫ్యూమ్‌లు, ఏసీలు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలతోపాటుగా శీతల పానీయాలు మొదలైనవి మాత్రమే ఉన్నాయి.

కొంతకాలంగా తగ్గించాలనుకుంటున్నాం
జీఎస్టీ ద్వారా  వ్యాపారులపై పడుతున్న భారం తగ్గించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. ‘జీఎస్టీ వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నాల్లో భాగంగా.. వివిధ వస్తువుల రేట్లను జీఎస్టీ మండలి సమీక్షిస్తూ వస్తోంది. చివరి మూడు సమావేశాల్లోనూ 28 శాతం పన్ను పరిధిపై చర్చ జరిగింది. ఇందులోని కొన్ని వస్తువులను 28 నుంచి 18 శాతానికి లేదా అంతకన్నా తక్కువకు మార్చాలని అనుకున్నాం’ అని జైట్లీ తెలిపారు. మార్చిన పన్ను పరిధి వల్ల ఏడాదికి రూ.20వేల కోట్ల నష్టం కలుగుతుందని బిహార్‌ ఉప ముఖ్య మంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. పన్ను పరిధిలో లేని వారికి రిటర్న్స్‌ ఫైలింగ్‌ ఆలస్యమైతే ప్రస్తుతం రోజుకు రూ.200 జరిమానాను వసూలు చేస్తుండగా దీన్ని రూ.20 కు తగ్గిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా తెలిపారు. జీఎస్టీ అమలు భారాన్ని తగ్గించేందుకు రిటర్న్‌ల ఫైలింగ్‌ విధానంలోనూ మార్పులు తీసుకొచ్చామన్నారు మిగిలిన వారికి ఈ జరిమానాను రోజుకు రూ.50కి మార్చామన్నారు. తయారీదారులు, వ్యాపారులపై ఒక్కోశాతం పన్ను రేటు కొనసాగుతుందని అధియా తెలిపారు. గతంలో రూ. 75 లక్షలున్న కాంపోజిట్‌ స్కీమ్‌ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. ఎమ్మార్పీపై అదనంగా జీఎస్టీ వసూలు చేయరాదన్నారు.

విపక్షాలకు భయపడ్డారు: చిదంబరం
న్యూఢిల్లీ: విపక్షాలు, ప్రజలనుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో భయపడిన కేంద్రం.. తప్పనిసరి పరిస్థితుల్లోనే జీఎస్టీలో మార్పులు చేసిందని కాంగ్రెస్‌ నేత చిదంబరం విమర్శించారు. ‘నేటి జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో మార్పులుంటాయనేది ఊహించిందే ప్రభుత్వం భయపడింది. మా డిమాండ్లకు తలొగ్గింది’ అని అన్నారు. జీఎస్టీ కారణంగా మార్పు తీసుకొచ్చే మంచి అవకాశాన్ని దేశం కోల్పోయిందంటూ పంజాబ్‌ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్, కర్ణాటక మంత్రి కృష్ణగౌడ ఆరోపించారు. ‘మీ అసమర్థతను గుర్తించండి. పొగరును తగ్గించుకోండి. దేశ ప్రజల మాటను వినండి’ అని రాహుల్‌ విమర్శించారు. జీఎస్టీ విషయంలో కనీస ఆలోచన లేకుండా ఆర్థిక మంత్రి జైట్లీ నిర్ణయం తీసుకున్నారని యశ్వంత్‌ సిన్హా  విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement