సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ రాబడులను పెంచడం, దీటైన పన్ను వ్యవస్థగా మలచడం కోసం ఏర్పాటైన అధికారుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. విలాసవంతమైన వస్తువులపై అధిక పన్ను విధించాలని, జీఎస్టీలో ప్రస్తుతమున్న5 శాతం, 12, 18, 28 శాతం శ్లాబ్‌ల స్ధానంలో కొత్తగా 10 శాతం, 20 శాతంతో రెండు శ్లాబులనే తీసుకురావాలని సిఫార్సు చేసింది. కాస్మెటిక్స్, గ్యాంబ్లింగ్, రిక్రియేషనల్ సేవల వంటి వాటిపై సెస్ విధింపు, పాఠశాల విద్య, అత్యున్నత వైద్య సేవలు, ఏసీ ప్రజా రవాణాలకు ఇచ్చే మినహాయింపులను ఉపసంహరించాలని సూచించింది. జీఎస్టీ కౌన్సిల్‌కు గత వారం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో అధికారుల కమిటీ ఈ మార్పులను సూచించింది. ఇక లగ్జరీ వస్తువులపై ఎంత శాతం పన్ను విధిస్తారనే దానిపై కమిటీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతమున్న 28 శాతం శ్లాబ్‌ను వీటికి వర్తింపచేయబోరని సమాచారం.
సెస్‌రేట్లను పెంచాలని సైతం ఈ కమిటీ సూచించింది. తాము చేసిన సూచనలపై చర్చించి జీఎస్టీ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ వ్యవస్థను సమర్ధంగా రూపొందేలా కమిటీ పలు సూచనలు చేసిందని, జీఎస్టీ లొసుగులతో ఏటా రూ 20,000 కోట్లకు పైగా వాటిల్లుతున్న నష్టాలను అధిగమించేలా దీటైన సిఫార్సులు చేసిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంతో వినిమయం తగ్గడం వల్లే పన్ను రాబడులు గణనీయంగా తగ్గాయని జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, జీఎస్టీ అధికారులు కొందరు చెబుతున్నారు. సెస్ ఫండ్ చాలినంత లేకపోవడంతో అక్టోబర్, నవంబర్‌లకు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని కేంద్రం చెల్లించలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment