CII President
-
కనిష్ట శ్లాబు వారికి ఐటీ ఊరట కల్పించాలి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ స్థాయి శ్లాబ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పంచే అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సంజీవ్ పురి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భూ, కారి్మక, విద్యుత్, వ్యవసాయ రంగ సంస్కరణలన్నింటిని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంస్థాగత వేదికను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో దఫా ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయడానికి సంకీర్ణ రాజకీయాలనేవి అడ్డంకులు కాబోవని భావిస్తున్నట్లు పురి చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో విధానాలను విజయవంతంగా అమలు చేయడం, దేశ ఎకానమీ మెరుగ్గా రాణిస్తుండటం వంటి అంశాలు తదుపరి సంస్కరణలను వేగవంతం చేసేందుకు దన్నుగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు. -
వస్తు సేవల పన్ను వ్యవస్థ సరళీకరణ అవశ్యం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ మరింత సరళీకరణ అవసరమని పారిశ్రామిక వేదిక– సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ స్పష్టం చేశారు. విద్యుత్‌తో పాటు ఇంధనాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. దీనివల్ల పరిశ్రమను మరింత పోటీ పరిస్థితుల్లో నిలబెట్టవచ్చని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. జీఎస్టీ కింద ఉన్న పన్ను శ్లాబుల సంఖ్యను మూడుకు తగ్గించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మినహాయించిన విభాగంకాకుండా, జీఎస్టీ 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను శ్లాబ్‌లను కలిగి ఉంది. బంగారం, విలువైన, పాక్షిక విలువైన రాళ్లకు ప్రత్యేక పన్ను రేట్లు అమలవుతున్నాయి. నిత్యావసరాలపై 5 శాతం పన్ను రేటు మొదటిది. కార్లు, డీమెరిట్, లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శాతం అత్యధిక రేటు అమలవుతోంది. మధ్యస్థంగా 12, 18 శాతం రేట్లు అమలవుతున్నాయి. క్యాసినోలు, గుర్రపు పందాలు ఆన్లైన్ గేమింగ్ సేవలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. రూపాయి అనిశ్చితికి ఆర్బీఐ చెక్ కాగా, డాలర్ మారకంలో రూపాయి ఒడుదుడుకులను నిరోధించి స్థిరీకరణ చేయగలిగిన సామర్థ్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఉందని సీఐఐ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు. ఇందుకు తగిన విదేశీ మారకపు నిల్వలు ఆర్బీఐ వద్ద ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఏదోఒకరోజు రూపాయి తన స్వంత స్థాయిని కనుగొనవలసి ఉంటుందని మేము నమ్ముతున్నాము. అది భారత్ స్వంత పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ‘‘అయితే మారకపు విలువ అస్థిరతను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ ఇందుకు ప్రయ త్నిస్తుందని విశ్వసిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం... అధిక ద్రవ్యోల్బణం గురించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని అన్నారు. ‘‘మీరు ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే, ఇందుకు ఇంధనం, ఆహార ధరలు కారణంగా కనబడుతున్నాయి. రుతుపవన పరిస్థితి బాగుంటుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ పరిణామం కనీసం ఆహార ధరలను తగ్గడానికి దోహదపడుతుంది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్న ఇంధన ధర కూడా తగ్గడం ప్రారంభమవుతుందని భావిస్తునట్లు పేర్కొన్నారు. భారత్ పరిస్థితి బెటర్... భారత్ ఎకానమీపై బజాజ్ ఏమన్నారంటే... పరిశ్రమల సామర్థ్య వినియోగం 74–75 శాతానికి చేరుకుంది. లాజిస్టిక్స్, కెమికల్స్, కమోడిటీలు, నిర్మాణ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు కీలక చర్యల కారణంగా భారతదేశ ఎకానమీ అనేక ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. గత కొన్ని త్రైమాసికాల్లో డిమాండ్ తిరిగి పుంజుకోడాన్ని మేము చూస్తున్నాము. అయితే గత నెలా, రెండు నెలల్లో కొంత నిరాశాజనక ఫలితాలు ఉన్నా... తిరిగి భారీగా పుంజుకుంటుందని భావిస్తున్నాము. ఆశాజనక మంచి రుతుపవనాలు, ద్రవ్యోల్బణం తగ్గుదల వల్ల భారత్ బలమైన వృద్ధిని తిరిగి చూడటం ప్రారంభిస్తుందని విశ్వసిస్తున్నాం. -
సీఐఐ ప్రెసిడెంట్‌గా సంజీవ్ బజాజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రెసిడెంట్‌గా బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ బాధ్యతలు స్వీకరించారు. 2022–23 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019–20లో సీఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించారు. బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), అలియాంజ్ ఎస్ఈ ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు. సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్.దినేశ్ నియమితులయ్యారు. -
రూ. 3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరం
న్యూఢిల్లీ: కరోనా కష్టాల్లో కూరుకుపోయిన ఎకానమీకి ఊతం ఇవ్వడానికి రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరమని ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఉద్దీపనలో భాగంగా జన్ ధన్ అకౌంట్ల ద్వారా కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదలాయింపు జరపాలనీ ఆయన సూచించారు. బ్రిటన్ తరహాలో వ్యాక్సినేషన్ సత్వర విస్తృతికి ‘వ్యాక్సిన్ జార్’ను (లేదా మంత్రి) నియమించాలని సిఫారసు చేశారు. దేశ ఆర్థిక పురోగతి విషయమై విలేకరులతో ఆయన మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి... ► భారత్ ఎకానమీ వినియోగ ఆధారితమైనది.ఈ డిమాండ్‌ను మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో నగదు ప్రత్యక్ష బదలాయింపు కీలకమని సీఐఐ భావిస్తోంది. ► ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద కేటాయింపులు మరింత పెంచాలి. ► వస్తు సేవల పన్ను(జీఎస్టీ) తగ్గింపులు డిమా ండ్ పురోగతికి దోహదపడుతుంది. గృహ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీలు అవసరం. గతేడాది తరహాలో ఎట్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజనను 2022 మార్చి 31 వరకూ పొడిగించాలి. ► లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ఎంఈ) సహా కంపెనీలకు సకాలంలో తగిన అన్ని చెల్లింపులూ జరిగేలా చర్యలు తీసుకోవాలి. ► వృద్ధికి సంబంధించి వ్యయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సత్వర పురోగతి ఉండాలి. ► దేశంలోని వయోజనులు అందరికీ 2021 డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ పుర్తికావాలి. ఇందుకు రోజుకు సగటున కనీసం 71.2 లక్షల డోసేజ్ వ్యాక్సినేషన్ జరగాలి. ఈ దిశలో ఏజెన్సీలు, రాష్ట్రాలు, కేంద్రం, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సమన్వయ సహకారం అవసరం. వ్యాక్సినేషన్ ఆవశ్యకత ప్రచారానికి క్రీడా, సినీ ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి. ► కోవిడ్–19 మూడవ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పాలనా యంత్రాంగాలు, ప్రైవేటు రంగ భాగస్వాములు దృష్టి సారించాలి. ► బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. ► భవిష్యత్‌లో ఎటువంటి మహమ్మారినైనా తట్టుకుని నిలబడ్డానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. -
ఎకానమీని గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్!?
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్ తప్పదని భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. దిగువ మధ్య తరగతి సమాజాన్ని అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతను ఇవ్వడానికి సహాయక ప్యాకేజ్ని ప్రకటించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చిన్న పరిశ్రమలకు హామీ రహిత రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇచ్చే పరిమాణాన్ని రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచే విషయాన్ని పరిశీలించాలని ఒక ఇంటర్వ్యూలో కోరారు. కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్‌లో భాగంగా గత ఏడాది రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ ఏప్రిల్, మే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపివేసిందని కొటక్ అన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో లోబేస్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను కొటక్ ప్రస్తావిస్తూ, ‘‘నిజానికి బేస్ ఎఫెక్ట్‌తో చూసుకున్నా, వృద్ధి రెండంకెల దిగువనే నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితిని వేచి చూడాల్సి ఉంది’’ అని అన్నారు. ఇప్పటికి ప్యాకేజ్‌లు ఇలా... 2020లో కేంద్రం కరోనాను ఎదుర్కొనడానికి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ని ప్రకటించింది. ఈ విలువ రూ. 27.1 లక్షల కోట్లు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ విలువ 13 శాతం అని కేంద్రం ప్రకటించినప్పటికీ, ద్రవ్య పరంగా ఇది 2 శాతం దాటబోదని అంచనా. మిగిలినదంతా రుణ రూపంలో సమకూర్చినదేనన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రూ. 30 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీలను దశలవారీగా ప్రకటించింది. ఈ మొత్తం జీడీపీలో దాదాపు 15%. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నివేదిక విడుదల చేస్తూ, భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమేనని పేర్కొంది. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయని విశ్లేషించింది. లాక్డౌన్లు సడలించే సమయంలో ప్రకటించే అవకాశం: బెర్న్‌స్టెయిన్ సెకండ్ వేవ్ కట్టడికి వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న లాక్డౌన్లు, సంబంధిత ఆంక్షలు సడలించే సమయంలో కేంద్రం మరోదఫా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ అంచనావేసింది. ఏప్రిల్, మే నెలల్లో భారత్ ఆర్థిక క్రియాశీలత తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని తన సూచీలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఇంధన వినియోగం, విద్యుత్ డిమాండ్, ఈ–వే బిల్లులు, పారిశ్రామిక ఉత్పత్తి వంటి అంశాల్లో ప్రతికూల గణాంకాలు నమోదవుతున్నట్లు వివరించింది. అలాగే సరఫరాల సమస్యలూ తీవ్రమైనట్లు పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం పరిస్థితులు కొంత అదుపులో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సెకండ్‌వేవ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా, అది మొదటివేవ్ అంత తీవ్రంగా లేదని విశ్లేషించింది. -
కేసీఆర్‌తో సీఐఐ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ప్రతినిధుల బృందం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావును సోమవారం కలిసింది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని సీఐఐ ప్రెసిడెంట్, డీసీఎం శ్రీరాం చైర్మన్ అజయ్ ఎస్ శ్రీరాం ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. విద్యుత్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, పెట్టుబడులు, బ్రాండింగ్ తెలంగాణ తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో విద్యుత్ ఒకటని, పరిశ్రమకు నిరంతర విద్యుత్ అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంతో భేటీలో పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ సభ్యులు సుమిత్ మజుందార్, శోభన కామినేని తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్సీ అభినందన..: తెలంగాణ తొలి సీఎం, మంత్రులకు ఫ్యాప్సీ అభినందనలు తెలిపింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్యం త్వరితగతిన వృద్ధి చెందాలని ఆకాంక్షించింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా, వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్‌రెడ్డి చెప్పారు.