
న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో 2022 ఇదే నెలతో పోల్చితే 12 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ ఆర్థిక క్రియాశీలత, వినియోగ వ్యయాల పటిష్టత దీనికి కారణం. అయితే 2023 జనవరితో పోల్చితే (రూ.1.55 లక్షల కోట్లు. జీఎస్‌టీ ప్రవేశపెట్టిన 2017 జూలై 1 తర్వాత రెండవ అతి భారీ వసూళ్లు) వసూళ్లు తగ్గడం గమనార్హం. అయితే ఫిబ్రవరి నెల 28 రోజులే కావడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. విభాగాల వారీగా చూస్తే...
► మొత్తం రూ.1,49,577 కోట్ల వసూళ్లలో సెంట్రల్ జీఎస్‌టీ రూ.27,662 కోట్లు.
► స్టేట్ జీఎస్‌టీ రూ.34,915 కోట్లు.
► ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.75,069 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.35,689 కోట్లుసహా).
► సెస్ రూ.11,931 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.792 కోట్లుసహా). కాగా, జీఎస్‌టీ ప్రారంభమైన తర్వాత సెస్ వసూళ్లు ఈ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి.
► ‘ఒకే దేశం– ఒకే పన్ను’ నినాదంతో 2017 జూలైలో పలు రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రారంభమైన జీఎస్‌టీ వ్యవస్థలో 2022 ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1,67,650 కోట్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment