జీఎస్టీ రేట్లపై గుడ్‌న్యూస్‌? | Expect A Slash In GST Rates Soon | Sakshi
Sakshi News home page

జీఎస్టీ రేట్లపై గుడ్‌న్యూస్‌?

Published Fri, Jun 8 2018 10:55 AM | Last Updated on Fri, Jun 8 2018 11:46 AM

Expect A Slash In GST Rates Soon - Sakshi

న్యూఢిల్లీ : జీఎస్టీ రేట్లపై మరో గుడ్‌న్యూస్‌ వినబోతున్నారు. జీఎస్టీ పన్ను రేట్లు అత్యధికంగా ఉన్నాయంటూ.. ఇప్పటికే పలు వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతుండటంతో ఆ పన్ను రేట్లను తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ కృషిచేస్తోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ కృషిచేస్తుందని తెలిసింది. కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ చేపట్టిన 7వ ఎడిషన్‌ ఢిల్లీ ఎస్‌ఎంఈ ఫైనాన్స్‌ సమిట్‌లో ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా చెప్పారు. జీఎస్టీ రేట్లను హేతుబద్ధం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ పనిచేస్తోంది.. దీనిపై ప్రభుత్వం నుంచి ఓ పెద్ద ప్రకటన వచ్చేస్తోంది అని శివ్‌ ప్రతాప్‌ అన్నారు.

ప్రస్తుతం జీఎస్టీ నాలుగు శ్లాబుల్లో అమలవుతోంది. అవి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. కానీ ఈ రేట్లు అ​త్యధిక మొత్తంలో ఉన్నాయని నిరసన వ్యక్తమవుతోంది. జనవరి నెల ప్రారంభంలో జీఎస్టీ కౌన్సిల్‌ 54 సర్వీసులు, 24 ఉత్పత్తుల రేట్లను తగ్గించింది. వీటిలోముఖ్యంగా హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. అంతేకాక 2017 నవంబర్‌ సమావేశంలో కూడా 28 శాతం కేటగిరీలో ఉన్న 178 ఉత్పత్తులను, ఆ శ్లాబు నుంచి తొలగించింది. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పెద్ద ఎత్తున్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ధరలను అదుపులో ఉంచవచ్చని పలువురు పేర్కొంటున్నారు. కేంద్రం సైతం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement