ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్‌టీ కింద 18 శాతం ఏకీకృత పన్ను రేటు ఆచరణ సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మెర్సిడెస్ కారుకు, పాలకు ఒకే పన్ను విధించలేమని కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చుతూ మోదీ తేల్చిచెప్పారు. ఏకీకృత పన్ను విధానంతో ఆహార, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని అన్నారు. జీఎస్‌టీ అమలైన ఏడాది అనంతరం పరోక్ష పన్నుల వసూళ్లు 70 శాతం పెరిగాయని, చెక్‌పోస్ట్‌లను తొలగించి 17 పన్నులు, వివిధ రకాల 23 సెస్‌లను ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు.
కేంద్ర పరిధిలో ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను రాష్ట్రాల్లో వ్యాట్ వంటి పన్నుల స్ధానంలో జీఎస్‌టీ పరోక్ష పన్ను వ్యవస్థను సరళతర చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, వర్తకులు, ఇతర భాగస్వాములు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా జీఎస్‌టీలో మార్పులు చేపడతామని చెప్పారు.
జీఎస్‌టీలో 18 శాతంతో ఒకే పన్ను రేటు ఉండాలని కాంగ్రెస్ కోరుతున్నదని, అయితే ప్రస్తుతం జీరో, 5 శాతం పన్ను పరిధిలో ఉన్న ఆహారోత్పత్తుల ధరలు 18 శాతం పరిధిలోకి తెస్తే వాటి ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలు, మెర్సిడెస్ కారుపై ఒకే రకమైన పన్నులు వేయలేమని ప్రధాని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment