సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2017, జూలై ఒకటవ తేదీ నుంచి ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద ఆశించిన రెవెన్యూ రావడం లేదు. 2018–2019 కేంద్ర వార్షిక బడ్జెట్ అంచనాల ప్రకారం 13,48,000 కోట్ల రూపాయలను జీఎస్టీ కింద వసూలు చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. అంటే నెలకు 1,12,000 కోట్ల రూపాయలను వసూలు చేయాలన్న మాట. అయితే ఏ ఒక్క నెలకూడా ఈ లక్ష్యాన్ని అందుకోలేక పోయింది.
2018–2019 ఆర్థిక సంవత్సరం అంతానికి ఆశించిన రాబడిలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు తగ్గుతాయని ‘కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్’ అంచనా వేసింది. పర్యవసానంగా ద్రవ్యలోటు 3.5 శాతం కన్నా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ)లో ద్రవ్యోల్బణం 3.3 శాతానికి మించరాదన్నది మోదీ ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యం. ద్య్రవ్యలోటు (రెవెన్యూ, ఖర్చు మధ్యనుండే వ్యత్యాసం)ను తగ్గించేందుకు రిజర్వ్ నిధులను అందజేయాల్సిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్‌పై మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది.
లక్షిత రాబడికి, వసూళ్లకు మధ్య ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వ పన్ను అధికారుల సామర్థ్యాన్ని ఓ సారి సమీక్షించాల్సిందిగా కోరుతూ కేంద్ర ఆర్థిక కార్యదర్శి హష్ముక్ అధియా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు గత జూన్ నెలలో ఓ లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాలు కేంద్రానికన్నా ఎక్కువ జీఎస్టీ వసూళ్లను రాబట్టాయని, రాష్ట్రాల అధికారుల కన్నా కేంద్రం అధికారుల తీరు అధ్వాన్నంగా ఉందా? అని కూడా ఆ లేఖలో ఆయన ప్రశ్నించారు. టర్నోవర్ ఏడాదికి కోటిన్నర తక్కువుండే వ్యాపార సంస్థలపై విధించే జీఎస్టీ పన్నులో 90 శాతం రాష్ట్రాలకు వెళుతుంది. మిగతా పది శాతం కేంద్రానికి వెళుతుంది. ఏడాదికి కోటిన్నర రూపాయలకు పైగా టర్నోవరుండే సంస్థలపై విధించే జీఎస్టీ పన్నులో కేంద్రానికి, రాష్ట్రానికి చెరి యాభై శాతం లభిస్తుంది. 2015–16 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రతి రాష్ట్రానికి పన్ను రాబడి ఏటా 14 శాతం పెరగాలి. అలా పెరగక తగ్గినట్లయితే ఆ వ్యత్యాసాన్ని కేంద్రం భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2018–2019 సంవత్సరానికి కేంద్రం పలు రాష్ట్రాలకు 3,899 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. మరో రెండు నెలలు పోతే ఈ మొత్తం మరో నాలుగింతలు పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ప్రతి రెండు నెలలకోసారి రాష్ట్రానికి రాబడి వ్యత్యాసాలను చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే ఈ సారి రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గానే ఉంది. 2017–2018 సంవత్సరానికి రాష్ట్రాలకు జీఎస్టీ రాబడి 16 శాతం తగ్గగా, 2018–19 సంవత్సరానికి రాబడి 13 శాతం మాత్రమే తగ్గింది.
Published Sat, Jan 5 2019 6:48 PM | Last Updated on Sat, Jan 5 2019 6:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment