జీఎస్టీపై ఇంకా గందరగోళం | confusion on gst bill | Sakshi
Sakshi News home page

జీఎస్టీపై ఇంకా గందరగోళం

Published Wed, Jun 14 2017 5:23 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

జీఎస్టీపై ఇంకా గందరగోళం - Sakshi

జీఎస్టీపై ఇంకా గందరగోళం

న్యూఢిల్లీ: కేంద్ర వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీన్ని ఇప్పట్లో అమలుచేసే పరిస్థితుల్లో లేమని ఇటు పారిశ్రామిక వర్గాలు, బ్యాంకింగ్‌ వర్గాలు, అటు అకౌంటింగ్‌ వర్గాలు చేతులు ఎత్తేస్తున్నాయి. ‘ఒకే దేశం ఒకే పన్ను’ విధానంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. 15, 18 శాతం, అంటే రెండే స్లాబుల్లో జీఎస్టీ పన్నును అమలు చేస్తామని ముందుగా చెప్పింది. అనేక పర్యాయాల కసరత్తు అనంతరం నాలుగు స్లాబ్‌లతో పన్నును ఖరారు చేసింది. ప్రపంచంలో నూజిలాండ్‌ దేశం ఒకే 15 శాతం స్లాబ్‌తో జీఎస్టీ పన్నును సక్రమంగా అమలుచేస్తూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ పోతుంటే భారత్‌ నాలుగు స్లాబ్‌తో దేశంలోని అన్ని వర్గాల్లో గందరగోళం సష్టించింది.

భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తి ఉండాలికనుక జీఎస్టీనీ, సీజీఎస్టీగా కేంద్రం, ఎస్‌జీఎస్టీగా రాష్ట్రాల మధ్య విభజించాల్సి వచ్చింది. ఓ రాష్ట్రాంలోని ఉక్కు కర్మాగారం ఉత్పత్తిచేసే ఐరన్‌ రాడ్లను అదే రాష్ట్రానికి చెందిన వినియోగదారుడికి విక్రయించినట్లయితే ఆ ఉక్కు కంపెనీ ఒక పన్ను మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఖాతాలో, మరో మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. పారిశ్రామిక కంపెనీలు పన్నులకు సంబంధించి ఏడాదికి 13 సార్లు రిటర్న్‌లు సమర్పిస్తుండగా, జీఎస్టీ అమల్లోకి వస్తే ఏడాదికి 37 సార్లు రిటర్న్‌లు సమర్పించాల్సి ఉంటుంది. అంటే నెలకు మూడేసి రిటర్న్‌లతోపాటు ఏడాది రిటర్న్‌లను సమర్పించాల్సి ఉంటుంది.

ఇన్ని రిటర్న్‌లు సమర్పించడమంటే తమకు అధిక శ్రమ, అధిక సిబ్బందిని అవసరమవుతారని పలు రంగాలు వాపోతున్నాయి. జీఎస్టీనీ కచ్చితంగా లెక్కగట్టాలి కనుక ప్రతి వస్తువు కొనుగోలు, అమ్మకాల వివరాలను కచ్చితంగా కంపెనీలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అకౌంట్ల కోసం ఎక్కువ వరకు కంపెనీలు ‘టాలీ’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇక జీఎస్‌టీని అమలు చేసేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడదని, కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్‌ రంగం కూడా సాఫ్ట్‌వేర్‌ను మార్చుకోవాల్సి వస్తుందని ఆ రంగానికి చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు.

జీఎస్టీలో తాజాగా చోటుచేసుకున్న మార్పులు సగం పారిశ్రామిక కంపెనీలకు తెలియవని, తెల్సిన కంపెనీలకు కూడా తమ సరుకులు ఏ స్లాబ్‌ పరిధిలోకి తెలియని స్థితిలోనే ఉన్నాయని ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. జూలై ఒకటవ తేదీ నుంచి కాకుండా సెప్టెంబర్‌ నెల నుంచి జీఎస్టీని అమలు చేస్తే బాగుంటుందని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ఒక్క జీఎస్టీని తప్ప ఏ పన్నులను అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వివిధ ఉత్పత్తులపై సెస్‌లు, అదనపు సుంకాలు అలాగే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement