
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థ మరింత సరళీకరణ అవసరమని పారిశ్రామిక వేదిక– సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ స్పష్టం చేశారు. విద్యుత్‌తో పాటు ఇంధనాన్ని కూడా జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. దీనివల్ల పరిశ్రమను మరింత పోటీ పరిస్థితుల్లో నిలబెట్టవచ్చని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. జీఎస్‌టీ కింద ఉన్న పన్ను శ్లాబుల సంఖ్యను మూడుకు తగ్గించాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం మినహాయించిన విభాగంకాకుండా, జీఎస్‌టీ 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను శ్లాబ్‌లను కలిగి ఉంది. బంగారం, విలువైన, పాక్షిక విలువైన రాళ్లకు ప్రత్యేక పన్ను రేట్లు అమలవుతున్నాయి. నిత్యావసరాలపై 5 శాతం పన్ను రేటు మొదటిది. కార్లు, డీమెరిట్, లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శాతం అత్యధిక రేటు అమలవుతోంది. మధ్యస్థంగా 12, 18 శాతం రేట్లు అమలవుతున్నాయి. క్యాసినోలు, గుర్రపు పందాలు ఆన్‌లైన్ గేమింగ్ సేవలపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు.
రూపాయి అనిశ్చితికి ఆర్‌బీఐ చెక్
కాగా, డాలర్ మారకంలో రూపాయి ఒడుదుడుకులను నిరోధించి స్థిరీకరణ చేయగలిగిన సామర్థ్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి ఉందని సీఐఐ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు. ఇందుకు తగిన విదేశీ మారకపు నిల్వలు ఆర్‌బీఐ వద్ద ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఏదోఒకరోజు రూపాయి తన స్వంత స్థాయిని కనుగొనవలసి ఉంటుందని మేము నమ్ముతున్నాము. అది భారత్ స్వంత పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ‘‘అయితే మారకపు విలువ అస్థిరతను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆర్‌బీఐ ఇందుకు ప్రయ త్నిస్తుందని విశ్వసిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం...
అధిక ద్రవ్యోల్బణం గురించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని అన్నారు. ‘‘మీరు ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే, ఇందుకు ఇంధనం, ఆహార ధరలు కారణంగా కనబడుతున్నాయి. రుతుపవన పరిస్థితి బాగుంటుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ పరిణామం కనీసం ఆహార ధరలను తగ్గడానికి దోహదపడుతుంది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్న ఇంధన ధర కూడా తగ్గడం ప్రారంభమవుతుందని భావిస్తునట్లు పేర్కొన్నారు.
భారత్ పరిస్థితి బెటర్...
భారత్ ఎకానమీపై బజాజ్ ఏమన్నారంటే... పరిశ్రమల సామర్థ్య వినియోగం 74–75 శాతానికి చేరుకుంది. లాజిస్టిక్స్, కెమికల్స్, కమోడిటీలు, నిర్మాణ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు కీలక చర్యల కారణంగా భారతదేశ ఎకానమీ అనేక ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. గత కొన్ని త్రైమాసికాల్లో డిమాండ్ తిరిగి పుంజుకోడాన్ని మేము చూస్తున్నాము. అయితే గత నెలా, రెండు నెలల్లో కొంత నిరాశాజనక ఫలితాలు ఉన్నా... తిరిగి భారీగా పుంజుకుంటుందని భావిస్తున్నాము. ఆశాజనక మంచి రుతుపవనాలు, ద్రవ్యోల్బణం తగ్గుదల వల్ల భారత్ బలమైన వృద్ధిని తిరిగి చూడటం ప్రారంభిస్తుందని విశ్వసిస్తున్నాం.