Deloitte survey
-
పండుగ సీజన్లో వాటి కొనుగోళ్లకే మొగ్గు.. డెలాయిట్ సర్వే సంచలన రిపోర్ట్!
న్యూఢిల్లీ: ప్రస్తుత పండుగల సీజన్లో వినియోగదారులు అధిక వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు డెలాయిట్ సర్వే వెల్లడించింది. లగ్జరీ, సెలబ్రేటరీ (వేడుకలకు సంబంధించి) వస్తువుల కొనుగోలు పెరగడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. సమీప భవిష్యత్తులో ఊహించని పెద్ద మొత్తంలో ఖర్చులు వచ్చినా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ‘డెలాయిట్ కన్జ్యూమర్ సిగ్నల్ రీసెర్చ్’ సర్వేలో సగం మంది చెప్పారు. ‘‘భారత్‌లో పండుగల సీజన్ సమీపిస్తోంది. దీంతో వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతోంది. 56 శాతం మంది వేడుకలకు సంబంధించిన (పుట్టిన రోజు, వివాహం తదితర) వస్తువులు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు’’అని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. సమీప కాలంలో వస్త్రాలు, వ్యక్తిగత సంరక్షణ, వినోదం, విహారంపై వ్యయాలు పెరగొచ్చని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని సాధిస్తుండడంతో, వినియోగదారులు విలాస వస్తువులు, ఖరీదైన వస్తువుల కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నట్టు డెలాయిట్ ఆసియా పసిఫిక్ పార్ట్నర్ రాజీవ్‌సింగ్ పేర్కొన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రవాణా, ఆతిథ్యానికి కూడా ఇదే ధోరణి విస్తరిస్తున్నట్టు చెప్పారు. టైర్ 2, 3 పట్టణాల్లోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగం పెరగనుందని, దీంతో రిటైల్, ఆటోమోటివ్, రవాణా, ఆతిథ్య రంగాలు ప్రయోజనం పొందుతాయని వివరించారు. భారత వినియోగదారులు కేవలం విలావవంతమైన కొనుగోళ్లకే పరిమితం కావడం లేదని, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. ఇందుకు నిదర్శంగా దేశీయ, అంతర్జాతీయ విమాన బుకింగ్‌లను పేర్కొంది. -
పెద్ద కంపెనీలకు పన్ను నిబంధనల భారం
న్యూఢిల్లీ: పన్నులపరంగా సంక్లిష్టమైన నిబంధనలను పాటించడంలో కంపెనీలు గణనీయంగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. బడా కంపెనీల్లోని ట్యాక్స్ టీమ్‌లు టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పటికీ ఏకంగా 70 శాతం సమయాన్ని ఇందుకోసమే కేటాయించాల్సి వస్తోంది. టీడీఎస్ నిబంధనలను పాటించడం సహా కంపెనీలు పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నిర్వహించిన ఒక సర్వేలో ఇది వెల్లడైంది. టీడీఎస్ డేటా రీకన్సిలియేషన్, తత్సంబంధ డేటాను ప్రాసెస్ / రీ–ప్రాసెస్ చేయడం వంటి అంశాల విషయంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది టీడీఎస్ నిబంధనల పాటింపుపైనే పూర్తిగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. టీడీఎస్ పరిధిలోకి మరిన్ని లావాదేవీలను చేర్చడంతో సమస్య మరింత జటిలమవుతోంది. ప్రస్తుతం కార్పొరేట్ ట్యాక్స్‌పేయర్లు సింహభాగం సమయాన్ని నిబంధనల పాటింపునకు కేటాయించడంతోనే సరిపోతోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రోహింటన్ సిధ్వా చెప్పారు. ఈ సంక్లిష్టతను తగ్గించాలంటే వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు సేకరించే డేటాను అన్ని విభాగాలు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటే శ్రేయస్కరమని సంస్థలు భావిస్తున్నాయి. ట్యాక్స్ రిపోర్టింగ్ నిబంధనలను సరళతరం చేయడం వల్ల మరింత వేగవంతంగాను, సమర్ధవంతంగాను ఖాతాల రీకన్సిలియేషన్లను చేయడానికి వీలవుతుందని కంపెనీలు కోరుతున్నట్లు డెలాయిట్ సర్వేలో వెల్లడైంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు.. ♦వార్షిక రిటర్నులు, జీఎస్టీ రిటర్నులతో పాటు వివిధ రూల్స్ కింద సమర్పించే ఫైలింగ్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా.. పాటించాల్సిన నిబంధనల సంఖ్యను తగ్గిస్తే ట్యాక్స్ డిజిటలైజేషన్‌కు దోహదపడగలదని సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో మూడింట రెండొంతుల సంస్థలు అభిప్రాయపడ్డాయి. వీటి టర్నోవరు రూ. 6,400 కోట్ల పైచిలుకు ఉంది. ♦ పన్ను నిబంధనల కింద రిపోర్ట్ చేయాల్సిన అంశాల రూల్స్‌ను సరళతరం చేయాలని బడా కంపెనీలు కోరుతున్నాయి. ♦రూ. 500 కోట్ల కన్నా తక్కువ టర్నోవరు ఉన్న వాటిల్లో అరవై నాలుగు శాతం సంస్థలు.. టెక్నాలజీ సహాయంతో టీడీఎస్/టీసీఎస్ నిబంధనలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నాయి. ♦ఐటీఆర్‌లలో ముందస్తుగానే వివరాలన్నీ పొందుపర్చి ఉండేలా ప్రవేశపెట్టిన ఈ–ఫైలింగ్ 2.0 ప్రయోజనకరంగా ఉంటోందని సంస్థలు తెలిపాయి. దీనివల్ల డేటాను సమగ్రపర్చేందుకు వెచ్చించాల్సిన సమయంతో పాటు లోపాలకూ ఆస్కారం తగ్గిందని కొత్త విధానాన్ని స్వాగతించాయి. అలాగే కొత్తగా తీర్చిదిద్దిన ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్ వినియోగానికి సులభతరంగా ఉందని పేర్కొన్నాయి. ♦స్క్రూటినీ కోసం కేసులను ఎంపిక చేసేందుకు కంప్యూటర్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టడం, రిటర్నుల ప్రాసెసింగ్ .. రిఫండ్లను వేగవంతం చేయడాన్ని రూ. 500–3,000 వరకు టర్నోవరు ఉన్న సంస్థలు స్వాగతించాయి. ♦రూ. 3,000–6,400 కోట్ల వరకు టర్నోవరు ఉన్న కంపెనీల్లో చాలా మటుకు సంస్థలు ఫేస్‌లెస్ అసెస్మెంట్లను స్వాగతించాయి. ♦కంపెనీ పరిమాణాన్ని బట్టి విజ్ఞప్తులు వివిధ రకాలుగా ఉంటున్నాయి. పెద్ద సంస్థలు ట్యాక్స్ రిపోర్టింగ్‌ను సరళతరం చేయాలని కోరుతుండగా, చిన్న సంస్థలు టీడీఎస్/టీసీఎస్ నిబంధనలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నాయి. ♦60 శాతం కంపెనీలు ఇప్పటికే లావాదేవీల పన్నులు, వార్షిక ట్యాక్సేషన్ ప్రక్రియ ఆటోమేషన్‌ను పూర్తి చేశాయి. మరో 40 శాతం సంస్థలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ♦ 129 మంది ట్యాక్స్ నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు. డైరెక్టర్లు, ఫైనాన్స్ విభాగాల ప్రెసిడెంట్లు, జనరల్ మేనేజర్లు, వైస్–ప్రెసిడెంట్లు మొదలైన వారు వీరిలో ఉన్నారు. ♦ ఆర్థిక సర్వీసులు, ప్రభుత్వ సర్వీసులు, లైఫ్ సైన్స్.. హెల్త్‌కేర్, టెక్నాలజీ, మీడియా టెలీకమ్యూనికేషన్ తదితర రంగాల సంస్థలను సర్వే చేశారు. -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్‌లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భారీ షాక్!, వచ్చే ఏడాది మిగిలిన రంగాల్లో..
మరో నెల రోజుల్లో 2022 గుడ్ బై చెప్పి న్యూఇయర్‌ని ఆహ్వానించబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మార్చి నెల ముగిసే సమయానికి (ఆర్ధిక సంవత్సరం) అన్నీ రంగాల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగుల శాలరీలు పెరుగుతాయని ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ వచ్చే ఏడాది వారి ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదితో పోలిస్తే జీతాల పెంపు 2023 తక్కువగా ఉండనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డెలాయిట్ ఇండియా మన దేశానికి చెందిన సుమారు 300 కంపెనీల నుండి డేటా సేకరించింది. ఆ డేటా ప్రకారం..వచ్చే ఏడాది ఏ విభాగంలో శాలరీ హైక్స్ ఎక్కువగా ఉంటాయి. ఏయే రంగాల్లో జీతాలు పెంపు తక్కువగా ఉంటుందో తెలిపింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫైనాన్షియల్ ఇయర్ - 2022లో జనవరి-డిసెంబర్ సంస్థల పనితీరు కారణంగా 2023 ఆర్ధిక సంవత్సరంలో వేతన పెంపు తక్కువగా ఉంటాయని అంచనా. పెరిగే రంగాలు? ముఖ్యంగా భారత ఎకానమీకి ఆర్ధికంగా వెన్నదన్నుగా నిలిచే రంగాలైన హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం, కన్స్యూమర్/ఎఫ్ఎంసీజీ, పవర్ వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది శాలరీ హైకులు ఎక్కువగా ఉంటాయని ఎకనామిక్ టైమ్స్‌కు డెలాయిట్ ఇండియా తెలిపింది. మరి టెక్ కంపెనీల్లో? ఇక ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా టెక్ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. తద్వారా టెక్ కంపెనీల్లో శాలరీల పెంపు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో రెసిషన్ భయాలు వణికించడంతో టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుందని, అందుకు మెటా, అమెజాన్, ట్విటర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలతో పాటు ఇతర టెక్ కంపెనీల పనితీరే నిదర్శనమని డెలాయిట్ నివేదిక హైలెట్ చేస్తుంది. వచ్చే ఏడాది సైతం ఐటీ రంగం ఈ తరహా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఎక్కుగా కనిపిస్తున్నాయని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేతన పెంపు , నిలిచి పోనున్న నియామకాలు! ఐటీ ప్రొడక్ట్ కంపెనీల్లో శాలరీల పెంపు 2022 ఆర్థిక సంవత్సరంలో 12 శాతంగా ఉండగా.. 2023 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతం పెరుగుతాయని అంచనా. ఐటి సర్వీసెస్ లో వేతన పెంపు 2022 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతంతో పోలిస్తే 2023లో 8.8 శాతంగా ఉండనుంది. థర్డ్ పార్టీ ఐటి సేవలు 2022 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వద్ద ఉంటాయని అంచనా వేయగా..క్యాప్టివ్ సేవలు (ఔట్ సోర్సింగ్) 2022 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతానికి తగ్గుతాయని భావిస్తున్నారు. వేతనాల పెంపు ఇలా ఉంటే కొత్త నియామకాలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని అంచనా. జోరుమీదున్న సర్వీస్ సెక్టార్ సర్వీస్ సెక్టార్లో అప్రైజల్ అంచనాలు 2023 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతంగా ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతంగా ఉంది. అదేవిధంగా, హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం రంగంలోని ఉద్యోగులు ఈ ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం వేతన పెంపును పొందవచ్చు, ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నుండి పెరిగింది. రిటైల్ విభాగంలో శాలరీల పెరుగుదల స్థూలంగా 8.0 శాతం వద్ద ఫ్లాట్ గా ఉంటుందని భావిస్తున్నారు. కన్స్యూమర్/ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలో ఇంక్రిమెంట్లు 9.8 శాతం ఉండనున్నాయి. పవర్, పునరుత్పాదక శక్తిని(రెన్యూవబుల్ ) వంటి విభాగాల్లో శాలరీలు పెరగనున్నాయని భావిస్తున్నారు. పునరుత్పాదక ఉద్యోగులు 9.6 శాతం నుండి 11 శాతం పెరుగుదలను చూస్తున్నారు. సంప్రదాయ విద్యుత్ రంగంలోని కార్మికులు 2022 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం నుండి 9.5 శాతం ఇంక్రిమెంట్లను చూడవచ్చు. ఫార్మాలో 8.9 శాతం వద్ద ఫ్లాట్‌గా ఉంటాయని భావిస్తున్నారు. -
వస్తు సేవల పన్ను విధానం సూపర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం వ్యాపారాన్ని సులభతరం చేసిందని 90 శాతం మంది భారత్ పారిశ్రామిక ప్రతినిధులు భావిస్తున్నారని డెలాయిట్ సర్వే బుధవారం తెలిపింది. జీఎస్టీ విధానం అంతిమ వినియోగదారులకు సంబంధించి వస్తువులు, సేవల ధరల ప్రక్రియను సానుకూలం చేసిందని తెలిపింది. తమ సరఫరా చైన్లను పటిష్టం చేసుకోవడంలో కంపెనీలకు సైతం పరోక్ష పన్నుల విధానం దోహదపడుతోందని వివరించింది. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, వ్యాట్, 13 సెస్సులు వంటి 17 స్థానిక లెవీల స్థానంలో దేశవ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జీఎస్టీ:5 సర్వే 2022’ పేరుతో జరిపిన ఈ సర్వేలో వెల్లడయిన మరికొన్ని అంశాలు.. ► నాలుగు వారాల పాటు జరిగిన సర్వేలో 234 మంది చీఫ్ ఎక్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), సీఎక్స్‌వో–1 స్థాయి ఇండివిడ్యువల్స్ పాల్గొని తమ అప్రాయాలను వ్యక్తం చేశారు. వినియోగదారులు, ఇంధన వనరులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, ప్రభుత్వ, ప్రజా సేవలు; లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ సహా పలు కీలక రంగాలపై జీఎస్టీ ప్రభావాన్ని సర్వే ట్రాక్ చేసింది. ► కీలక రంగాల్లోని తొంభై శాతం మంది సీఎక్స్‌వోలు జీఎస్టీ పరోక్ష పన్ను విధానాన్నికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ’ఒక దేశం, ఒకే పన్ను’ సంస్కరణ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అడ్డంకులను తగ్గించి, వ్యాపారాన్ని సులభంగా, ప్రభావవంతంగా మార్చిందని వారు అభిప్రాయపడ్డారు. అటు వ్యాపారవ్తేలకు ఇటు పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీ విధానం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. ► పన్నుల చెల్లింపునకు సంబంధించి ఆటోమేషన్, ఈ–ఇన్వాయిస్/ఈ–వే సౌకర్యాన్ని ప్రవేశపెట్ట డం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రయోజనకరమైన సంస్కరణ అని వారు తెలిపారు. ► వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి పన్ను వ్యవస్థ మరింత సరళతరం కావాలని విజ్ఞప్తి చేశారు. ► నెలవారీ, వార్షిక రిటర్న్స్ పక్రియను సులభతరం చేయడానికి సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడం కీలకమని తెలిపారు. ► ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మ్యాచింగ్‌ను సరళీకృతం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. పన్ను చెల్లింపుదారుల కోసం నిర్వహణా సంక్లిష్టతలను తగ్గించాలని, పన్ను వివాదాల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ఆయా అంశాలు తీవ్రమైన దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలకు దారితీస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారీ పన్ను వసూళ్లే విజయ సంకేతం ఇటీవలి నెలల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ వ్యవస్థ గణనీయమైన విజయం సాధించిందనడానికి ఇదే ఉదాహరణ. వ్యవస్థ పట్ల పన్ను చెల్లింపుదారుల స్నేహ పూర్వక విధానాన్ని ఇది సూచిస్తోంది. ఈ పన్ను విభాగం మరింత విస్తృతంగా ప్రజాదరణ పొందడానికి మరిన్ని చర్యలు అమల్లోకి వస్తాయని అభిప్రాయపడుతున్నాం. – మహేశ్ జైసింగ్, డెలాయిట్ విశ్లేషణ విభాగం ప్రతినిధి ఎకానమీకి శుభ సంకేతం గత మూడు నెలల్లో వరుసగా రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి. – ఎంఎస్ మణి డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
సగటున వేతన పెంపు 9.1 శాతం
న్యూఢిల్లీ: వేతన జీవులకు ఈ ఏడాది అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కల్పించిన ప్రతికూలతలతో గత రెండేళ్లుగా మంచి వేతన పెంపు అన్నది ఉద్యోగులకు లేకుండా పోయింది. కానీ, ఈ ఏడాది సగటున 9.1 శాతం మేర వేతనాల పెంపు ఉంటుందని డెలాయిట్ టచ్ తోమత్సు ఇండియా తెలిపింది. ఈ సంస్థ ‘2022 వర్క్‌ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్స్ ట్రెండ్స్’ పేరుతో సర్వే నిర్వహించింది. 2021లో సగటు వేతన పెంపు 8 శాతంగా ఉంది. కరోనాకు ముందు 2019లో వేతన పెంపుతో పోల్చినా ఈ ఏడాది అర శాతం అధికంగా ఉంటుందన్న అంచనాలు ఈ సర్వేలో వ్యక్తమయ్యాయి. ‘‘2020లో కరోనా రక్కసి ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి తీసుకెళ్లింది. దాంతో వేతన పెంపులు తగ్గిపోవడం, వేతన కోతలు, నియామకాలు నిలిచిపోవడం వంటివి చూశాము. 2021లో వేతన పెంపులు పుంజుకున్నాయి. వేతన కోతలు కనిపించలేదు. కరోనా ప్రత్యేక ప్రయోజనాలు అమల్లోకి వచ్చాయి. 2022లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, నియామకాలు పెరగడం, ఉద్యోగుల వలసలు వంటి పరిస్థితులతో కంపెనీలు వేతన పెంపుల విషయంలో కరోనా ముందు నాటి స్థాయిని దాటిపోనున్నాయి. ప్రోత్సాహకాలు ఇచ్చి నైపుణ్యం కలిగిన వారిని నిలుపుకోవాల్సిన పరిస్థితుల్లో కంపెనీలు ఉన్నాయి’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనందరూప్ ఘోష్ తెలిపారు. ఈ సర్వేలో 450 సంస్థలు పాల్గొన్నాయి. నివేదికలోని వివరాలు.. ► 34 శాతం సంస్థలు రెండంకెల వేతన పెంపులు ఇవ్వనున్నట్టు తెలిపాయి. 2021లో ఇలా చెప్పిన కంపెనీలు 20 శాతమే ఉంటే, 2020లో 12 శాతంగా ఉంది. ► అన్ని ప్రముఖ రంగాల్లోనూ వేతన పెంపులు ఈ ఏడాది అధికంగా ఉంటాయి. ► లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాల్లో అధికంగాను, ఫైనాన్స్ టెక్నాలజీ, ఐటీ ప్రొడక్ట్ కంపెనీలు, డిజిటల్/ఈకామర్స్ కంపెనీలు రెండంకెల పెంపును ఇవ్వనున్నాయి. ► వేతన ప్రోత్సాహకాలు అందరికీ ఒకే మాదిరిగా కాకుండా.. వారి పనితీరు ఆధారంగా ఇవ్వనున్నట్టు 92 శాతం కంపెనీలు తెలిపాయి. సగటు పనితీరు చూపించే వారితో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించే వారికి 1.7 రెట్లు అధికంగా పెంపు ఇవ్వనున్నట్టు చెప్పాయి. ► జూనియర్ స్థాయిల్లోని వారికి ఎక్కువగాను, అధిక వేతన స్థాయిల్లోని వారికి తక్కువగాను పెంపు ఉండనుంది. ► ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 2020లో 15.8 శాతంగా ఉంటే 2021లో 19.7 శాతానికి పెరిగింది. ► వలసలకు చెక్ పెట్టేందుకు అధిక వేతన పెంపుతోపాటు, ఒక విడత బోనస్ వంటి ప్రయోజనాలను ఇచ్చే ఉద్దేశ్యంతో కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు నైపుణ్య శిక్షణపై పెట్టుబడి పెట్టనున్నాయి. ► 2022లో 90 శాతానికి పైగా కంపెనీలు బోనస్ ఇవ్వాలనుకుంటున్నాయి. ఉద్యోగిపై పెరగనున్న వ్యయం ‘‘2022లో 9.1 శాతం వేతన పెంపు అన్నది ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకే. అదనపు నియామకాలు, ఒక్క విడత వేతన దిద్దుబాట్లు, రిటెన్షన్ బోనస్‌లను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మీద ఉద్యోగిపై చేసే వ్యయం పెరిగిపోనుంది’’ అని డెలాయిట్ పార్ట్నర్ అనుభవ్ గుప్తా తెలిపారు. మధ్య నుంచి దీర్ఘకాలానికి ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార వృద్ధిపైనే వేతన పెంపులు ఆధారపడి ఉంటాయని అంచనా వేశారు. -
కరోనా మహమ్మారిలోనూ బలంగా నిలబడ్డ పరిశ్రమలివే
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలు కరోనా మహమ్మారి కాలంలోనూ తమ బలాన్ని చాటుతున్నాయని..భవిష్యత్తులో ఇవి మరింత విలువను సృష్టించే విధంగా అభివృద్ధి చెందగలవని డెలాయిట్–ఫిక్కీ నివేదిక అభిప్రాయపడింది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు డిజిటల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులకు చేరువ కావాలని సూచించింది. వనరులను సమకూర్చుకోవడం, ఉత్పత్తి, ప్యాకేజింగ్ విషయంలో స్థిరత్వం ఉండేలా చర్యలు అవసరమని పేర్కొంది. ఈ నివేదిక గురువారం విడుదలైంది. ‘‘వినియోగ డిమాండ్‌ను కరోనా పూర్తిగా మార్చేసింది.సరఫరా వ్యవస్థలకు సవాళ్లు విసిరింది. కొన్నింటిని సమూలంగా మార్చేసింది. వ్యాపారాలకు ఇక నూతన సాధారణ అంశాలుగా మార్చేసింది’’అని వివరించింది. డిజిటైజేషన్‌తో కిరాణాల సామర్థ్యం పెరగనుందని.. ఎఫ్ఎంసీజీ రంగానికి వృద్ధి అవకాశాలు తీసుకొస్తుందని అంచనా వేసింది. నేరుగా వినియోగదారుణ్ణి చేరుకునే మార్గాలపై కంపెనీలు దృష్టి పెట్టాలని సూచించింది. కాస్మొటిక్స్, బేబీ కేర్, వెల్నెస్ విభాగాల్లో ఈ కామర్స్ ఇకమీదట మరింత వేగంగా విస్తరిస్తుందని పేర్కొంది. చదవండి: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది -
ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
కోవిడ్ రాకతో ఐటీ సంస్థల్లో నెలకొన్న అనిశ్చితితో చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయి. అంతేకాకుండా పలు వ్యాపార కార్యకలాపాలు కూడా గణనీయంగా పడిపోయాయి. కాగా ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్నాయి. దాంతో పాటుగా పలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా భారీగా ఉద్యోగ నియమాకాలను చేపడుతున్నాయి. తాజాగా డెలాయిట్ చేపట్టిన సర్వే ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ను అందించింది. చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..! వచ్చే ఏడాది వేతనాల పెంపు..! ఇప్పటికే పలు ఐటీ కంపెనీల్లో పనిచేస్తోన్న ఉద్యోగులకు వచ్చే ఏడాది 2022లో సుమారు 8.6 శాతం వరకు ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని డెలాయిట్ తన సర్వేలో వెల్లడించింది. 2022 నాటికి పలు సంస్థలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని డెలాయిట్ సర్వే పేర్కొంది. కంపెనీలోని టాప్‌పర్ఫార్మర్స్‌కు సగటు ఉద్యోగుల కంటే 1.8 రెట్లు ఎక్కువ ఎక్కువ వేతనాలు పొందుతారని డెలాయిట్ తన సర్వేలో పేర్కొంది. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీల్లో సుమారు 12 శాతం ఉద్యోగులకు ప్రమోషన్స్‌ను పొందారు. 2020లో ఇది 10 శాతంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీలు సుమారు 78 శాతం మేర నియామకాలను చేపడుతున్నాయి. పర్యాటక రంగంలో అంతంతే..! రిటైల్, హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, మౌలిక, రియాలీటీ రంగంలో వేతనాల పెంపు ఉండక్కపోవచ్చునని డెలాయిట్ అభిప్రాయపడింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు జంకుతుండడంతో పర్యాటకరంగంలో వేతనాల పెంపు ఉండకపోవచ్చునని డెలాయిట్ సర్వే పేర్కొంది. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..! -
వేతన పెంపు అరకొరే..
సాక్షి, న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీ కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు సగటున 7.8 శాతం వేతన పెంపును చేపడతాయని డెలాయిట్ ఇండియా సర్వే వెల్లడించింది. కంపెనీలపై మార్జిన్ ఒత్తిళ్లు, ఆర్థిక మందగమనం వంటి కారణాలతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే వేతన వృద్ధి తగ్గుముఖం పట్టిందని డెలాయిట్ ఇండియా పేర్కొంది. 2019-20లో ఉద్యోగుల వేతనాలు సగటున 8.2 శాతం మేర పెరిగాయని, ఈసారి వేతన వృద్ధి 40 బేసిస్ పాయింట్లు తక్కువగా నమోదవుతుందని అంచనా వేస్తున్నామని సిబ్బంది వేతన ధోరణుల పేరిట రూపొందిన సర్వే నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 50 శాతం కంపెనీలు 2020-21లో వేతనాలు 8 శాతంలోపు పెరుగుతాయని పేర్కొనగా, 10 శాతం పైగా వేతన పెంపు ఉంటుందని కేవలం 8 శాతం కంపెనీలే ఆశాభావం వ్యెక్తం చేశాయని సర్వే స్పష్టం చేసింది. ఇక 30 శాతం కంపెనీలు వేతన పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఇక మౌలిక, నిర్మాణ రంగం, బ్యాంకింగేతర కంపెనీలు, టెలికాం రంగాల్లో వేతన పెంపు తక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. వైవిధ్యం, సామర్ధ్యం ఆధారంగా కంపెనీలు వ్యయ బడ్జెట్లను నిర్వహిస్తున్నాయని తెలిపింది. పలు రంగాలకు సంబంధించిన 300 కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులను పలుకరించి ఈ సర్వే నివేదికను రూపొందించినట్టు డెలాయిట్ తెలిపింది. చదవండి : ఆ ఉద్యోగులకు బోనస్ బొనాంజా -
కష్టాల కడలిలో కంపెనీలు..!
ప్రస్తుతం యూరోపియన్ కంపెనీలన్నీ కష్టాల కడలిలో ఉన్నాయని బిజినెస్ లీడర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇస్లామిక్ దేశాల్లో నెలకొంటున్న మాదిరిగా యూరోపియన్ దేశాల్లో ప్రాంతీయ రాజకీయ ప్రమాదాలు, యూరోపియన్ శరణార్థ సంక్షోభం, వ్యాపారాల విజయానికి పెద్ద ప్రమాదాలుగా మారుతున్నాయని బిజినెస్ లీడర్లు భయాందోళనకు గురవుతున్నారు. బ్రిటన్ లో బ్రెగ్జిటే అత్యంత ప్రమాదకరంగా మారిందని డెలాయిట్ నిర్వహించిన తాజా యూరోపియన్ సీఎఫ్ఓ సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో 17 యూరోపియన్ దేశాల్లో 1,500 సీఎఫ్ఓలపై డెలాయిట్ ఈ సర్వేను చేపట్టింది. క్యాపిటల్ మార్కెట్, ఫండింగ్, బిజినెస్ రిస్క్, మొత్తంగా మార్కెట్ సెంటిమెంట్ వంటి అంశాలపై విశ్లేషణ చేపట్టింది. 2016లో యూరప్ లో అతిపెద్ద కంపెనీలు సాధించే ఫైనాన్సియల్ విజయాలకు ఎదురవుతున్న సవాలపై ప్రధానంగా దృష్టిసారించి డెలాయిట్ ఈ రిపోర్టును రూపొందించింది. ప్రాంతీయ రాజకీయాల ఆధిపత్యం, జనాభా పెరుగుదల, కరెన్సీ విలువలు పడిపోవడం, ఆర్థిక విధానంలో భయాందోళనలు, డీప్లేషన్, వంటివి దేశాల్లో ఉన్న ప్రధాన అవరోధాలుగా సర్వే పేర్కొంది. ప్రాంతీయ రాజకీయాల సంక్షోభం అత్యధిక యూరప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ల మదిలో కొనసాగుతున్న అతిపెద్ద సమస్యగా సర్వే గుర్తించింది. దురదృష్టవశాత్తు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ ప్రజాభిప్రాయం రావడం ప్రస్తుతం బిజినెస్ లకు అతిపెద్ద నష్టంగా సీఎఫ్ఓలు పరిగణించారని సర్వేలో వెల్లడైంది. ఈ ఫలితాలు యూకే సీఎఫ్ఓల్లో సెంటిమెంట్ ను బలహీనపరస్తోందని రిపోర్టు నివేదించింది. యూకే ఎజెండాను బ్రెగ్జిట్ రెఫరెండం డామినేట్ చేస్తుందని పేర్కొంది. యూకేలోని చాలా అతిపెద్ద కంపెనీలు ఊహించని విధంగా రెఫరెండం వచ్చిందని, బ్రెగ్జిట్ కు ఇంకా కంపెనీలు ప్రిపేర్ కాన్నట్టు డెలాయిట్ రిపోర్టు తెలిపింది.