కేసీఆర్‌తో సీఐఐ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ప్రతినిధుల బృందం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావును సోమవారం కలిసింది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని సీఐఐ ప్రెసిడెంట్, డీసీఎం శ్రీరాం చైర్మన్ అజయ్ ఎస్ శ్రీరాం ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. విద్యుత్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్, పెట్టుబడులు, బ్రాండింగ్ తెలంగాణ తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో విద్యుత్ ఒకటని, పరిశ్రమకు నిరంతర విద్యుత్ అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంతో భేటీలో పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ సభ్యులు సుమిత్ మజుందార్, శోభన కామినేని తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాప్సీ అభినందన..: తెలంగాణ తొలి సీఎం, మంత్రులకు ఫ్యాప్సీ అభినందనలు తెలిపింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్యం త్వరితగతిన వృద్ధి చెందాలని ఆకాంక్షించింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా, వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్‌రెడ్డి చెప్పారు.