హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్‌వర్క్‌ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్‌ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్‌ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.
- హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
ఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్‌లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్‌లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది.
మళ్లీ హమారా బజాజ్..
2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.
డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్‌లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్‌లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం.
పెద్ద కంపెనీల మధ్యే పోటీ..
తదుపరితరం చేతక్‌ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్‌లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.
2024 నవంబర్‌లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్‌లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్‌లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది.
క్యూలో మరిన్ని దిగ్గజాలు..
2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్స్ ఉన్నాయి.
2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment