సాక్షి, న్యూఢిల్లీ : గతేడాది జూలై నెలలో ప్రవేశపెట్టిన వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)లో మరిన్ని సడలింపులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. విలాస వస్తువులను మినహా సామాన్య మానవులు ఉపయోగించే అన్ని వస్తువులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని ఆయన మంగళవారం నాడు ప్రకటించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోవడం, రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. మలేసియాలో గత ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బారిసన్ జాతీయ సంకీర్ణ (బీఎన్‌సీ) ప్రభుత్వం జీఎస్టీ కారణంగానే కుప్ప కూలిపోయిందన్న విషయాన్ని తెలుసుకొని కూడా మోదీ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.
మలేసియాలో మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన జీఎస్టీలో ఒకే స్లాబ్ కింద ఆరు శాతం పన్నును మాత్రమే విధిస్తున్నారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు ప్రభుత్వాన్ని కూల్చేశారు. భారత్‌లో మాత్రం జీఎస్టీని 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం కింద ఐదు స్లాబులను అమలు చేస్తున్నారు. గతంలో కొన్ని వస్తువులపై పన్ను స్లాబులను తగ్గించినప్పటికీ ఇప్పటికీ సామాన్యులు ఉపయోగించే అనేక వస్తువులు 28 శాతం పన్ను స్లాబులోనే ఉన్నాయి. ఇప్పుడు వీటిలో సామాన్యులు ఉపయోగించే 99 శాతం వస్తువులపై పన్నులను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని మోదీ ప్రకటించారు. సిమ్మెంట్, మోటారు సైకిళ్ల లాంటివి 28 శాతం పన్ను స్లాబుల్లో ఉన్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, జీఎస్టీ ద్వారా ఆశించిన పన్ను రాబడి రానప్పుడు మోదీ ఇచ్చిన హామీ మేరకు పన్ను కుదింపులు అమలు చేయడం అంత ఈజీ కాదు. గత ఫిబ్రవరి నెలలో 2018–2019 ఆర్థిక బడ్జెట్ సందర్భంగా జీఎస్టీ కింద నెలకు 1.2 లక్షల కోట్ల రూపాయల చొప్పున పన్ను రాబడి వస్తుందని అంచనా వేశారు. ఒక్క నెల కూడా వసూళ్లు లక్ష కోట్లు దాటిన దాఖలాలు లేవు. ఈ ఏడాది మొత్తంగా ఆశించిన దానికన్నా 90 వేల కోట్ల రూపాయల వసూళ్లు తగ్గుతాయని భారతీయ స్టేట్ బ్యాంక్ అంచనా వేయగా, దాదాపు లక్ష కోట్ల రూపాయలు తగ్గుతాయని బ్రోకరేజ్ సంస్థ ‘సీఎల్‌ఎస్‌ఏ’ అంచనా వేసింది. జీఎస్టీ నుంచి కార్పొరేట్ సంస్థలు ఇప్పటికీ బాగానే కోలుకున్నాయిగానీ మధ్యతరహా, చిన్న పరిశ్రమలు ఇప్పటికీ తేరుకోలేక పోతున్నాయి.
ముఖ్యంగా గుజరాత్‌లోని సూరత్, తమిళనాడులోని తిర్పూర్‌లో జౌళి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. దేశవ్యాప్తంగా 6.30 కోట్ల మంది చిన్న పారిశ్రామిక వేత్తలు 20 శాతం లాభాలను కోల్పోయారని, పర్యావసానంగా ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) గత జూలైలో విడుదల చేసిన అధ్యయనంలో వెల్లడించింది. మైక్రో, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం ఈ డిసెంబర్‌లో విడుదల చేసిన మరో అధ్యయనం పేర్కొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం జీఎస్టీ దేశంలో పెద్ద విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశించి, దేశ ప్రజలందరికి గుర్తుండేలా ప్రత్యేకంగా రాత్రి వేళ నిర్వహించిన పార్లమెంట్ సెషన్‌లో జీఎస్టీ బిల్లును ఆమోదింపచేశారు. నాటి సమావేశాన్ని కాంగ్రెస్, వామపక్షాలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు బహిష్కరించాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే జీఎస్టీని ఒకే స్లాబ్ కిందకు తెస్తామని, ఆ స్లాబు కూడా 18 శాతానికి మించదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment