న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం వ్యాపారాన్ని సులభతరం చేసిందని 90 శాతం మంది భారత్ పారిశ్రామిక ప్రతినిధులు భావిస్తున్నారని డెలాయిట్ సర్వే బుధవారం తెలిపింది. జీఎస్‌టీ విధానం అంతిమ వినియోగదారులకు సంబంధించి వస్తువులు, సేవల ధరల ప్రక్రియను సానుకూలం చేసిందని తెలిపింది. తమ సరఫరా చైన్లను పటిష్టం చేసుకోవడంలో కంపెనీలకు సైతం పరోక్ష పన్నుల విధానం దోహదపడుతోందని వివరించింది. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, వ్యాట్, 13 సెస్సులు వంటి 17 స్థానిక లెవీల స్థానంలో దేశవ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జీఎస్‌టీ:5 సర్వే 2022’ పేరుతో జరిపిన ఈ సర్వేలో వెల్లడయిన మరికొన్ని అంశాలు..
► నాలుగు వారాల పాటు జరిగిన సర్వేలో 234 మంది చీఫ్ ఎక్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), సీఎక్స్‌వో–1 స్థాయి ఇండివిడ్యువల్స్ పాల్గొని తమ అప్రాయాలను వ్యక్తం చేశారు. వినియోగదారులు, ఇంధన వనరులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, ప్రభుత్వ, ప్రజా సేవలు; లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ సహా పలు కీలక రంగాలపై జీఎస్‌టీ ప్రభావాన్ని సర్వే ట్రాక్ చేసింది.
► కీలక రంగాల్లోని తొంభై శాతం మంది సీఎక్స్‌వోలు జీఎస్‌టీ పరోక్ష పన్ను విధానాన్నికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ’ఒక దేశం, ఒకే పన్ను’ సంస్కరణ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అడ్డంకులను తగ్గించి, వ్యాపారాన్ని సులభంగా, ప్రభావవంతంగా మార్చిందని వారు అభిప్రాయపడ్డారు. అటు వ్యాపారవ్తేలకు ఇటు పన్ను చెల్లింపుదారులకు జీఎస్‌టీ విధానం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు.
► పన్నుల చెల్లింపునకు సంబంధించి ఆటోమేషన్, ఈ–ఇన్‌వాయిస్/ఈ–వే సౌకర్యాన్ని ప్రవేశపెట్ట డం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రయోజనకరమైన సంస్కరణ అని వారు తెలిపారు.
► వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి పన్ను వ్యవస్థ మరింత సరళతరం కావాలని విజ్ఞప్తి చేశారు.
► నెలవారీ, వార్షిక రిటర్న్స్ పక్రియను సులభతరం చేయడానికి సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడం కీలకమని తెలిపారు.
► ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మ్యాచింగ్‌ను సరళీకృతం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. పన్ను చెల్లింపుదారుల కోసం నిర్వహణా సంక్లిష్టతలను తగ్గించాలని, పన్ను వివాదాల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ఆయా అంశాలు తీవ్రమైన దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలకు దారితీస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
భారీ పన్ను వసూళ్లే విజయ సంకేతం
ఇటీవలి నెలల్లో జీఎస్‌టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ వ్యవస్థ గణనీయమైన విజయం సాధించిందనడానికి ఇదే ఉదాహరణ. వ్యవస్థ పట్ల పన్ను చెల్లింపుదారుల స్నేహ పూర్వక విధానాన్ని ఇది సూచిస్తోంది. ఈ పన్ను విభాగం మరింత విస్తృతంగా ప్రజాదరణ పొందడానికి మరిన్ని చర్యలు అమల్లోకి వస్తాయని అభిప్రాయపడుతున్నాం.
– మహేశ్ జైసింగ్, డెలాయిట్ విశ్లేషణ విభాగం ప్రతినిధి
ఎకానమీకి శుభ సంకేతం
గత మూడు నెలల్లో వరుసగా రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్‌టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్‌లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి.
– ఎంఎస్ మణి
డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్
వస్తు సేవల పన్ను విధానం సూపర్
Published Fri, Jun 17 2022 6:27 AM | Last Updated on Fri, Jun 17 2022 6:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment