సాక్షి, హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న మోదీ పనుల ప్రధాని కాదని, పన్నుల ప్రధాని అని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తల్లి పాలపై మినహా అన్నింటి మీద జీఎస్టీ పేరుతో పన్నులు వేశారన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు.
మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడిది నిలకడ లేని మనస్తత్వమని కొట్టి పారేశారు. వ్యాపారాలు, కాంట్రాక్టులు ఆయన వ్యాపకమని, అందుకే నియోజకవర్గానికి రాలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి చెక్‌లను కూడా పంపిణీ చేసే సమయం ఆయనకు లేదని, అందుకే మంత్రిగా స్వయంగా తాను రంగంలోకి దిగి లబ్ధిదారులకు ఇచ్చినట్లు జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు.
అంతకు ముందు ఆయన మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేయడంతో పాటు రూ.50,000 విలువ చేసే రిమోట్ వీల్‌చైర్‌ను మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండలం గట్ల మల్లెపల్లి గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అచ్యుత్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో చండూరు జెడ్పీటీసీ వెంకటేశం, నాంపల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment