![CM Chandrababu Naidu in meeting with ministers](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/babu.jpg.webp?itok=E6rxWgAC)
మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య
రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి మైనస్ 2.94 శాతంగా ఉంది
మిగతా అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి సానుకూలమే
కేంద్ర పథకాల అనుసంధానంతో బడ్జెట్ రూపొందించాలి
అర్జీల్లో 60.7 శాతమే పరిష్కారం
ఏప్రిల్‌లో గ్రామాల్లో అధికారుల బస
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉందని.. ఉన్న పరిశ్రమలు సైతం మూతబడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి ఎంతో కొంత పాజిటివ్‌గా ఉంటే.. ఏపీలో మాత్రం మైనస్ 2.94 శాతంగా ఉందని వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ముందస్తు అంచనాల మేరకు రాష్ట్ర వృద్ధి 12.94 శాతంగా ఉన్నప్పటికీ.. పారిశ్రామిక వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ వెనకబడి ఉందన్నారు.
దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని, దీన్ని అధిగమించేందుకు పాలనలో స్పీడ్ పెంచి వినూత్న ఆలోచనలు చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌కు కొంత మంది వ్యక్తులు, కార్యదర్శులు ఏడాది నుంచి ఆర్నెల్లు, మూడు నెలలు సమయం తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికేతర ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదన్నారు. వ్యవస్థను మెరుగు పరిచేందుకే ఇటీవల ఫైళ్ల క్లియరెన్స్ డేటా విడుదల చేసినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ పథకాలతో రాష్ట్ర బడ్జెట్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు.
కేంద్ర పథకాల నుంచి రెండు శాతం నిధులు తెస్తే రాష్ట్రానికి పెద్ద బలం చేకూరుతుందన్నారు. యూసీలు అందచేసి మార్చిలోగా అదనంగా నిధులు రాబట్టేలా అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఏటా 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఏటా 15 శాతం వృద్ధి సాధిస్తేనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలమని చెప్పారు.
అటవీ మార్గంలో శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు అటవీ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎనిమిది నెలల్లోనే రూ.22,507 కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు.
వాట్సాప్‌లో మరిన్ని సేవలు..
రాబోయే రోజుల్లో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం వాట్సాప్‌లో 161 సేవలిస్తున్నామని, రాబోయే 45 రోజుల్లో 500 సేవలు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. టీటీడీ సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తెస్తామన్నారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేకరించాలన్నారు.
వాట్సాప్‌లో క్యూ ఆర్ కోడ్ లేదా పౌరుల ఆధార్ అథెంటిఫికేషన్ కోరే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అఖిల భారత సర్విస్ అధికారుల నుంచి గ్రూప్ వన్ అధికారుల వరకు ఏప్రిల్‌లో గ్రామాల్లో బస చేయాలని, దీనికి సంబం«ధించి త్వరలోనే విధివిధానాలను సీఎస్ జారీ చేస్తారని తెలిపారు. గతంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమాలను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.
అంతకు ముందు అర్జీల పరిష్కారంపై సీఎస్ విజయానంద్ ప్రజెంటేషన్ ఇస్తూ ఇప్పటి వరకు 7,42,301 అర్జీలు వస్తే 60.7 శాతమే పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాల నుంచే ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, పల్నాడు, కృష్ణా జిల్లాల నుంచి అతి తక్కువ ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
వాట్సాప్‌లోనే అన్ని రకాల ధ్రువపత్రాలిస్తాం
మంత్రి లోకేశ్ వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రజలకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ కోసం శాఖలన్నీ తమ సమాచారాన్ని ఆర్టీజీఎస్‌లోని డేటా లేక్‌కు అనుసంధానం చేయాలని కోరారు.
వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయా లంటే అన్ని శాఖల సహకారం అవసరమన్నారు. రేషన్ కార్డులు మొదలు అన్నీ కూడా ప్రజలకు సులభంగా ఆన్‌లైన్‌లోనే అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని.. తద్వారా క్యూఆర్ కోడ్‌తోనే రేషన్ పొందే సదుపాయం లభిస్తుందని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సాప్ ద్వారా మదింపు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
వేధింపులు, రెడ్‌బుక్‌తోనే తిరోగమనం
ఒకవైపు పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటూ.. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఏపీ పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉందని.. అధికారుల్లో స్పీడ్ పెరగాలని వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూపించడమే ఈ దుస్థితికి కారణమని పేర్కొంటున్నారు.
రెడ్‌బుక్ పాలన చేసింది మీరు..! అధికారంలోకి రాగానే దాడులు, అరెస్టులతో విధ్వంసానికి తెర తీసింది మీరు..! ఇక మేం ఏం చేయగలం..? అని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మెరుగు పడాల్సింది తమ పనితీరు కాదని.. ప్రభుత్వంలో ఉన్న వారే కక్షపూరిత ధోరణిని విడనాడాలని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి పరిశ్రమ, ప్రతి టెండర్‌ను ప్రభుత్వ పెద్దలకు నచ్చినవారికే కట్టబెడుతూ అర్హతలు లేకపోయినా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, దీనివల్ల పెద్ద పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి రెడ్‌బుక్ పాలన సాగిస్తామని పదేపదే ప్రకటనలు చేయడం ఏమిటని అధికారులు విస్తుపోతున్నారు. తమ మాట వినని పారిశ్రామికవేత్తలను వేధిస్తూ అరెస్టులకూ వెనుకాడకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో పర్సంటేజీల కోసం కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ యాజమాన్యాన్ని తీవ్రంగా వేధించిన టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు తమకు కప్పం చెల్లించలేదని ఫ్యాక్టరీపై దాడులకు తెగబడటాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు సైతం తీసుకోలేదు. ఇక విశాఖలో కాలుష్య నియంత్రణ మండలిని ముందుపెట్టి అరవిందో ఫార్మాను తీవ్రంగా వేధించారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న సజ్జన్ జిందాల్‌ను ముంబై మోడల్ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తలొగ్గకపోవడంతో ఆయన సెలవుపై వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చాక డజను మందికిపైగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్షపూరితంగా వేధింపులకు దిగింది. ఇక ఏ నియోజకవర్గంలోనూ కూటమి ఎమ్మెల్యేల ఆమోదం లేకుండా ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు. జ్యుడీషియల్ ప్రివ్యూను ఎత్తివేసి నచ్చినోళ్లకు పనులు కట్టబెడుతున్నారు. ఇవన్నీ చేస్తూ ప్రభుత్వ పెద్దలు తిరిగి తమకు క్లాస్ తీసుకోవడం ఏమిటని అధికార యంత్రాంగం విస్తుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment